పోలవరం.. నేను బతికుండగా పూర్తికాదు!
ABN, First Publish Date - 2022-08-04T08:53:26+05:30
పోలవరం.. నేను బతికుండగా పూర్తికాదు!
ఈ మాట ఎప్పుడో చెప్పాను
మంత్రి అంబటీ ధైర్యంగా అన్నారు
డయాఫ్రం వాల్ కొట్టుకుపోతే.. నిర్మాణ కంపెనీ బాధ్యత లేదా?
అప్పటి అధికారులు ఇప్పుడూ ఉన్నారుగా!
ఈసీఆర్‌ఎఫ్ డ్యామే అసలు డ్యాం
అది ఇంకా మొదలే కాలేదు: ఉండవల్లి
రాజమహేంద్రవరం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ఎంతవరకూ పూర్తయిందో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. స్పిల్‌వేకు ఎంత ఖర్చు చేశారు.. కాఫర్ డ్యాం నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారు.. పునరావాసానికి ఎంత ఖర్చు చేశారు.. ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది. అసలు డ్యాం అయిన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం ఎప్పుడు కడతారు. దానికి ఎంత అవసరం ఉంటుందో అన్ని వివరాలూ అందులో ఉండాలని స్పష్టం చేశారు. ఆయన బుధవారమిక్కడ ధర్మంచర హాల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇటీవల చాలా ధైర్యంగా పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని ప్రకటించారు. జగన్, చంద్రబాబు, దేవినేని ఉమ, అనిల్‌కుమార్ కూడా చేయలేని ధైర్యం చేశారు. ఆయన చెప్పింది నిజమే. నేను బతికి ఉండగా ఈ ప్రాజెక్టు పూర్తవ్వదని ఎప్పుడో చెప్పాను’ అని తెలిపారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింనట్లు జగన్ ప్రభుత్వం చెబుతోందని.. అది నిర్మించిన కంపెనీ, అది చేయించిన ఇంజనీర్లంతా ఇప్పుడూ ఉన్నారని.. వారిని ఎందుకు బాధ్యులను చేయరని నిలదీశారు. ‘ఏ ప్రాజెక్టు విషయంలోనైనా బాధ్యత రాజకీయ పార్టీలది కాదు. ప్రభుత్వానిదే. ప్రభుత్వమనేది నిరంతర ప్రక్రియ. మానవ తప్పిదం భయంకరమైన తప్పిదం. డయాఫ్రం వాల్ తిరిగి కట్టడానికి రూ.2 వేల కోట్లు అవసరమని చెబుతున్నారు. మరి బాధ్యులెవరో చెప్పరేం? కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ నిర్మించిన అధికారులు ఇప్పుడూ ఉన్నారు కదా! పోలవరం వల్ల భద్రాచలం మునిగిపోతుందనే వాదన మొదలుపెట్టారు. అసలు పోలవరం అంగుళమైనా కట్టారా? స్పిల్‌వే, కాఫర్ డ్యాం నిర్మించి, గోదావరి నదిని కాస్త దూరం మళ్లిస్తే ప్రాజెక్టు పూర్తయినట్లేనా? అసలు డ్యాం అయిన ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు మొదలెట్టనేలేదు కదా’ అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలో తాడువాయి గ్రామంలో 126 కుటుంబాలు ఉన్నాయని.. వారు తమకు నష్టపరిహారం ఇస్తేనే గానీ ప్రాజెక్టు కట్టవద్దని కోర్టుకెళ్లారని.. 126 కుటుంబాలకు ఈ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదా అని నిలదీశారు. ఒక నిపుణుడిని నియమించి, ప్రజలకు అర్థయ్యేలా చెప్పించాలని డిమాండ్ చేశారు. ‘సీఎం జగన్ సపోర్టు వల్లే రాష్ట్రపతిగా ముర్ము గెలిచారు. ఆయన ప్రత్యేక హోదా అడగరు. అప్పులు జగనే కాదు.. కేంద్రమూ చేస్తోంది. అప్పులు చేయడం జగన్ ఫిలాసఫీ.. యాంటీ క్రిస్టియన్ బీజేపీ ఫిలాసఫీ. రాష్ట్రంలో బీజేపీ గెలవదు. కానీ ఇక్కడే దానికి బలం ఉంది. జగన్, చంద్రబాబు కూడా సపోర్టు చేస్తున్నారు’ అని తెలిపారు. జగన్ అన్ని హామీలూ 90 శాతం అమలు చేస్తున్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. కానీ ఆయన రోడ్లు వేయిస్తానని, జీతాలు సక్రమంగా చెల్లిస్తానని ఎక్కడా హామీ ఇవ్వలేదు కదా.. అన్ని పనులూ ఎలా చేసేస్తారని ఎద్దేవాచేశారు.
సోనియా, రాహుల్‌ను అప్రతిష్ఠ పాల్జేసేందుకే!
దేశంలో స్వేచ్ఛ హరించుకుపోతోందని.. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడడానికి వీలు లేకుండా చేస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు. ‘దేశంలో అంతా మోడీ-ఈడీ అన్నట్టు నడుస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీలను ప్రజల్లో అప్రతిష్ఠ పాల్జేసి.. వారికి స్విస్ బ్యాంకుల్లోనూ డబ్బులున్నాయని నమ్మించడానికి బీజేపీ వ్యూహం పన్నింది. మేధావులను కూడా వదలడం లేదు. జై శ్రీరామ్ అంటేనే పునీతమవుతామనే పరిస్థితి ఏర్పడింది’ అని ఆక్షేపించారు.
Updated Date - 2022-08-04T08:53:26+05:30 IST