Jagan pics: ఫొటోల పిచ్చి పీక్స్!
ABN, First Publish Date - 2022-12-18T02:31:23+05:30
ఇల్లొకరిది, ఇంటి పత్రం ఒకరిది! దానిపై ఫొటోలు మాత్రం... సీఎం జగన్, ఆయన తండ్రి వైఎ్‌సలవి! ప్రైవేటు ఆస్తులకు ప్రభుత్వం ఇచ్చే ధ్రువీకరణలకూ సొంత పేర్లూ, సొంత ఫొటోలే! శాశ్వత భూహక్కులో భాగంగా పొలాలను రీసర్వే చేస్తున్న సంగతి తెలిసిందే.
పొలాల నుంచి పట్నాల్లోని ఇళ్లకు
ప్రైవేటు ఆస్తులపైనా జగన్ బొమ్మలు
కొత్తగా ‘వైఎస్ తలపాగా’ ఫొటో కూడా
తండ్రి బొమ్మకూ వైసీపీ రంగులే
‘రీ సర్వే’ల్లో ఎన్నెన్నో వింతలు
మా పొలానికి మీరు హక్కు ఇచ్చేదేంటని రైతులు నిరసించినా... మా పొలం పత్రాలపై ప్రతి పేజీలో మీ ఫొటోలేమిటని ఈసడించినా ప్రభుత్వ పెద్దలు మారలేదు. ఫొటోల పిచ్చిని పల్లెల్లోని పొలాల నుంచి పట్టణాల్లోని ఇళ్లకు విస్తరింపజేస్తున్నారు. ఇప్పుడు... పట్టణాల్లోని ఇళ్లకు ‘ఆస్తి యాజమాన్య ధ్రువపత్రం’ ఇస్తారట! పొలం పత్రాలపై సీఎం జగన్ ఫొటోతో సరిపెట్టగా... పట్టణాల్లోని ఇళ్ల యజమానులకు ఇచ్చే పత్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో కూడా ముద్రించారు. అదికూడా ఆయన తలపాగా చుడుతున్న చిత్రం! ఇందులోనూ ఒక విచిత్రముంది! ఒరిజినల్ ఫొటోలో వైఎస్ ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల కండువాను చుట్టుకుంటూ కనిపిస్తారు. ఇప్పుడు... ఆ రంగులను గ్రాఫిక్స్‌లో తీసేసి వైసీపీ రంగులను పులిమారు!
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఇల్లొకరిది, ఇంటి పత్రం ఒకరిది! దానిపై ఫొటోలు మాత్రం... సీఎం జగన్, ఆయన తండ్రి వైఎ్‌సలవి! ప్రైవేటు ఆస్తులకు ప్రభుత్వం ఇచ్చే ధ్రువీకరణలకూ సొంత పేర్లూ, సొంత ఫొటోలే! శాశ్వత భూహక్కులో భాగంగా పొలాలను రీసర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పట్నాల్లోని ప్రైవేటు ఆస్తులను కొలిచి తిరిగి పట్టాలు ఇస్తామని ప్రభు త్వం ప్రకటించింది. అయితే, ఆ పట్టాలను జగన్, ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి బొమ్మలతో పంపిణీ చేస్తామనడంతో ఫొటోల పిచ్చిని పరాకాష్ఠకు చేర్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాల్లో రీసర్వే నిర్వహించేందుకు ‘జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం’ తీసుకొచ్చింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వమే రీసర్వే పథకాలను దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే ఈప్రక్రియను ప్రారంభించారు. పట్టణాల్లో ఆయా కుటుంబాల ఆస్తులను రీసర్వే చేపట్టి, వారి ఆస్తులకు సంబంధించి భూహక్కు పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా హక్కు పత్రం నమూనాను విడుదల చేశారు. ఈ నమూనాలో జగన్ బొమ్మతోపాటు ఆయన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బొమ్మ ముద్రించి ఉంది. అప్పట్లో వైఎస్ తలపాగా కాషా యం, ఆకుపచ్చ, తెలుపు రంగులు కలిగిన ఖద్దరు ధరించేవా రు. అయితే ఈ ఫొటోలో వైఎస్ ఆకుపచ్చ, నీలి రంగు (వైసీ పీ జెండా రంగులు) తలపాగా చుట్టుకుని ఉండటం గమనార్హం.
మొదట్నించీ ఉన్న పిచ్చే...
జగన్‌కు మొదట్నించీ బొమ్మల పిచ్చి, ఫొటోల పిచ్చి ఎక్కువగా ఉందని పలువురు ఆ పార్టీనేతలు చెప్పుకొంటుంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీ, సచివాలయ భవనాలు, పీహెచ్‌సీలు, స్కూళ్లు, వాటర్‌ట్యాంకులతోపాటు చెత్తకుండీలూ వదిలిపెట్టకుండా వైసీపీ రంగులు పులిమారు. సచివాలయ భవనాల బోర్డులపై జగన్ ఫొటోలు పెయింట్ చేయించారు. సచివాలయ భవనాలకు రంగులు మార్చడానికి హైకోర్టు పలు దఫాలు ఉత్తర్వులు జారీచేయాల్సి వచ్చింది. గ్రామాల్లో రీసర్వే తర్వాత పొలాల్లో వేయాల్సిన సర్వే రాళ్లపైనా జగన్ ఫొటో ముద్రించాలని ప్రయత్నించారు. ప్రజలు, పత్రికల నుంచి విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. రీసర్వే ద్వారా పాస్‌బుక్‌లు కొత్తవి ముద్రించి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పాస్‌బుక్‌లపై కూడా జగన్ బొమ్మ ముద్రించి ఇవ్వాలని నమూనాను సిద్దం చేశారు.
మా ఆస్తులపై మీ బొమ్మలేంటి?
పట్టణాల్లో రీసర్వీ కోసం వస్తున్న అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. ‘మాసొంత ఆస్తుల కోసం ఇచ్చే పత్రాలపై మీ బొమ్మలు వేసుకోవడం ఏమిటి’ అని ఆగ్రహిస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత జగన్ స్థానంలో ఒకవేళ మరొకరు సీఎం అయితే... మళ్లీ ఈ పత్రాలు మార్చాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం మారినప్పుడల్లా హక్కు పత్రాలు మార్చడం ద్వారా వాటికి శాశ్వత భూహక్కు పత్రం అని పేరెలా పెడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పట్టణాల్లో జగన్ బొమ్మలు వేసి హక్కు పత్రాలు ఇచ్చేందుకే ఈ పథకం తెచ్చినట్లుందని అనుమాన పడుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణాల్లో రీసర్వేకు వెళ్లిన బృందాలకు చుక్కెదురవుతోంది. తాము ఇతరుల వద్ద కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేయించుకున్నామని, అందుకోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఫీజులు కూడా చెల్లించామంటూ అధికారులను తిప్పి పంపేస్తున్నారు. తమ ఆస్తుల పత్రాలపై ఫొటోలు ముద్రించడం ద్వారా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లకు విలువ లేకుండా చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
Updated Date - 2022-12-18T04:08:42+05:30 IST