ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇనుమడించిన యాత్రోత్సాహం

ABN, First Publish Date - 2022-09-15T09:17:48+05:30

ఇనుమడించిన యాత్రోత్సాహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడోరోజూ పాదయాత్రలో అదే జోరు

కలిసి నడిచిన బీసీలు, దళితులు, లాయర్లు.. గ్రామాలను కదిలిస్తున్న రైతుల కష్టం

‘రాజధాని’ పోరులో కలిసి అడుగులు.. యాత్ర భగ్నానికి పోలీసుల యత్నం

పాదయాత్ర మార్గంపై అనవసర పేచీ.. తెనాలిలో చివరినిమిషంలో ఆంక్షలు

దీటుగా తిప్పికొట్టిన పాదయాత్రికులు.. దుగ్గిరాల-పెద్దరావూరు దాకా 15 కి.మీ. నడక


గుంటూరు, తెనాలి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘రాజధాని కోసం పొలాలు ఇచ్చి... ఉండే స్థలాలు ఇచ్చి... రోడ్డున పడాల్సివచ్చిందా’ అంటూ ఊళ్లకు ఊళ్లు అమరావతి రైతులను ఊరడిస్తున్నాయి. న్యాయం గెలుస్తుంది అంటూ భుజంతట్టి ముందుకు నడిపిస్తున్నాయి. నడుస్తున్న మహా పాదయాత్రలో ఎక్కడికక్కడ తామూ కలిసిపోతున్నాయి. ఇలా మూడోరోజు రాజధాని యాత్ర మరింత జోరందుకుంది. దుగ్గిరాలలో మొదలై తెనాలిలోని పెద్దరావూరు వరకు  మొత్తం 15 కిలోమీటర్లు సాగింది. యాత్ర ప్రారంభానికి ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల, పరిసర గ్రామాల రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో బుధవారం ఉదయం ప్రారంభ వేదిక వద్దకు చేరుకున్నారు. దుగ్గిరాల నుంచి చింతలపూడి వరకూ పాదయాత్రను సాగనంపి వారు వెనుదిరిగారు. దుగ్గిరాల నుంచి తెనాలి వైపు సాగిన పాదయాత్ర దారికి అటుఇటు పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు, మహిళలు, దళిత బహుజనులు దండలు, పూలతో నిలుచుకున్నారు. పాదయాత్ర సమీపించగానే, గుమ్మడి కాయలు కొట్టి స్వాగతం పలికి తమ గ్రామాల వెంట నడిపించుకువెళ్లారు. దుగ్గిరాల నుంచి తెనాలి వైపుగా పాదయాత్ర వెళుతున్న గ్రామాల నుంచే కాకుండా దగ్గరలో ఉన్న ఇతర గ్రామాల నుంచి కూడా రైతులు, మహిళలు పాదయాత్రలో కలిశారు. ఈమని గ్రామ ప్రజలు దుగ్గిరాల లాకుల వరకూ వచ్చి యాపిల్‌, అరటి పండ్లు పాదయాత్రికులకు పంచారు. ఎక్కడికక్క జనం రోడ్లపైకి వచ్చి సమరోత్సాహంతో యాత్రకు ఆహ్వానాలు పలికారు. దీంతో చింతలపూడి నుంచి నందివెలుగు మధ్య ఒకానొక దశలో పాదయాత్ర ముందుకు సాగడమే గగనమైపోయింది. చింతలపూడి జాషువా కాలనీ వద్ద పెద్ద సంఖ్యలో వేచిచూస్తూ యాత్ర రాగానే.. అందులో దళిత మహిళలు అడుగులు కదిపారు. దుగ్గిరాల- తెనాలి మార్గంలో బస్సులో వెళుతున్న ప్రయాణికులు, ఉద్యోగులు కొందరు పిడికిళ్లు బిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్ర తెనాలి పురవీధుల గుండా తన ప్రస్థానాన్ని కొనసాగించింది. బుధవారం సాయంత్రానికి పెద్దరావూరుకు చేరుకుంది. 


అరసవల్లిలో దర్శనం చేయించి పంపిస్తాం: గౌతు శిరీష

రాష్ట్రానికి ఏకైక రాజధాని ఉండాలంటూ పోరాడుతున్న అమరావతి రైతులకు అండగా ఉంటామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష స్పష్టం చేశారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పలాసలోని టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కొంతమందితో కలిసి అమరావతి నుంచి అరసవల్లికి వచ్చే రైతులకు ఇబ్బందులు కలిగిస్తామని మంత్రి అప్పలరాజు ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అమరావతి నుంచి వచ్చేవారికి.. అరసవల్లిలో దర్శనం చేయించి క్షేమంగా తిరిగి పంపే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు. కాగా, అమరావతి రాజధాని నినాదంతో ఎన్నికల్లో పోటీకి తాము సిద్ధమని, మూడు రాజధానుల పేరిట ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము సీఎం జగన్‌కు ఉందా అని టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెనాలిలో సవాల్‌ విసిరారు. పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను జనమే తిప్పి కొడుతున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మహా పాదయాత్రను, అమరావతి ఉద్యమాన్ని తెలుగుదేశం వెనకుండి నడిపిస్తుందంటూ అడ్డగోలు విమర్శలకు వైసీపీ దిగుతోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మండిపడ్డారు. మిగిలిన పార్టీలన్నింటిలాగే తాము కూడా మద్దతు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా జగన్మోహనరెడ్డి ధిక్కరిస్తున్నారని, వీరికి చట్టం, న్యాయ వ్యవస్థలపై నమ్మకం లేదనడానికి ఇదే నిదర్శనమని పల్నాడు తెలుగుదేశం నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు. మహా పాదయాత్రను ఆపాలని నష్టపోతారని ప్రభుత్వాన్ని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ హెచ్చరించారు. 


రూట్‌పై రగడ.. తెనాలిలో పోలీసుల హడావుడి

హైకోర్టు అనుమతి ప్రకారం... ముందుగా ప్రకటించిన రూట్‌ మ్యాప్‌ కాదంటూ పోలీసులు అడ్డు చెప్పడంతో మహా పాదయాత్రలో పాల్గొన్న మద్దతుదారులు తోపులాటకు దిగారు. చివరకు అది ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. బుధవారం దుగ్గిరాల నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర తొలుత తెనాలి చేరుకుంది. అక్కడినుంచి వి.ఎ్‌స.ఆర్‌. కళాశాల నుంచి ఐతానగర్‌ మీదుగా పట్టణంలోకి యాత్ర వెళ్లాలి. అయితే, పోలీసులు ఐతానగర్‌ రోడ్డులోకి వెళ్లడానికి వీలు లేదంటూ బారికేడ్లను అడ్డుపెట్టారు. అదే రోడ్డులో ఎమ్మెల్యే నివాసం ఉండటాన్ని కారణంగా చెప్పారు. ఇంతలో ఐతానగర్‌కు చెందిన రైతు నేతలు ముకుమ్మడిగా అక్కడకు వచ్చారు. మహా పాదయాత్రకు రూ.5.51 లక్షల విరాళాన్ని మాజీ మంత్రి ఆలపాటికి అందించారు. ఐతానగర్‌ మార్గం నుంచే యాత్ర ముందుకు వెళ్లాలని వారంతా పట్టుబట్టారు. అమరావతి రైతులు కూడా వీరి వెంటే నడిచేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక రైతు నేతలు బారికేడ్లను నెట్టుకుంటూ ఐతానగర్‌ వైపు దూసుకు వెళ్లారు. పోలీసులు భారీ సంఖ్యలో అక్కడకు చేరి వారిని అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పోలీసులు అక్కడే ఉన్న మాజీ మంత్రి ఆలపాటితో చర్చలు జరిపారు. చివరకు ఆయన రైతులకు సర్దిచెప్పి వెనక్కి తీసుకు వచ్చారు. అక్కడి నుంచి తెనాలి-విజయవాడ ప్రధాన రహదారి ద్వారా బస్టాండ్‌ పక్కగా వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబులు... పోలీసులపై మండి పడ్డారు. ‘‘రూట్‌మ్యాప్‌ ప్రకారం వెళ్లనివ్వకుండా అడ్డుకున్నా మీ మాటే విని వెనక్కి వచ్చాం. ఇక్కడ కూడా అడ్డు చెబితే ఎట్లా’’గంటూ రైతులు సైతం పోలీసులపై వాదనకు దిగారు. చివరకు పోలీసులు వెనక్కి తగ్గడంతో మహా పాదయాత్ర ముందుకు కదిలింది. యాత్రపై పోలీసు శాఖ నిఘాను భారీగా పెంచింది. ఎక్కడికక్కడ పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన మద్దతుదారులను ఫొటోలు, వీడియోలు తీశారు. కొంతమంది ఇంటెలిజెన్స్‌ పోలీసులు సివిల్‌ డ్రెస్సుల్లో పాదయాత్రలో కలిసిపోయి వివరాలు సేకరించేందుకు విఫలయత్నాలు చేశారు. మూడోరోజున విలేకరులు, ఫొటోగ్రాఫర్లపై పోలీసు నిఘా బాగా పెరిగింది. 


రైతులతో నడిచిన చెన్నై టెకీలు

అమరావతి రాజధానిగా కొనసాగితే సాఫ్ట్‌వేర్‌ ప్రపంచం మన చెంతనే ఉండేదని మహాపాదయాత్రకు మద్దతు తెలిపేందుకు చెన్నై నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని పాటిబండ్ల స్ఫూర్తి అన్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి అనేక దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయని, అభివృద్ధి జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. తెనాలిలోని ఐతానగర్‌ వద్ద సాఫ్ట్‌వేర్‌ యువతులు మౌనిక, గ్రీష్మ యాత్రలో అడుగులు కలిపారు. కాగా, పాదయాత్రకు లక్ష రూపాయల విరాళం ఇస్తున్నట్టు రామినేని ఫౌండేషన్‌ అధ్యక్షుడు రామినేని ధర్మ ప్రచారక్‌, కార్యదర్శి పాతూరి నాగభూషణం ప్రకటించారు. అమరావతి రైతుల మహా పాదయాత్రకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేత కేసన శంకరరావు సంఘీభావం ప్రకటించారు. బుధవారం తన అనుచరులతో కలిసి వచ్చి...తెనాలిలోని చిట్టి ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి పెదరావూరు వరకు యాత్రలో పాల్గొన్నారు. యాత్రకు న్యాయవాదులు మద్దతు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రముఖ న్యాయవాది నారాయణ, చుక్కపల్లి రమేశ్‌, రాళ్లపల్లి అనిత తదితరులు తెలిపారు.


పాదం పచ్చి పుండైనా.. 

ఈ తాత పేరు మొఖమాటం రత్తయ్య,  అమరావతి ఐనవోలు గ్రామానికి చెందిన ఈవృద్ధ రైతు రాజధాని కోసం ఐదు ఎకరాల భూమి ఇచ్చాడు.65 ఏళ్ల వయసులో రైతుల పాదయాత్రలో నడుస్తున్నాడు. మూడురోజులు వరుసగా నడవడంతో పాదం పచ్చి పుండై పోయింది. అయినా సరే...ఆగేదే లేదు.. నిలిచేది లేదంటూ వడివడిగా అడుగులు వేస్తున్నాడు. తిరుపతి వరకు సాగిన తొలి యాత్రలోనూ రత్తయ్య చివరివరకు నడిచాడు.


నేడు బాపట్ల జిల్లాలోకి...

రైతుల పాదయాత్ర గురువారం బాపట్ల జిల్లాలోకి ప్రవేశించనుంది. వేమూరు, రేపల్లె నియోజకవర్గాల పరిధిలో 20వ తేదీ వరకు ఆరు రోజులపాటు ఈ జిల్లాలో యాత్ర కొనసాగనుంది. 19న యాత్రకు విరామం ప్రకటించి రేపల్లెలో రైతులు విశ్రాంతి తీసుకోనున్నారు. 20న రేపల్లెలో తిరిగి ప్రారంభమయ్యే పాదయాత్ర పులిగడ్డ దగ్గర కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. 



Updated Date - 2022-09-15T09:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising