ఇప్పటం పిటిషనర్లకు మళ్లీ చుక్కెదురు
ABN, First Publish Date - 2022-12-15T03:22:14+05:30
ఇళ్ల కూల్చివేత వ్యవహారంలో అధికారులు షోకాజ్ నోటీసులిచ్చిన విషయాన్ని దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందిన ఇప్పటం గ్రామానికి చెందిన 14మంది పిటిషనర్లకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది.
వారి అప్పీల్ కొట్టివేసిన ధర్మాసనం..
సింగిల్ జడ్జి తీర్పు సరైనదేనని వ్యాఖ్య
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఇళ్ల కూల్చివేత వ్యవహారంలో అధికారులు షోకాజ్ నోటీసులిచ్చిన విషయాన్ని దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందిన ఇప్పటం గ్రామానికి చెందిన 14మంది పిటిషనర్లకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. రూ.లక్ష చొప్పున ఖర్చులు విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఇలాంటి చర్యలు ప్రోత్సహించలేమని తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సరైనదేనంటూ అందులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. వాస్తవాలు దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందడాన్ని సహించలేమని స్పష్టంచేసింది. ఇలాంటి చర్యలను అనుమతిస్తే అత్యవసరంగా కోర్టును ఆశ్రయించేవారు ఉత్తర్వులు పొందలేరని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలోని రామాలయవీధి రోడ్డు విస్తరణ పేరుతో దశాబ్దాల క్రితం నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారని పేర్కొంటూ గ్రామానికి చెందిన బెల్లంకొండ వెంకటనారాయణ, మరో 13మంది నవంబరు 4న అత్యవస రంగా హైకోర్టును ఆశ్రయించారు. ఇళ్ల కూల్చివేత నిమిత్తం అధికారులు జారీచేసిన నోటీసులు రద్దు చేయాలని కోరారు. ఆ వ్యాజ్యాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి కూల్చివేతలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
తదుపరి జరిగిన విచారణలో.. షోకాజ్ నోటీసులు అందుకున్న విషయాన్ని దాచిపెట్టి పిటిషనర్లు మధ్యంతర ఉత్తర్వులు పొందారని న్యాయమూర్తి గుర్తించి, పిటిషనర్లు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఖర్చులు విధించారు. ఆ తీర్పుపై 14మంది గ్రామస్థులు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. గ్రామస్థుల తరఫున సీనియర్ న్యాయవాది కె.చిదంబరం వాదనలు వినిపించారు. పిటిషనర్లు వ్యవసాయదారులని, వారికి షోకాజ్ నోటీసులకు, నోటీసులకు తేడా తెలియదని.. దీంతో షోకాజ్ నోటీసులు అందుకున్న విషయాన్ని కోర్టుకు వివరించలేదని తెలిపారు. జరిగిన తప్పునకు న్యాయస్థానానికి క్షమాపణలు చెబుతున్నామన్నారు. ఆ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.
శిక్ష ఖరారుపై టీటీడీ ఈవో అప్పీల్
కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి దాఖలు చేసిన అప్పీల్ బుధవారం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే ఈవో వేసిన అఫిడవిట్ కోర్టు రికార్డులో చేరకపోవడంతో ధర్మాసనం విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో కోర్టు తీర్పు అమలు చేయకపోవడంతో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి నెల రోజులు సాధారణ జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి మంగళవారం తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఈవో లైజింగ్ ఆఫీసర్ అఫిడవిట్‌తో అదేరోజు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా ఈవో తరఫు సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని చెప్పారు.
Updated Date - 2022-12-15T03:22:16+05:30 IST