ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మమ్మల్ని బతకనీయండి! రీచ్‌లలో ఇసుక తవ్వొద్దు!

ABN, First Publish Date - 2022-01-04T05:14:34+05:30

గత నవంబరులో జిల్లాను అతలాకుతలం చేసిన వరదలను తలచుకుంటేనే వెన్నులో వణుకుపుడతోంది.

ఇందుకూరుపేట : నాగరాజుతోపు రీచ్‌ వద్ద ఇసుక తవ్వకాలను అడ్డుకుంటున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడ్డుకుంటున్న పెన్నా పరివాహక గ్రామస్థులు

పల్లిపాడు, నాగరాజతోపు రీచ్‌లలో తిరగబడ్డ జనం

తవ్వకాలలో నిబంధనలకు తూట్లు

ఇష్టానుసారంగా పొర్లుకట్టల ధ్వంసం

ఫలితంగా నవంబరులో వరద బీభత్సం

ఇప్పుడు మళ్లీ తవ్వకాలతో బెంబేలు

గత అనుభవాలు విస్మరించిన అధికారులు

ఉన్నవి కాకుండా అదనంగా 5 రీచ్‌లు?


‘‘ఇసుక కోసం పెన్నా పొర్లుకట్టలు తెగ్గొట్టి మా బతుకులతో ఆడుకున్నారు. వరదలకు ఊరు మునిగిపోతుంటే ఎవరూ కాపాడలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికాం. తెగిన పొర్లుకట్టలను నిర్మించకుండా ఇప్పుడు మళ్లీ వస్తారా!?. రీచ్‌కు అనుమతి ఇవ్వొద్దని కలెక్టర్‌, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా పట్టించుకోలా!?. ఇక ప్రాణాలను ఫణంగా పెట్టలేం. రీచ్‌లో ఇసుకను తవ్వనీయం.’’

- ఇందుకూరుపేట మండలం నాగరాజుతోపు వాసుల ఆవేదన


నెల్లూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : గత నవంబరులో జిల్లాను అతలాకుతలం చేసిన వరదలను తలచుకుంటేనే వెన్నులో వణుకుపుడతోంది. కనీవినీ ఎరుగని రీతిలో పెన్నా నదికి వరద పోటెత్తింది. ఆ సమయంలో ప్రకృతి ప్రకోపం కన్నా మానవ తప్పిదాల మూలంగానే ఎక్కువ నష్టం జరిగిందన్నది వాస్తవం. గతంలో ఎంత పెద్ద వరదలొచ్చినా నదిని దాటి నీరు గ్రామాల్లోకి రావడం అరుదు. కానీ ఈదఫా మాత్రం కొన్ని ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. దాదాపు 40 వేల మందికిపైగా పునరవాస కేంద్రాలకు తరలించారు. కొందరు ఇళ్లు, అందులోని వస్తువులను కోల్పోగా, మరికొందరు చేపలు, రొయ్యల చెరువులు, పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. ఈ పాపంలో మెజారిటీ భాగం జిల్లాలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న వారిదేనని ప్రజలు గట్టిగా చెబుతున్నారు. వరదల సమయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసిన చోట ఇష్టానుసారంగా పెన్నా పొర్లుకట్టలను ధ్వంసం చేయడంతోనే వరద గ్రామాల్లోకి వచ్చిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రీచ్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే ఎక్కువగా పొర్లుకట్టలు ధ్వంసం కావడంతో నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిమూలంగా అటు ప్రజలతోపాటు ఇటు ప్రభుత్వానికి కూడా భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెన్నాలో వరద తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఇసుక తవ్వకాలు జరిపేందుకు కాంట్రాక్టు సంస్థ సిద్ధమవుతోంది. అయితే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు ఇసుక తవ్వకాలను అడ్డుకుంటున్నారు. కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


తిరగబడుతున్న జనం

ఇసుక తవ్వకాలను గుంపగుత్తగా ఓ సంస్థకు అప్పగించడంతో అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందని మొదటి నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు రీచ్‌ల వద్ద స్థానికులు ఆందోళనలు కూడా చేయడం గమనార్హం. వరదలకు ముందు వరకు జిల్లాలో 9 రీచ్‌లు ఉన్నాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే మళ్లీ రీచ్‌లలో తవ్వకాలు జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముదివర్తి, మినగల్లులో రీచ్‌లు మొదలయ్యాయి. ఈ  రీచ్‌లలోనూ నిర్వాహకులకు, స్థానికులకు మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఆదివారం నాడు పల్లిపాడు రీచ్‌ను మొదలుపెట్టేందుకు కాంట్రాక్టు సంస్థ ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. మీ వల్ల మా బతుకులు వరదల పాలయ్యాయంటూ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు తహసీల్దార్‌ జోక్యం చేసుకొని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను వెనక్కు పంపారు. ఇదేవిధంగా సోమవారం నాగరాజతోపు రీచ్‌లో తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించగా అక్కడా స్థానికులు అడ్డుకున్నారు. వరదల తర్వాత ఇసుక తవ్వకాలపై స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. దీనిని బట్టే రీచ్‌ల నిర్వహణ ఏవిధంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలాఉంటే ఇప్పుడున్న రీచ్‌లకు అదనంగా మరో ఐదు రీచ్‌లను అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు పొంది మరో వారంలో వాటిని కూడా ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు.


ప్రభుత్వంపై కూడా భారం

రీచ్‌లలోకి వెళ్లేందుకు ఇష్టానుసారంగా పొర్లుకట్టలను తెగ్గొట్టడం, ఈ పొర్లుకట్టలకు ముందు భాగంలో ఉండే ఇసుక మేటలను తవ్వేశారు. ఈ పొర్లుకట్టలు తెగిపోవడంతో ఇప్పుడు ప్రభుత్వంపై కూడా భారం పడింది. వీటిని పునర్నిర్మించడానికి రూ.కోట్లు ఖర్చవుతోంది. ఇప్పటికే ఇరిగేషన్‌ అధికారులు టెండర్లు కూడా పిలిచారు. ఇంతటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ఇష్టానుసారంగా పొర్లుకట్టలను ధ్వంసం చేయడం, ఎక్కువ గుంతలు తీయడం నిలువరించాలంటే ఇసుక తవ్వకాలపై పర్యవేక్షణ ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ ప్రాంతంలో దొరికే ఇసుకను తమకు ఎలాగూ ఉచితంగా ఇవ్వడం లేదని, కనీసం తమ ప్రాణాలు పోకుండా కాపాడాలని స్థానిక ప్రజలు జిల్లా ఉన్నతాధికారులను వేడుకొంటున్నారు. 

Updated Date - 2022-01-04T05:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising