టిడ్కో ఇళ్లు అప్పగించండి
ABN, First Publish Date - 2022-03-06T03:16:53+05:30
తమకు కేటాయించిన టిడ్కో ఇళ్లను తక్షణం అప్పగించాలని లబ్ధిదారులు కోరారు. ఈ మేరకు శనివారం సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు.
సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి
ఆత్మకూరు, మార్చి 5 : తమకు కేటాయించిన టిడ్కో ఇళ్లను తక్షణం అప్పగించాలని లబ్ధిదారులు కోరారు. ఈ మేరకు శనివారం సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా స్థానిక సీపీఎం కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యాలయం లోపల బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు టిడ్కో గృహాలు అప్పజెప్పకుండా పేదల జీవితాలతో చెలగాట మాడుతుందని ధ్వజమెత్తారు. సీపీఎం పట్టణ కార్యదర్శి డేవిడ్‌రాజు, గంటా లక్ష్మీపతి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ షేక్ సందాని మాట్లాడుతూ మూడేళ్ల క్రితమే పూర్తయిన గృహాలు అబ్ధిదారులకు అప్పజెప్పకపోవడంతో అవి నిరూపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలోనే లబ్ధిదారులు గృహప్రవేశం చేశారన్నారు. ఇప్పటికైన వారికి ఇళ్లు అప్పగించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో 1056 మంది లబ్ధిదారులతో తిరిగి గృహప్రవేశం చేయిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జీ వెంకటరమణమ్మ లబ్ధిదారుల వద్దకు వచ్చి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. తనకు ఒక అవకాశం ఇస్తే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నాగేంద్ర, సాలారుద్దీన్, లక్కు కృష్ణప్రసాద్, వాగాల శ్రీహరి, ఆవాజ్, ఐద్వా నాయకులు ిపీ.యస్ధాన్, షేక్ గుల్జార్, గందళ్ల పద్మ, పోలా రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T03:16:53+05:30 IST