అంగన్‌వాడీల్లో వసూళ్ల దందా!
ABN, First Publish Date - 2022-12-07T23:07:49+05:30
మండలంలోని అంగన్‌వాడీల్లో వసూళ్ల దందా గుట్టుచప్పుడు కాకుండా జరగుతోంది.
ఓ సూపర్‌వైజర్ ప్రతి నెల రూ.200
కూరగాయలు, గ్యాస్ బిల్లులోనూ 15 శాతం
మాముళ్ల మత్తులో సెంటర్ల పనితీరుపై ఉదాసీనత
సక్రమంగా తెరుచుకోని అంగన్‌వాడీ కేంద్రాలు
ఉలవపాడు, డిసెంబరు 7 : మండలంలోని అంగన్‌వాడీల్లో వసూళ్ల దందా గుట్టుచప్పుడు కాకుండా జరగుతోంది. ఉలవపాడు, లింగసముద్రం, గుడ్లూరు, జరుగుమల్లి, సింగరాయకొండ మండలాలతో కలిపి ఉలవపాడులో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పరిధిలో 309 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, ఉలవపాడు మండలంలో కరేడు, వీరేపల్లి, ఉలవపాడు మూడు సెక్టార్లలో 72 అంగన్‌వాడీ కేంద్రాలు, 5 మినీ సెంటర్లు ఉన్నాయి. ఒక్కో సెంటర్‌లో కార్యకర్త, ఆయా నుంచి పత్రికలకు, టీవీలకు యాడ్‌ల పేరుతో అధికారులు ఏడాదికి రూ.1200 వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఈ ఏడాది సుమారు రూ.92 వేలకు పైబడి వసూలు చేసినట్లు తెలిసింది. అలాగే ఓ సెక్టార్ పరిధిలోని ఓ సూపర్‌వైజర్ తన పరిధిలోని ప్రతి కేంద్రం నుంచి నెలకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వసూళ్ల దందాను ఒకరిద్దరు అనధికార లీడర్ల కనుసన్నల్లో జరుగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. సీడీపీవో, సూపర్‌వైజర్లు ఆదేశించిన ఏ పనైనా సరే వారి కనుసన్నల్లో జరుగుతున్నట్లు తెలిసింది. ఇవికాక నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఉన్నతాధికారులకు బహుమతులు తీసుకెళ్లేందుకు కూడా డబ్బులు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే కార్యకర్తలకు మండల, సెక్టార్ అధికారులు చెప్పినట్లు తెలిసింది. అలాగే, 3, 4 నెలలకు ఒకసారి వచ్చే కూరగాయలు, గ్యాస్ బిల్లులో కూడా ప్రతి కార్యకర్త 15 శాతం చొప్పున కమీషన్లు చెల్లించాలి. కార్యకర్తలు ముందుగా తమ డబ్బులతోనే కేంద్రాన్ని నడపాలి.. అనంతరం ప్రభుత్వానికి బిల్లులు సమర్పిస్తే నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమఅవుతోంది. ఇలా వచ్చిన బిల్లులను కూడా వదలకుండా కమీషన్లు తీసుకుంటున్నారని కార్యకర్తలు వాపోతున్నారు.
ముడుపులు ఎలా చెల్లించేది?
అధికారులు అడిగినప్పుడల్లా ముడుపులు చెల్లించాలంటే అంగట్లో అమ్మకాలు తప్పడం లేదని కొందరు కార్యకర్తలు బహిరంగానే చర్చించుకోవడం విశేషం. చాలీచాలని జీతాల నుంచి ఇవ్వలేంకదా.. అందుకే పక్కదారుల్లో గుడ్లు, కందిపప్పు, బియ్యం వంటివి అమ్మితే కానీ లంచాలు ఇచ్చే పరిస్థితి లేదని అంగన్‌వాడీలు సమర్ధించుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకుండా ప్రశ్నించిన కార్యకర్తల సెంటర్లను టార్గెట్ చేసి వేధిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
కేంద్రాల నిర్వహణ ఇష్టారాజ్యం
అధికారులు అండిగినంత ఇస్తున్న వర్కర్లు కేంద్రాల నిర్వహణ గాలికొదిలేశారు. సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు పుచ్చుకునే లంచాల ప్రభావమే సెంటర్ల పనితీరు సక్రమంగా నడవకపోవడానికి కారణమని గ్రామస్తులు అంటున్నారు.
తన దృష్టికి రాలేదు
అంగన్‌వాడీ కేంద్రాల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్నారని, పర్సంటేజీలు తీసుకుంటున్నట్లు తన దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి వసూలు చేసేది నిజమైతే అందుకు సంబంధించిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం.
- విజయకుమారి, సీడీపీవో
Updated Date - 2022-12-07T23:07:50+05:30 IST