నెల్లూరులో ‘అగ్నివీర్’
ABN, First Publish Date - 2022-08-05T04:56:25+05:30
సైన్యంలో ఉద్యోగాల ఎంపికకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నెల్లూరులో సెప్టెంబరు 15 నుంచి 26వతేదీ వరకు జరుగుతుందని కలెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు.
సెప్టెంబరు 15 నుంచి 26 వరకు...
10 రోజులపాటు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
కట్టుదిట్టంగా నిర్వహణ
కలెక్టర్ చక్రధర్‌బాబు
నెల్లూరు (విద్య), ఆగస్టు 4 : సైన్యంలో ఉద్యోగాల ఎంపికకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నెల్లూరులో సెప్టెంబరు 15 నుంచి 26వతేదీ వరకు జరుగుతుందని కలెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు. దీన్ని కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహణపై గుంటూరు రేంజ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి కల్నల్ శ్రీకోహ్లీతో కలిసి కలెక్టర్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదేళ్ల తర్వాత నెల్లూరులో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 34,338 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో జిల్లాకు చెందిన వారు 970 మంది ఉన్నారన్నారు. గతంలో కంటే ఈ సారి జిల్లా నుంచి 50శాతం అదనంగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో అర్హత సాధించేందుకు వెనుకబడిన తరగతులకు చెందిన పేద విద్యార్థులను గుర్తించి రెండు బ్యాచలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. నెలపాటు శిక్షణ అందించి ఎక్కువమంది అగ్నివీరులు జిల్లానుంచి ఎంపికయ్యేలా సన్నద్ధం చేస్తున్నామన్నారు. ఈ ర్యాలీకి వివిధ జిల్లాల నుంచి హాజరయ్యే అభ్యర్థులకు, ఆర్మీ అధికారులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అభ్యర్థులందరూ మూడు డోసుల కొవిడ్ వ్యాక్సినేషన సర్టిఫికేట్ పొంది రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనాలని ఆయన సూచించారు.
రిక్రూట్‌మెంట్‌కు సహకరించండి : కల్నల్ కోహ్లీ
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సహకరించాలని గుంటూరు రేంజ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి కల్నల్ శ్రీకోహ్లీ కోరారు. సెప్టెంబరు 13లోగా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సిద్ధమవుతామని చెప్పారు. దశలవారీగా జరిగే ఈ రిక్రూట్‌మెంట్‌లో అభ్యర్థుల ఎత్తు, బరువు, ఫిట్‌నెస్, పులప్స్, రన్నింగ్ తదితర పరీక్షలుంటాయన్నారు. ఫొటో వెరిఫికేషన, బయోమెట్రిక్ చేపట్టి ఎంపికైన అభ్యర్థుల వివరాలను న్యూఢిల్లీకి పంపిస్తామన్నారు. అనంతరం ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించిన బుక్‌లెట్‌ను కలెక్టర్‌కు అందచేశారు. ఈ సమావేశంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, ఏఎస్పీ శ్రీనివాసరావు, సెట్నల్ సీఈవో పుల్లయ్య, డీటీసీ చందర్, జిల్లా వైద్యాధికారి పెంచలయ్య, డీఈవో రమేష్, డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి, నెల్లూరు ఆర్డీవో కొండయ్య, డీఎస్‌ఏ చీఫ్ కోచ యతిరాజ్, సమాచార కేంద్రం అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-05T04:56:25+05:30 IST