మూడోసారీ..!
ABN, First Publish Date - 2022-10-18T04:53:01+05:30
వ్యవసాయ మార్కెట్ కమిటీల (ఏఎంసీ) నిధులతో చేపట్టిన గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పట్టిన గ్రహణం వీడటం లేదు.
పీఆర్ రోడ్ల పనులకు కాంట్రాక్టర్ల అనాసక్తి
మొత్తం 34 ప్యాకేజీలు.. మూడుసార్లు పిలిస్తే ఎనిమిదింటికే టెండర్లు
ఏఎంసీ నిధులిచ్చినా ప్రయోజనం శూన్యం
పాత ఎస్ఎ్సఆర్తో పిలవడమే కారణం
జీఎస్టీ పెంపుపై నిర్ణయం తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం
ఉన్నతాధికారుల నిర్ణయం కోసం ఎదురుచూపు
పంచాయతీరాజ్ శాఖలో మూడోసారి కూడా పాతకథే రిపీట్ అయ్యింది. ఏఎంసీ నిధులతో చేపడుతున్న రోడ్డు పనులకు రెండుసార్లు టెండర్లు పిలిచినా ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు మూడోసారి కూడా వారినుంచి స్పందన కరువయ్యింది. మొత్తం 34 ప్యాకేజీలకు కేవలం ఎనిమిదింటికి మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. మిగిలిన 26 ప్యాకేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు రోడ్డు పనులకు త్వరగా మరమ్మతులు చేయాలంటూ సాక్షాత్తు సీఎం జగన్మోహనరెడ్డి డెడ్లైన్లు విధిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదు. మరి ఈ రోడ్లకు ఎలా టెండర్లు దాఖలయ్యేలా చూస్తారో.. ఎప్పుటికి పనులు పూర్తి చేస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
నెల్లూరు, అక్టోబర్ 17 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ మార్కెట్ కమిటీల (ఏఎంసీ) నిధులతో చేపట్టిన గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పట్టిన గ్రహణం వీడటం లేదు. ఈ వర్కులకు అనుమతులు మంజూరై ఆరు నెలలు గడిచినా టెండర్ల ప్రక్రియ ముగియలేదు. పంచాయతీరాజ్ అధికారులు పదే పదే టెండర్లు ఆహ్వానిస్తున్నా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లులు వస్తాయో రావోనన్న అనుమానం, పాత స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు (ఎస్ఎ్సఆర్) ప్రకారం అంచనాలు తయారు చేయడం, కేంద్రం జీఎస్టీని పెంచినా ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం.. ఇలా అనేక అంశాలు రోడ్ల అభివృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. మొదటి దశలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 195 రోడ్లను రూ.155.60 కోట్లతో అభివృద్ధి చేసేలా పీఆర్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. మొత్తం 591 కిలోమీటర్ల రోడ్లను 34 ప్యాకేజీలుగా విభజించి జూనలో మొదటి కాల్ టెండర్లు పిలిచారు. అప్పుడు కేవలం సూళ్లూరుపేటలో ఒక ప్యాకేజీకి, ఉదయగిరిలో ఒక ప్యాకేజీకి మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. జూలైలో రెండో కాల్ పిలవగా, కేవలం ఆరు ప్యాకేజీలకు మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. మిగిలిన 26 ప్యాకేజీలకు ఒక్కరు కూడా టెండర్ వేయలేదు.
మళ్లీ.. మళ్లీ.. అదే తప్పు!
ఏఎంసీ నిధులతో చేపట్టిన రోడ్డు వర్కులకు పిలిచిన టెండర్లు కాంట్రాక్టర్లకు నష్టం జరిగేలా ఉన్నాయని మొదట్లోనే ప్రజాప్రతినిధులు, అఽధికారులు గుర్తించారు. అయినా అదే పద్ధతిలో టెండర్లు ఆహ్వానించారు. ఊహించినట్లుగానే కాంట్రాక్టర్ల నుంచి విముఖత వ్యక్తమైంది. ఫలితంగా సమయం వృథా అవుతోంది. ప్రతి ఏడాది జూనలో ఎస్ఎ్సఆర్ మారుతూ ఉంటుంది. ఏటా ఐదు నుంచి పది శాతం వరకు ధరలు పెరుగుతుండడంతో ఆ మేరకు వర్కు ఎస్టిమేషన్లు కూడా పెంచుతుంటారు. కానీ ఏఎంసీ నిధులతో చేపట్టిన వర్కులకు మాత్రం పీఆర్ అధికారులు 2021-2022 ఆర్థిక సంవత్సరం ఎస్ఎ్సఆర్తోనే ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి ఇది ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీని మూలంగా దాదాపు ఐదు శాతం నష్టం వస్తుందని కాంట్రాక్టర్ల భయం. ఇక రాష్ట్ర ప్రభుత్వ వర్కులకు జీఎస్టీ 12 శాతంగా ఉండగా దానిని జూలై నుంచి కేంద్ర ప్రభుత్వం 18 శాతానికి పెంచింది. కానీ టెండర్లలో మాత్రం 12 శాతంగానే చూపించారు. జీఎస్టీ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎటువంటి స్పష్టత రాలేదు. దీంతో పాత జీఎస్టీతో టెండర్లు వేస్తే పెరిగిన ఆరు శాతం జీఎస్టీ జేబులో నుంచి పెట్టుకోవాల్సి ఉంటుందని కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతుంటే, ఇక పెంచిన జీఎస్టీని ఎప్పటికి రీయింబర్స్ చేస్తారోనని వారు ఆందోళన చెందుతున్నారు.
తెరమీదకు కొత్త సమస్య
టెండర్లు వేయకపోవడానికి గల కారణాలను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నా అక్కడ నుంచి మాత్రం అందుకు తగిన నిర్ణయాలు వెలువడలేదు. ఈ కారణంతోనే మూడుసార్లు ఒకే ఎస్టిమేషన్లు, విధానంలో టెండర్లకు వెళ్లారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త సమస్య తెరమీదకు వచ్చింది. నాలుగోసారి కూడా పాత ఎస్టిమేషన్లతోనే టెండర్లు పిలిస్తే మళ్లీ ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎస్ఎ్సఆర్ మార్చి మిగిలిన వర్కులకు టెండర్లు పిలిస్తే ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న 8 ప్యాకేజీల కాంట్రాక్టర్లు తమ అంచనాలు కూడా పెంచాలని కోర్టుకెళ్లే ప్రమాదముంది. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది అధికారుల పరిస్థితి.
ఉన్నతాధికారులకు నివేదించాం
మూడో కాల్ టెండర్లు కూడా పూర్తయ్యే సరికి ఎనిమిది ప్యాకేజీలకు టెండర్లు దాఖలు అయ్యాయి. వీటిని అగ్రిమెంట్ చేసే ప్రక్రియ జరుగుతోంది. మిగిలిన ప్యాకేజీలపై తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించాం. వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. అక్కడి నుంచి ఆదేశాలు అందాక టెండర్లు పిలుస్తాం.
- సుబ్రహ్మణ్యం, పంచాయతీరాజ్ ఎస్ఈ
Updated Date - 2022-10-18T04:53:01+05:30 IST