Sharmila: షర్మిలకు మోదీ భరోసా
ABN, First Publish Date - 2022-12-07T04:01:00+05:30
ప్రధాని మోదీ మంగళవారం ఉదయం వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి మాట్లాడారు. దాదాపు 10 నిమిషాలపాటు ఆమెతో మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల హైదరాబాద్‌లో షర్మిల పట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరు, అందుకు దారితీసిన పరిణామాల గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
ఫోన్ చేసి పది నిమిషాలు మాట్లాడిన ప్రధాని
పాదయాత్రపై దాడి, అరెస్టు తీరుపై ఆరా
‘టోయింగ్’ దారుణమని వ్యాఖ్య
ఢిల్లీకి వచ్చి కలవాలని ఆహ్వానం
కేసీఆర్ విధానాలపై పోరాడాలని,
అండగా ఉంటామని వెల్లడి!
కేంద్రంవద్ద జగన్ పరపతి తగ్గిందా?
ఢిల్లీ పరిణామాలతో వైసీపీ కలవరం
జగన్‌ను మోదీయే ప్రశ్నించడంతో షాక్
షర్మిలకు ప్రధాని ఫోన్‌తో రెండో షాక్
సొంత చెల్లికి ఎదురైన కష్టాన్ని ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదు. కానీ.. ప్రధానమంత్రి స్పందించారు. ‘మీ చెల్లెలిపై దాడి జరిగి, ఆమె కారులో ఉండగానే టోయింగ్ వాహనంతో ఠాణాకు తరలించినా మీరెందుకు స్పందించలేదు?’ అని ప్రధాని ప్రశ్నించడమే కాదు.. ఆ మరుసటి రోజునే షర్మిలకు నేరుగా ఫోన్ చేసి పరామర్శించారు. ఈ వరుస పరిణామాలు వైసీపీ వర్గాలను కలవరపెడుతున్నాయి.
న్యూఢిల్లీ/అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ మంగళవారం ఉదయం వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి మాట్లాడారు. దాదాపు 10 నిమిషాలపాటు ఆమెతో మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల హైదరాబాద్‌లో షర్మిల పట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరు, అందుకు దారితీసిన పరిణామాల గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటన పట్ల షర్మిలకు సానుభూతి తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా కారులో ఉండగానే ఆమెను టోయింగ్ వాహనంతో ఠాణాకు తరలించడం దారుణమని అన్నారు. షర్మిల చేస్తున్న పాదయాత్రతోపాటు తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా.. ఢిల్లీకి వచ్చి తనను కలుసుకోవాల్సిందిగా షర్మిలను ప్రధాని ఆహ్వానించినట్లు తెలిసింది. అంతకుముందే షర్మిల హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తనపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై స్పందించిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం పాదయాత్ర చేస్తుంటే అడ్డుకుని అరెస్టు చేయడం అన్యాయమంటూ చాలా మంది సానుభూతి, మద్దతు తెలిపారని షర్మిల అన్నారు. స్పందించకుండా బాధపడ్డ వారు కూడా ఎంతో మంది ఉన్నారంటూ... అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
జగన్‌కు షాక్ మీద షాక్...
ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేటలో షర్మిల పాదయాత్రను టీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకొని దాడి చేశారు. ఆమె కారవాన్‌కు నిప్పంటించారు. కారు కూడా పాక్షికంగా ధ్వంసమైంది. ఆ వెంటనే తెలంగాణ పోలీసులు ఆమెను బలవంతంగా హైదరాబాద్‌కు తరలించారు. దీనిపై ప్రగతి భవన్ (సీఎం అధికార నివాసం) ముందు నిరసన వ్యక్తం చేసేందుకు... ధ్వంసమైన కారులోనే షర్మిల బయలుదేరారు. షర్మిలను పోలీసులు అడ్డుకుని... ఆమెను కారుతో సహా టోయింగ్ వాహనంతో తరలించారు. సొంత చెల్లిపై దాడి జరిగినా, పోలీసులు ఇలా ప్రవర్తించినా ఏపీ సీఎం జగన్ స్పందించలేదు. దీంతో... ‘మీ చెల్లెలిపై దాడి జరిగి, ఆమెను కారుతో సహా క్రేన్‌తో తరలించడంపై మీరెందుకు స్పందించలేదు’ అంటూ ప్రధాని మోదీ సోమవారం సీఎం జగన్‌ను నేరుగా ప్రశ్నించారు. ఇక... మంగళవారం ఆయన స్వయంగా షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించారు. దీంతో... తల్లీ చెల్లిని పట్టించుకోని వ్యక్తిగా తమ నాయకుడిపై ఉన్న ముద్ర మరింత బలపడిపోయిందని వైసీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. షర్మిలపట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరు... జగన్ స్పందనారాహిత్యంపై మోదీ ప్రశ్నించిన వైనాన్ని మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఇది తెలియగానే వైసీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ‘ఇదంతా మీడియా ఊహాగానాలు’ అని కొట్టివేద్దామనుకున్నా... ప్రధాని మోదీయే వారికి ఆ అవకాశమివ్వలేదు. మంగళవారం ఆయన నేరుగా షర్మిలకు ఫోన్ చేసి మాట్లాడారు. ఢిల్లీ వచ్చి కలవాలని ఆహ్వానించారు. దీంతో వైసీపీ వర్గాల గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లయింది. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తరచూ ‘అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట’ అంటూ చంద్రబాబును విమర్శించేవారు. ఇప్పుడు... అదే సామెతను మరోరకంగా గుర్తుకు చేసుకుంటున్నారు. ‘చెల్లెమ్మకు అవమానం జరిగితే స్పందించని జగన్.. రాష్ట్రంలోని మహిళలందరికీ న్యాయం చేస్తారట’ అంటూ సీఎంకు చురకలు అంటిస్తున్నారు.
చంద్రబాబుకు ప్రాధాన్యంపైనా చర్చ
సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో జగన్‌కు మోదీ షాక్ ఇవ్వడం ఒక ఎత్తైతే... చంద్రబాబుకు ప్రాధాన్యం ఇవ్వడం మరో ఎత్తు! దీనిని వైసీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. చంద్రబాబు చేసిన సూచనలను మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించడం, నీతి ఆయోగ్‌ను కలిసి వివరాలు ఇవ్వాలని కోరడం, కేంద్ర మంత్రులూ పలువురు చంద్రబాబుతో చర్చలు జరపడం వంటి పరిణామాలను గుర్తు చేసుకుంటున్నారు. ‘మోదీ వద్ద మన నాయకుడి గ్రాఫ్ తగ్గిందా!’ అని చర్చించుకుంటున్నారు.
థాంక్యూ మోదీజీ!
పోలీసుల తీరుపై ప్రధాని దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల విషయాన్ని హైదరాబాద్‌లో మీడియా షర్మిల వద్ద ప్రస్తావించగా.. ‘థాంక్యూ మోదీజీ’ అని ఆమె స్పందించారు. ప్రధాని ఒక్కరే కాదని, ఒక ఆడబిడ్డ ప్రజల కోసం పాదయాత్ర చేస్తుంటే అడ్డుకుని అరెస్టు చేయడం అన్యాయమంటూ చాలా మంది సానుభూతి, మద్దతు తెలిపారని షర్మిల అన్నారు. స్పందించకుండా బాధపడ్డవారు కూడా ఎంతో మంది ఉన్నారని, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని పేర్కొన్నారు.
Updated Date - 2022-12-07T04:09:51+05:30 IST