కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్నాం..!
ABN, First Publish Date - 2022-10-17T10:09:35+05:30
‘సార్.. మీ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్నాం. పొలాలకు వెళ్లే దారి సమస్యను పరిష్కరించండి’ అని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిలకపాడుకు
పొలాలకు దారి సమస్యను పరిష్కరించండి
అధికార పార్టీ నేత మా పొలంతో పాటు దారి కూడా ఆక్రమించారు
ఆత్మకూరు ఎమ్మెల్యే కాళ్లపై పడిన దంపతులు
మర్రిపాడు, అక్టోబరు 16: ‘సార్.. మీ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్నాం. పొలాలకు వెళ్లే దారి సమస్యను పరిష్కరించండి’ అని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిలకపాడుకు చెందిన దంపతులు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిని వేడుకున్నారు. వివరాలు.. మర్రిపాడు మండలంలో రెండవరోజు ఆదివారం చిలకపాడు గ్రామ సచివాలయ పరిధిలోని ఏపిలగుంట బీసీ కాలనీలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటుచేసిన మరో సమావేశానికి వెళ్తుండగా ఏపిలగుంట పాతూరుకు చెందిన శ్రీనివాసులు అనే రైతు, మరి కొంతమంది గ్రామస్థులు కలిసి పొలాలకు వెళ్లే దారి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. ఆయన కారు దిగగానే శ్రీనివాసులు, ఆయన భార్య ఒక్కసారిగా విక్రమ్‌రెడ్డి కాళ్ల మీద పడి మాకు ప్రభుత్వం ఇచ్చిన రెండెకరాల భూమికి దారిలేకుండా చేశారని కన్నీరు పెట్టుకున్నారు.
గ్రామానికి చెందిన బడా నేత తమ పొలంతోపాటు దారిని కూడా ఆక్రమించుకుని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని శ్రీనివాసులు ఆరోపించారు. దారి ఆక్రమణకు గురికావటంతో పశువులు మేతకు వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా ఉందని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, మ్యాప్ ప్రకారం ప్లాన్‌లో ఉన్న దారిని వారికి వదిలేయాలని పక్కనే ఉన్న ఆ బడా నేతకు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తదుపరి చిలకపాడులోని అధికారులతో సమస్యలపై సమీక్షించారు.
Updated Date - 2022-10-17T10:09:35+05:30 IST