Loan app case : లోన్ యాప్ కేసుల్లో ఏడుగురి అరెస్టు
ABN, First Publish Date - 2022-10-28T03:21:42+05:30
లోన్ యాప్‌ల ద్వారా రుణాలు మంజూరు చేసి, ఆపై అధిక వడ్డీలు వసూలు చేస్తూ, అవి చెల్లించకపోతే వేధింపులకు గురిచేస్తున్న నేరగాళ్లను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక, మధ్యప్రదేశ్,
డైరెక్టర్లతోపాటు మధ్యవర్తులకూ సంకెళ్లు
మీడియా ముందుకు తెచ్చిన బెజవాడ పోలీసులు
1,038 బినామీ బ్యాంక్ ఖాతాలు, 8 కోట్ల నగదు సీజ్
విజయవాడ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): లోన్ యాప్‌ల ద్వారా రుణాలు మంజూరు చేసి, ఆపై అధిక వడ్డీలు వసూలు చేస్తూ, అవి చెల్లించకపోతే వేధింపులకు గురిచేస్తున్న నేరగాళ్లను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వారిని సంకెళ్లు వేసి తీసుకొచ్చారు. తూర్పు మం డలం డీసీపీ విశాల్ గున్నీ గురువారం ఆ వివరాలను వెల్లడించారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడుకు చెందిన ఆటోడ్రైవర్ లంకా మణికంఠ (30) రుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపుల కారణంగా కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పటమట పోలీసులు.. సైబర్ క్రైం పోలీసుల సహకారంతో దాన్ని ఛేదించారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన లతీఫ్, సోహెల్ వన్‌షో టెక్నాలజీస్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. కర్ణాటకకు చెందిన మంజునాథ శంకరప్ప, నవీన్‌కుమార్ గోవిందరెడ్డి కలిసి బెంగుళూరు కేం ద్రంగా కిబ్స్‌నార్ టెక్నాలజీస్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు.
ఇందులో శంకరప్ప భార్య పరిమళ భాగస్వామిగా ఉన్నారు. సోహెల్, లతీఫ్ వండర్ లోన్ యాప్‌ను నిర్వహిస్తున్నారు. ఇక శంకరప్ప, గోవిందరెడ్డి కలిసి మరికొన్ని సబ్‌యా్‌పలు నిర్వహిస్తున్నారు. వాళ్లంతా కలిసి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అనురాగ్‌సింగ్, రుత్విక్ అహిల్వ, రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అరుణ్ మాథుర్‌ను మధ్యవర్తులుగా నియమించుకున్నారు. ఈ ముగ్గురూ ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన కూలీలు, చిన్న వ్యాపారుల ఖాతాలను అద్దెకు తీసుకుంటున్నారు. ఈ ఖాతాలతో లావాదేవీలు నిర్వహిస్తున్నందుకు వారికి కమీషన్ ఇస్తున్నారు. ఆండ్రాయి డ్ యూజర్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్పులు కావాల్సిన వారికి ఈ ఖాతాల ద్వారా డబ్బు పంపేవారు. మణికంఠ వండర్ లోన్ యాప్ ద్వారా రూ.80వేలు రుణం తీసుకున్నాడు. రూ.42వేలు చెల్లించేశాడు. మిగిలిన మొత్తం చెల్లించాలంటూ అసభ్యకర చిత్రాలతో వేధింపులకు గురిచేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న 1,038 బినామీ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. వాటిల్లో ఉన్న రూ.8 కోట్ల నిల్వను సీజ్ చేశారు. వన్‌షో, కిబ్స్‌నార్ కంపెనీల కింది మొత్తం 30 బస్‌యా్‌పలు పనిచేస్తున్నాయని పోలీసులు గుర్తించారు. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ కమిషనర్ టి.కాంతిరాణా వాటిని తక్షణమే తొలగించాలని గూగుల్‌కు లేఖ రాశారు.
Updated Date - 2022-10-28T03:21:45+05:30 IST