గ్రంథాలయ విజ్ఞాన నిపుణుడు ఎల్.ఎస్ రామయ్య మృతి
ABN, First Publish Date - 2022-09-03T10:01:56+05:30
గ్రంథాలయ విజ్ఞాన నిపుణుడు ఎల్.ఎస్ రామయ్య మృతి
జాతీయ గ్రంథాలయ పాలకుల సంఘానికి అధ్యక్షుడిగా సేవలు
లైబ్రరీ సైన్స్, భాషా శాస్త్రంపై పలు రచనలు
ఇఫ్లూలో చీఫ్ లైబ్రేరియన్‌గా పదవీ విరమణ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): గ్రంథాలయ విజ్ఞాన శాస్త్ర రంగానికి సుదీర్ఘకాలం విశేష సేవలందించిన ఆచార్య ఎల్.ఎస్. రామయ్య (85) ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఓ పైవ్రేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎల్.ఎస్ రామయ్య స్వస్థలం తెనాలి తాలూకాలోని పాంచాలవరం. బెనారస్ హిందూ వర్సిటీలో ఎమ్మె పూర్తి చేశారు. అనంతరం న్యూఢిల్లీలో డిప్లొమా ఇన్ ఆర్కైవ్స్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లైబ్రరీ సైన్స్‌లో బంగారు పతాకాన్ని అందుకున్నారు. అనంతరం 1962లో ఉమ్మడి ఏపీ స్టేట్ ఆర్కైవ్స్‌లో ఉద్యోగంలో చేరారు. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ గ్రంథాలయనికి ముఖ్య గ్రంథ పాలకుడిగా 1997లో రామయ్య పదవి విరమణ పొందారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో లైబ్రరీ సైన్స్ పాఠాలనూ బోధించారు. జాతీయ గ్రంథ పాలకుల సంఘానికి అధ్యక్ష్షుడిగానూ ఉన్నారు. యూజీసీ లైబ్రరీ ప్యానల్ సభ్యులు కూడా. అమెరికా తత్వవేత్త, భాషాశాస్త్రవేత్త అవ్రామ్ నోమ్ చోమ్ స్కై జీవిత చరిత్రతో పాటు లైబ్రరీ సైన్స్‌కి సంబంధించిన పదికి పైగా పుస్తకాలు, ద్రవిడ భాషల మీదా పరిశోధనా రచనలు చేశారు. మాసబ్ ట్యాంక్, శాంతి నగర్‌లోని స్వగృహంలో రామయ్య భౌతిక కాయానికి ఉస్మానియా, ఇఫ్లూ తదితర విశ్వవిద్యాలయాలకు చెందిన గ్రంథ పాలకులు నివాళులు ఆర్పించారు.
Updated Date - 2022-09-03T10:01:56+05:30 IST