ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జలం.. ఆలయం!

ABN, First Publish Date - 2022-03-04T05:46:03+05:30

శ్రీశైలం, మహానంది, అహోబిలం, మంత్రాలయం... రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రాలు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు నుంచి దూరమై... ‘నంద్యాల’లో భాగమై!
శ్రీశైలం, మహానంది, అహోబిల క్షేత్రాలు నంద్యాలలోనే
శ్రీశైలం సహా కీలక ప్రాజెక్టులూ ఈ జిల్లాలోకే
కర్నూలులో మిగిలేది సుంకేసుల, గాజుల దిన్నె
హద్దుల మార్పుతో చిత్రమైన పరిస్థితి
గుండ్రేవుల ప్రాజెక్టు చేపట్టాలనే డిమాండ్‌

(కర్నూలు - ఆంధ్రజ్యోతి)

శ్రీశైలం, మహానంది, అహోబిలం, మంత్రాలయం... రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రాలు! ఇవన్నీ కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత మంత్రాలయం మినహా మిగిలినవన్నీ నంద్యాల జిల్లాలోకి చేరిపోతాయి. నంద్యాల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోనుంది. అంతేకాదు... నిన్నటి దాకా కర్నూలుకు కంఠహారంగా ఉన్న జల వనరుల ప్రాజెక్టులన్నీ ఇక నుంచి నంద్యాలకు మణిహారంగా మారనున్నాయి. కాబోయే కొత్త కర్నూలు జిల్లా పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేని జిల్లాగా మారుతుంది.

కర్నూలు జిల్లాకు, నగరానికి రాయలసీమ ముఖద్వారమని పేరు. అంతేకాదు... ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక కేంద్రాలు, కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు నిలయం. ఉభయ రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పేరొందిన జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం ఇప్పుడు కర్నూలు జిల్లాలోనే ఉంది. విభజన తర్వాత నంద్యాలలోకి వెళ్లిపోతుంది. అలాగే... మరో ప్రముఖ శైవ క్షేత్రం మహానంది, నరసింహుడి సన్నిధి అహోబిలం కూడా నంద్యాల జిల్లాలో భాగమవుతాయి. రాఘవేంద్రస్వామి కొలువైన మంత్రాలయం మాత్రం కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది.

సాగుపై ఇప్పటి నుంచే చర్చ

విభజన తర్వాత కర్నూలు ‘నీటి ప్రాజెక్టులు’ లేని జిల్లాగా మారిపోతుందనే చర్చ ఇప్పటి నుంచే జరుగుతోంది. ప్రధాన జలాశయమైన శ్రీశైలం రిజర్వాయర్‌ ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టుల నుంచి కడప, నెల్లూరు, నంద్యాలకే నీరు అందుతుంది. శ్రీశైలం నుంచి కొత్త కర్నూలు జిల్లాకు నీరు అందించే ప్రాజెక్టులు ప్రస్తుతం లేవు. జిల్లాల విభజనతో అచ్చంగా కర్నూలు జిల్లాకు మిగిలేది 1.2 టీఎంసీల సామర్థ్యం ఉన్న సుంకేసుల డ్యాం, 2 టీఎంసీల గాజులదిన్నె ప్రాజెక్టులు మాత్రమే. ప్రస్తుత ఉమ్మడి కర్నూలు జిల్లాలో రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు, కెనాల్స్‌, ప్రాజెక్టుల రూపేణా 55.936 టీఎంసీలను ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఇందులో దాదాపు 90ు నంద్యాలకే దక్కుతాయి. విచిత్రమేమిటంటే... నీరు నిల్వ చేసుకునే అవకాశాలూ నంద్యాలకే పుష్కలంగా ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి విడిపోయిన తర్వాత నంద్యాల జిల్లాలో ఉండే 300 చెరువులను ఎస్‌ఆర్‌బీసీ ద్వారా నింపుకొనే అవకాశాలున్నాయి. కొత్త కర్నూలు జిల్లాలో 274 చెరువులు ఉంటాయి. అందులో... 8 చెరువులను మాత్రమే హంద్రీ-నీవా ద్వారా నింపుకొనే వీలుంది. ఇక విభజిత కర్నూలు జిల్లాకు గాజులదిన్నె, సుంకేసుల, గోరుకల్లు, పందికోన, కృష్ణగిరి రిజర్వాయర్లతో పాటు ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌, ఎల్లెల్సీ, పులికనుమ, మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులు మిగులుతున్నాయి. వెరసి 23.810 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవచ్చని రికార్డుల్లో కనిపిస్తుంటాయి. వాస్తవానికి గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి కర్నూలు జిల్లాకు ఉపయోగం సున్నా. కేసీ కెనాల్‌ ద్వారా తాగునీరు మాత్రమే అందుతుంది. తుంగభద్ర డ్యాం ఎల్లెల్సీ నుంచి అందాల్సిన నీటి వాటాల్లో 24 టీఎంసీలలో సగం కర్నూలు జిల్లాకు దక్కుతాయి. పులి కనుమ, పందికోన, ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌తో కూడా కలిపి కొత్త కర్నూలు జిల్లాకు సుమారు 18 టీఎంసీల జలాలు మాత్రమే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గుండ్రేవుల కావాల్సిందే...

ప్రతిపాదిత గుండ్రేవుల ప్రాజెక్టు కొత్త కర్నూలు జిల్లాకు ఆశాదీపమని సీమ నాయకులు చెబుతున్నారు. 2012లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి ఆమోదం తెలిపారు. ఎన్నికల అనంతరం చేపడతామని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడచినా ఆ ప్రాజెక్టుపై కిమ్మనడం లేదు. ప్రాధాన్య క్రమంలో పొందుపరిచామని గొప్పలు చెప్పడం తప్ప ఏమీ చేయడం లేదు. ‘‘20 టీఎంసీల సామర్థ్యం ఉండే ఈ ప్రాజెక్టు రూపుదాల్చితే కర్నూలు కరువును దాదాపుగా కట్టడి చేసినట్లే. దీని ద్వారా ఏపీలోని రెండున్నర లక్షల ఎకరాలతోపాటు తెలంగాణలో 87 వేల ఎకరాలకు సాగునీరు.. ఇరు రాష్ట్రాల్లో సుమారు 25 లక్షల మందికి తాగునీరు అందుతుంది’’ అని విశ్రాంత ఇంజనీర్‌ సుబ్బారాయుడు పేర్కొన్నారు. జిల్లాల విభజన తర్వాత కర్నూలును సస్యశ్యామలం చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు. అమృత్‌ సాగర్‌ రిజర్వాయర్‌ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

కొత్త జిల్లాపై కసరత్తు

మూడు కమిటీల ఏర్పాటు
డివిజన్‌, జిల్లా స్థాయి ఉద్యోగుల్లోనే విభజన
ముగిసిన అభ్యంతరాల గడువు
నూతన జిల్లా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.3 కోట్లు?


కర్నూలు(కలెక్టరేట్‌), మార్చి 3: జిల్లా పునర్విభజనపై అభ్యంతరాల గడువు గురువారంతో ముగిసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్‌ మూడు కమిటీలను ఏర్పాటు చేశారు. అభ్యంతరాల పరిశీలన కోసం సీపీవోను, ఉద్యోగుల విభజన కోసం జిల్లా పరిషత్‌ సీఈవోను, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ తదితర వసతులపై) పరిశ్రమలశాఖ జీఎంను నియమించారు. ఇప్పటికే నూతన జిల్లాలో ప్రభుత్వ కార్యాలయ భవనాల ఎంపిక కోసం ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని నియమించారు. మొత్తంగా కొత్త జిల్లా ఏర్పాటుపై నాలుగు కమిటీలు నిమగ్నమయ్యాయి. అభ్యంతరాలను పరిశీలించి నివేదికలను ప్రభుత్వానికి అందజేయనున్నారు. డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగుల విభజన జిల్లా పరిషత్‌ సీఈవో ఆధ్వర్యంలో జరగనుంది. కొత్త జిల్లాకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అంశంపై పరిశ్రమలశాఖ జీఎం నివేదిక సిద్ధం చేస్తున్నారు.

169 అభ్యంతరాలు

జిల్లా పునర్విభజనపై 169 అభ్యంతరాలు వచ్చాయి. వచ్చిన అభ్యంతరాలలో ఆదోని డివిజన్‌ను కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని, బండి ఆత్మకూరు మండలాన్ని నంద్యాల రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో చేర్చాలని, కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా పేరు మార్చాలని, నందికొట్కూరు నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో చేర్చాలని, బనగానపల్లెలో రెవెన్యూ డివిజన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌లు ఉన్నాయి.

 కొత్త జిల్లాకు రూ.3 కోట్ల నిధులు..?

నంద్యాల జిల్లాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సివిల్‌ వర్క్‌లు, ఫర్నీచర్‌ మొదలైనవాటి కోసం రూ.3 కోట్ల వరకు ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

దరఖాస్తులను 11 కేటగిరీలుగా విభజించాలి

శాఖల వారీగా ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలి
కలెక్టర్‌ కోటేశ్వరరావు ఆదేశాలు


కర్నూలు(కలెక్టరేట్‌), మార్చి 3: నంద్యాల జిల్లాలో విలీనమయ్యే ప్రాంతాలకు సంబంధించి 126 దరఖాస్తులు వచ్చాయని, వీటిని 11 కేటగిరీలుగా విభజించి నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలో జిల్లా స్థాయి అభ్యంతరాలు, సూచనల కమిటీ సభ్యులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా మ్యాప్‌ను తయారు చేయడంతో పాటు డివిజన్‌, దీని పరిధిలోని మండలాలు ఒకే కలర్‌లో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక కలర్‌ ఇవ్వాలన్నారు. అభ్యంతరాలు తెలిపిన ప్రదేశం నుంచి జిల్లా కేంద్రానికి ఎంత దూరం ఉంటుందో కూడా పొందుపరచాలన్నారు. అన్నిశాఖల వారీగా ఉద్యోగుల జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. సీనియర్‌ అసిస్టెంట్‌ అధికారి స్థాయి నుంచి జోనల్‌ సీనియారిటీగా వర్తిస్తుందని తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామసుందర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈవో వెంకటసుబ్బయ్య, సీపీవో అప్పల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-04T05:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising