ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

ABN, First Publish Date - 2022-03-05T05:56:33+05:30

రుద్రవరం మండలం దక్షిణ కొట్టాలకు చెందిన ఇల్లూరి శరత్‌చంద్రారెడ్డి ఉక్రెయిన్‌ నుంచి శుక్రవారం ఇంటికి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అక్కడి పరిస్థితులు భయానకం
 మేమున్న చోటికి దగ్గర్లోనే బాంబులు
 మూడు రోజులు సరైన ఆహారం లేదు
 స్వదేశానికి చేరుతున్న వైద్య విద్యార్థులు


కర్నూలు(కలెక్టరేట్‌) మార్చి 4: ఉక్రెయిన్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపామని వైద్య విద్యార్థులు తెలిపారు. అక్కడి పరిస్థితులు భయానకంగా ఉన్నాయని, మూడు రోజులు సరైన ఆహారం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామున్న చోటికి దగ్గర్లోనే బాంబులు పడ్డాయన్నారు. ఉక్రెయిన్‌లో చదువుతున్న విద్యార్థులు ఒక్కొక్కరిగా జిల్లాకు చేరుకుంటున్నారు. దీంతో తమ పిల్లలు ఇంటికి వస్తుండడంతో కన్నవారి ఆనందానికి అవధుల్లేవు. తొమ్మిది రోజులుగా జరుగుతున్న ఉక్రెయిన్‌, రష్యాల యుద్ధంలో తమ పిల్లలకు ఏదైనా జరుగుతుందోమోనన్న భయాందోళనల్లో తల్లిదండ్రులు గడిపారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో విద్యార్థులు ఒక్కొక్కరిగా దేశానికి తిరిగి వస్తుండడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాకు చెందిన 29 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. శుక్రవారం మరికొందరు విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు.

భయభ్రాంతులకు గురయ్యాం..

నంద్యాల(నూనెపల్లె), మార్చి 4: ఉక్రెయిన్‌లో జరుగుతున్న భీకర యుద్ధంతో తీవ్ర భయభ్రాంతులకు గురయ్యామని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని స్వదేశానికి వచ్చామని ఉక్రెయిన్‌ నుంచి నంద్యాలకు వచ్చిన వైద్య విద్యార్థి జతిన్‌ తేజ తన అనుభవాలను వెల్లడించారు. ‘ఉక్రెయిన్‌లోని బొకోవినియా స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీలో 5వ సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తున్నా. యుద్ధం ప్రారంభం కావడంతో స్వదేశానికి వచ్చేందుకు ఫిబ్రవరి 24వ తేదీన విమానం టికెట్‌ బుక్‌ చేసుకున్నా. 23వ తేదీన దాదాపు 550కిలో మీటర్లు ప్రయాణం చేసి కీవ్‌ సిటీకి చేరుకున్నా. సిటీ సమీపంలో బాంబులు పడడంతో విమానాల రాకపోకలను రద్దు చేశారు. దీంతో అక్కడి నుంచి వెనక్కి బయలుదేరాం. 10గంటల ప్రయాణం కాస్తా 30గంటల సమయం పట్టింది. తినటానికి ఏమి లేక నానా ఇబ్బందులు పడ్డాం. ట్రాఫిక్‌ సమస్యతో వాహనాలన్నీ అక్కడే ఆగిపోవడం, బాంబుల శబ్దాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న గుబులు పట్టుకుంది. ఎట్టకేలకు 28వ తేదీ మళ్లీ తిరిగి యూనివర్సిటీకి చేరుకున్నాం. 28వ తేదీన ఉక్రెయిన్‌ బార్డర్‌ సుశీవా ప్రాంతానికి చేరుకొని, అక్కడి నుంచి 500కిలో మీటర్లు బస్సులో ప్రయాణం చేసి రుమేనియాలోని బుకారెస్ట్‌కు చేరుకున్నాం. అక్కడ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్థావరంలో ఉంచారు. అక్కడ ఉన్న రెండు రోజులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుమేనియా దేశంవారు అన్ని వసతులు కల్పించారు. రెండు రోజుల అనంతరం మార్చి 3వ తేదీన ఎయిర్‌ఇండియా విమానం ద్వారా ముంబయికి చేరుకోవడంతో ఒత్తిడి నుంచి ఉపశమనం లభించింది. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నాను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌ నుంచి నంద్యాలకు క్షేమంగా చేరుకున్నా’. అని వైద్య విద్యార్థి జతిన్‌ తేజ తాను పడిన బాధలను వివరించాడు. ఈ సందర్భంగా జతిన్‌ తేజ, తండ్రి వేణుగోపాల్‌ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి

వైద్య విద్యార్థి నారపురం శ్రీనివాసరెడ్డి

ఉయ్యాలవాడ, మార్చి 4: ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ఉయ్యాలవాడ మండలం ఇంజేడు గ్రామానికి చెందిన వైద్య విద్యార్థి నారపురం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ చేరుకున్న సందర్భంగా ఆయన అక్కడి విషయాలను వెల్లడించారు. ‘ఉక్రెయిన్‌లోని నికార్గియో ప్రాంతంలో మెడిసిన్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాతోపాటు మరో పది మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. రష్యా ఆర్మీ బాంబులతో దాడి చేస్తోంది. దీంతో చాలా భయాందోళనకు గురయ్యాం. మూడు రోజు ల పాటు తినడానికి ఆహా రం లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ట్రైన్‌ ద్వారా వెయ్యి కి.మీ. ప్రయాణించి ఉక్రెయిన్‌ బార్డర్‌కు చేరుకున్నాం. అక్కడి నుంచి మన దేశం ఎయిర్‌లైన్‌ విమానం ద్వారా ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాదుకు వచ్చాను. ప్రస్తుతం హైదరాబాదులోని మా బాబాయ్‌ ఇంట్లో ఉన్నా. మరో మూడు రోజుల్లో ఇంజేడు గ్రామానికి వస్తాను’. అని మెడిసిన్‌ విద్యార్థి శ్రీనివాస్‌రెడ్డి తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపాడు.

మేమున్న కొద్ది దూరంలోనే బాంబుల దాడి

వెల్దుర్తి మార్చి 4: తామున్న కొద్ది దూరంలోనే బాంబులు పడుతుండేవని వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన మనోహర్‌నాయుడు తెలిపాడు. శుక్రవారం ఉక్రెయిన్‌ నుంచి ఇంటికి చేరుకున్న సందర్భంగా ఉక్రెయిన్‌లో తాను పడిన బాధలను పంచుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు రోజులపాటు రైలు ప్రయాణం సాగించామన్నారు. పోలండ్‌కు చేరుకోగానే కేంద్ర మంత్రి వీకే సింగ్‌ తమను చేరదీసి ఇండియా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. అక్కడి నుంచి బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకోగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్వాగతం పలికి అందరినీ ఆంధ్రభవన్‌కు తీసుకెళ్లి భోజన ఏర్పాట్లను చేశారని తెలిపాడు. మరుసటి రోజు తమను హైదరాబాదుకు పంపించగా అక్కడి నుంచి స్థానిక రెవెన్యూ అధికారులు, తహసీల్దార్‌ రాజేశ్వరి సహకారంతో వెల్దుర్తికి చేరుకున్నామని వివరించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనోహర్‌ నాయుడు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఆళ్లగడ్డకు చేరుకున్న వైద్య విద్యార్థి

ఆళ్లగడ్డ, మార్చి 4: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పి.చింతకుంటకు చెందిన వైద్య విద్యార్థి లక్ష్మీసమరసింహారెడ్డి శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఏడాది క్రితం వైద్య విద్య చదివేందుకు ఉక్రెయిన్‌ వెళ్లిన లక్ష్మీసమరసింహారెడ్డి యుద్ధం ప్రారంభం కావడంతో స్వదేశానికి పయనమయ్యారు. తొలుత హంగేరి దేశం చేరుకుని అక్కడి నుంచి రాయబార కార్యాలయ అధికారుల సహాయంతో ఇండియాకు చేరుకున్నట్లు వీఆర్వో తులసి తెలిపారు.

ఉక్రెయిన్‌ నుంచి రుమేనియాకు వెళ్లి..

రుద్రవరం, మార్చి 4: రుద్రవరం మండలం దక్షిణ కొట్టాలకు చెందిన ఇల్లూరి శరత్‌చంద్రారెడ్డి ఉక్రెయిన్‌ నుంచి శుక్రవారం ఇంటికి చేరుకున్నారు. ‘ఫిబ్రవరి 17వ తేదీన ఉక్రెయిన్‌లోని వినిష్టా ప్రాంతంలో మెడిసిన్‌ ప్రథమ సంవత్సరం చదివేందుకు వెళ్లాను. అక్కడ రెండు వారాలు ఉన్నా. ఇంతలోనే యుద్ధం ప్రారంభమైంది. ఉక్రెయిన్‌ నుంచి రుమేనియా దేశానికి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుని హైదరాబాదుకు వచ్చాను’ అని శరత్‌చంద్రారెడ్డి తెలిపారు. కొడుకు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు లక్ష్మీదేవి, వెంకటలక్ష్మిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-03-05T05:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising