దేశాభివృద్ధికి మతోన్మాదం ఆటంకం
ABN, First Publish Date - 2022-10-17T05:44:37+05:30
దేశాభివృద్ధికి మతోన్మాదం ఆటంకమని జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు, ప్రజావైద్యుడు డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి అన్నారు.
కర్నూలు(కల్చరల్), అక్టోబరు 16: దేశాభివృద్ధికి మతోన్మాదం ఆటంకమని జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు, ప్రజావైద్యుడు డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ‘మహాప్రస్థానం-మరో ప్రస్థానం’ సంస్థ ఆధ్వర్యంలో, కవి చౌశా రాసిన ‘రావణకాష్ఠం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నంది నాటక అవార్డు గ్రహీత మహ్మద్ మియా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని కవి జి. వెంకటకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల్ని మతం పేరుతో విభజించి పాలిస్తే అది దేశ ప్రగతికి ఆటంకంగా నిలుస్తుందని చెప్పారు. నేడు లౌకికత్వం దేశంలో కనుమరుగవుతూ సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. ఏ తరహా ఉన్మాదమైనా తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించిన సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ ప్రస్తుత దేశ పరిస్థితులకు అద్దం పట్టేలా కవి చౌశా కవితలు రాశారని ప్రశంసించారు. ఉస్మానియా కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ మండి అన్వర్ హుస్సేన్ మాట్లాడుతూ కవిత్వం భిన్నమైన వస్తువులతో సాగుతుందని, సామాన్యులకు అండగా నిలిచేదే అసలైన కవిత్వమని అన్నారు. పుస్తక సమీక్ష చేసిన కథా రచయిత ఇనాయతుల్లా మాట్లాడుతూ దేశంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయనే సత్యాన్ని కవి చౌశా తన కవిత్వంలో వ్యక్తీకరించారని అన్నారు. కవి జి. వెంకటకృష్ణ మాట్లాడుతూ రావణకాష్ఠం అంటే చెండు మండుతున్నట్లని, అనతికాలంలో చౌశా కవిత్వ లోకంలో స్థిరపడి ప్రగతిశీల భావజాలంతో కవిత్వాన్ని రాస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్ మాట్లాడుతూ దేశంలో జరిగే అనేక పరిణామాలను తన కవిత్వం ద్వారా కవి చౌశా ఈ కవితా సంపుటిలో వ్యక్తం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాయకులు ఎంపీ బసవరాజు, పెరికల రంగస్వామి ఆలపించిన ప్రజాభ్యుదయ గీతాలు ఆకట్టుకున్నాయి.
Updated Date - 2022-10-17T05:44:37+05:30 IST