పచ్చి కరువు..
ABN, First Publish Date - 2022-10-17T05:36:10+05:30
వానల్లేక కరువుతో అల్లాడే కర్నూలు జిల్లాను అధిక వర్షాలు ముంచెత్తాయి.
అతివృష్ఠితో తీవ్రంగా దెబ్బతిన్న పంటలు
నల్ల బారిన తెల్ల బంగారం
చెట్టుపైనే కుళ్లిపోయిన పత్తి కాయలు
ఉమ్మడి జిల్లాలో రూ.4 వేల కోట్ల దిగుబడి లాస్
ఉల్లి, టమోటా, వేరుశనగ, మినుముకు ఉహించని నష్టం
(కర్నూలు-ఆంధ్రజ్యోతి): వానల్లేక కరువుతో అల్లాడే కర్నూలు జిల్లాను అధిక వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వానలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పల్లెల్లో పచ్చి కరువు వచ్చి పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వానలు కురిసి చేతికి వస్తాయనుకున్న పంటలు నీటిపాలయ్యాయి. పొలాల్లో నీరు నిలిచి, తడి ఆరక పంటలు దెబ్బతినిపోయాయి. ముఖ్యంగా పత్తి రైతులకు కోలుకోని నష్టం వాటిల్లింది. చెట్లపై కాయలు చెట్ల మీదే కుళ్లిపోయాయి. ఎకరాకు సగటున ఐదు క్వింటాళ్ల దిగుబడి కోల్పోతున్నామని పత్తి రైతులు అవేదన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో పచ్చి కరువుతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉల్లి, టమోటా, వేరుశనగ, మినుము, పెసర పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. 3.15 లక్షల హెక్టార్లలో తెల్లబంగారం సాగైంది. అంటే.. సరాసరి రూ.4 వేల కోట్ల పత్తి దిగుబడి నష్టపోయే పరిస్థితి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 6.35 లక్షల హెక్టార్లు. కర్నూలు జిల్లాలో 2022-23 ఖరీఫ్‌లో 4,10,963 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. పత్తి 2.65 లక్షలు, వేరుశనగ 71,450 వేలు, ఉల్లి 16 వేలు, టమోటా 12 వేల హెక్టార్లలో సాగు చేశారు. నంద్యాల జిల్లాలో 2.15 హెక్టార్లలో వివిధ పంటలు చేస్తే.. అందులో పత్తి 50 వేలు, టమోటా 3 వేలు, ఉల్లి 4,500, వేరుశనగ 15 వేల హెక్టార్లలో సాగు చేశారని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. రెండు జిల్లాల్లో అత్యధికంగా తెల్లబంగారం పత్తి 3.15 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. మొత్తం సాగులో 49.60 శాతం ఉంది. ఎకరాలకు సగటున రూ.45-50 వేలకు పైగా పెట్టుబడి మట్టిలో పోశారు. పంట చేతికొచ్చే సమయంలో ఎడతెరిపి లేని వర్షాలకు అన్ని రకాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఏకరువు పెడుతున్నారు. పచ్చి కరువు పల్లెసీమల్లో కష్టజీవులను అప్పుల ఊబిలోకి నెట్టేసింది.
కాయ కుళ్లిపోయింది..
పల్లెసీమల్లో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తే పత్తి రైతుల క‘న్నీటి’ వ్యథలు ఎన్నో. పత్తి పంట చూడ్డానికి బాగా ఉంది. పొలంలోకెళ్లి చూస్తే కాయలు కుళ్లిపోయి కనిపిస్తున్నాయి. పత్తి కూడా నల్లబారింది. ఎండలు బాగా ఉంటే పత్తి కాయలు పగిలి పత్తి తీసే కీలక సమయం ఇది. ఒక్కో చెట్టుకు కనీసం 35-45 కాయలకు పైగా ఉండాలని, అప్పుడే ఎకరాకు 7-8 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. కాయలు కుళ్లిపోవడంతో చెట్టుకు 10-15 కాయలు కూడా లేవు. అవి కూడా పత్తి పగులుతుందనే నమ్మకం లేదని అంటున్నారు. సగటున ఎకరాలకు ఐదు క్వింటాళ్లు చొప్పున హెక్టారుకు 12.50 క్వింటాళ్లు నష్టపోతున్నామని అంటున్నారు. తాజాగా క్వింటం రూ.10 వేలు వరకు ధర పలుకుతుంది. అంటే.. అధిక వర్షాలకు హెక్టారుకు రూ.1.25 లక్షలు నష్ట్టపోతున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 3.15 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేసిన రైతులు పచ్చి కరువు మూలంగా సరాసరి రూ.4 వేల కోట్లు నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదనే వ్యక్తం చేస్తున్నారు. కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో నకిలీ విత్తనాలు కూడా రైతులను నట్టేట ముంచాయని అంటున్నారు.
రైతుల కంట కన్నీటి సుడులు..
పత్తి ఒక్కటే కాదు.. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వేరుశనగ, ఉల్లి, టమోటా, మినుము, పెసర, కంది.. వంటి పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. రెండు జిల్లాల్లో వేరుశనగ 86 వేల ఎకరాల్లో సాగు చేశారు. అతివృష్ఠి వర్షాలకు పైరు పచ్చగా పెరిగిందే తప్ప ఊడలు లేవు.. కాయలు లేవు. 50 శాతనికిపైగా దిగుబడి నష్టపోయామని వేరుశనగ రైతులు తెలిపారు. ఉల్లి గడ్డలు పొలంలోనే కుళ్లిపోయాయి. అకకొర పంట మార్కెట్‌కు తెస్తే కొనేవారే లేరు. 50 కిలోలు బస్తా రూ.100-150కి కూడా అడిగేవారు లేరని పొలంలోనే వదిలేస్తున్నారు. మినుము, కంది, పెసర పంటలది అదే పరిస్థితి. టమోటా పంట కూడా కుళ్లిపోతోంది. చేతికొచ్చిన కాయలకు నల్లమచ్చలు ఏర్పడి ధర పతనం అయ్యింది. ఏ పంట చూసినా.. ఏ రైతును కదిపినా కన్నీటి సుడులే. అధిక వర్షాలకు పల్లెసీమలను పచ్చి కరువు కబళించిందని ఆవేదన చెందుతున్నారు.
పెట్టుబడి మట్టిపాలైంది
సొంత పొలం రెండు ఎకరాలు ఉంది. మరో 23 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, ఉల్లి, టమోటా పంటలు సాగు చేశాను. రూ.6-7 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాను. ఏడు ఎకరాల్లో పత్తి వేస్తే.. అధిక వర్షాలకు చెట్టుపై కాయలు చెట్టుపైనే కుళ్లిపోయాయి. ఎకరాకు ఐదు క్వింటాళ్లు నష్టపోయాల్సి వచ్చింది. టమోటా, ఉల్లి పరిస్థితి అదే. పెట్ట్టుబడి మట్టిపాలైంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
- వి.వెంకటేశ్వర్లు, సలకాపురం గ్రామం, కల్లూరు మండలం
అధిక వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది
మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ఎకరాకు రూ.45-50 వేలు సాగు ఖర్చు చేశాను. పైరు పచ్చగా పెరుగుతుంటే కష్టాలు తీరుతాయని ఆశించాను. పంట చేతికొచ్చి సమయంలో ఎడతెరిపి లేని అధిక వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ప్రభుత్వం పంటనష్ట పరిహారం అందించాలి.
- చిన్న రాముడు, పత్తి రైతు
చెట్టుపైనే కాయలు కుళ్లిపోయాయి
ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టాను. పంట చేతికొచ్చే సమయంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెట్టుపై కాయలు కుళ్లిపోయాయి. ఒక్కో చెట్టుకు 20-25 కాయకులు కుళ్లిపోవడంతో దిగుబడి 2-3 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. నాసిరకం విత్తనాల వల్ల కూడా నష్టపోయాను. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
- కె.రామకృష్ణ, పత్తి రైతు, సలకాపురం
పశువులకు గడ్డి అమ్ముకొని బతుకున్నాం
తెల్లబంగారమని నమ్మి 11 ఎకరాల్లో పత్తి చేశాను. చెట్టుకు కాసిన కాయలు చూసి కష్టాలు తీరుతాయని అశించాను. అధిక వర్షాలకు భూమిలో తేమ ఎక్కువై కాయలు, పూత రాలిపోయింది. అప్పులపాలయ్యా. మా ఊర్లో దాదాపు 4 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అందరిదీ ఇదే పరిస్థితి. బతుకు తెరువు కోసం పచ్చిగడ్డి కోసి కర్నూలుకు తీసికెళ్లి అమ్ముకొని జీవిస్తున్నాం.
- శంకరయ్య, ఎ.గోకులపాడు గ్రామం
Updated Date - 2022-10-17T05:36:10+05:30 IST