సీఎం గారూ. .. ఇవీ మా సమస్యలు
ABN, First Publish Date - 2022-10-17T05:41:13+05:30
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఆళ్లగడ్డ పర్యటనకు రానున్నారు. రైతు భరోసా నిధుల పంపిణీ కోసం రానున్న సీఎంకు నియోజకవర్గ సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
ఆళ్లగడ్డ ప్రజలకు అడుగడుగునా ఇక్కట్లే..
నేడు రైతు భరోసా నిధుల పంపిణీకి రానున్న సీఎం
ఆళ్లగడ్డ, అక్టోబరు 16: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఆళ్లగడ్డ పర్యటనకు రానున్నారు. రైతు భరోసా నిధుల పంపిణీ కోసం రానున్న సీఎంకు నియోజకవర్గ సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
నియోజకవర్గంలో ప్రవహిస్తున్న కేసీ కాలువ సాగు నీటితో 1.50 ఎకరాల్లో వరి, జొన్న, పొద్దుతిరుగుడు తదితర పంటలను ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సాగు చేసుకుంటున్నారు. కానీ కేసీ ప్రధాన కాలువకు కడప జిల్లా జంగాలపల్లె వద్ద నేటికీ సిమెంటు లైనింగుకు నోచుకోలేదు. దీంతో వందల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందటం లేదు. పైగా పంట కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి.
మద్రాసుకు తాగునీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలుగుగంగ కాలువ సబ్ చానళ్లు, పంట కాలువలు లేక 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుబాటులో ఉన్నప్పటికీ పంటలు పండించుకోలేని దుస్థితి ఏర్పడింది.
ఆళ్లగడ్డ శిల్పకళకు పెట్టింది పేరు. ఈ కళపై 2వేల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ తయారైన శిల్పాలు ఖండాంతరాలు దాటిపోతున్నాయి. అయినా ఇక్కడి శిల్పాలను తయారు చేసే రాయిపై రాయల్టీ వసూలు చేస్తుండటంతో శిల్పులు ఇబ్బంది పడుతున్నారు. శిల్పులు తయారు చేసిన శిల్పాలను ఒక చోట ఉంచుకోని అమ్ముకునేందుకు అవసరమైన స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తే కొనుగోలుదారులకు సౌకర్యంగా ఉంటుంది. దీనిపై సీఎం ఆలోచించి న్యాయం చేయాలని శిల్పకళాకారులు కోరుతున్నారు.
అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వెళ్ల్లేందుకు రహదారి అస్తవ్యస్తంగా ఉంది. ఈ రహదారిలో నిత్యం వందలాది వాహనాల్లో తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. వీరంతా రహదారి సరిగా లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా పుణ్యక్షేత్రంలో భక్తులు విడిది చేసేందుకు అవసరమైన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
నియోజకవర్గంలో ఆరు మండలాలు, 110 గ్రామ పంచాయతీలు, 30 మజరా గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక ఆళ్లగడ్డలోని ప్రభుత్వ వైద్యశాలకు వైద్యం కోసం తరలివస్తుంటారు. వీరికి సరైన వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న 50 పడకల వైద్యశాలను వంద పడకల వైద్యశాలగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా హైవే ఉండటంతో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. వైద్యశాలలో చికిత్సలు చేసేందుకు సిబ్బంది కొరత వేధిస్తున్నది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేశారు కాని అధ్యాపకుల నియామకం, తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
నియోజకవర్గంలో పశువైద్యశాలలు మరమ్మతులకు నోచుకోక పోవడంతో పశువైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పశువైద్యశాలల్లో మందుల నిల్వ ఉంచుకోలేక పోతుండటంతో పశువులకు సకాలంలో వైద్యం అందడం లేదు.
నియోజకవర్గంలోని గ్రామాల్లోని రైతులు పశువుల కోసం నిర్మించుకు న్న గోశాలలకు బిల్లులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు చెల్లించాలని సంబంఽధిత అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు అభివృద్ధికి నోచుకోక పోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామాల్లో నిర్మించిన స్వచ్ఛాంధ్ర షెడ్లు నిరూపయోగంగా మారాయి. దీంతో గ్రామాలన్నీ మురికి కూపాలుగా మారి అంటురోగాలు ప్రబలుతున్నాయి.
పట్టణంలో నిర్మించిన టిడ్కో గృహాలు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరుకున్నాయి. గృహాల సముదాయంలో నిరుపేదలు చేరేందుకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. గృహాల కోసం లబ్ధ్దిదారులు చెల్లించిన డిపాజిట్లను తిరిగి ఇవ్వక పోవడంతో ఆందోళన చెందుతున్నారు.
సీఎం పర్యటన ఇలా..
సీఎం జగన్ మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం 9గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఆళ్లగడ్డ చేరుకుంటారు. 10.45 నుంచి 12.10 గంటల వరకు పట్టణంలోని వైపీపీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం రెండో విడత రైతు భరోసా, మూడో విడత పీఎం కిసాన్ పథకం కింద నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు బటన్ నొక్కుతారు. అనంతరం 2.15 గంటలకు తాడేపల్లె నివాసానికి చేరుకుంటారు.
Updated Date - 2022-10-17T05:41:13+05:30 IST