ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశలన్నీ ఆవిరి

ABN, First Publish Date - 2022-12-15T23:43:24+05:30

ఆశలన్నీ ఆవిరి

మల్లేవేములలో దెబ్బతిన్న మినుము పంటను చూపిస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతులకు నష్టాన్ని మిగిల్చిన మాండస్‌

10వేల ఎకరాలకు పైగా దెబ్బతిన్న పంటలు

రంగుమారిన ధాన్యం

ప్రభుత్వం ఆదుకోవాలని వినతి

మాండస్‌ తుఫాన్‌ జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పదివేల ఎకరాలకు పైగానే పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ధాన్యం తడిసి.. రంగు మారాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ ఏడాది అన్నదాతల ఆశలను తఫాన్‌ తుంచేసింది. రంగు మారిన... మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఎవరూ కొనే పరిస్థితి లేదని... ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

నంద్యాల, ఆంధ్రజ్యోతి: ప్రకృతి వైపరీత్యాల వల్ల నిత్యం రైతు నష్టపోతూనే ఉన్నాడు. ఈసారి మాండస్‌ తుఫాను రూపంలో విరుచుకుపడటంతో జిల్లా రైతులు కుదేలయ్యారు. బంగాళాఖాతంలో తుఫాను వల్ల నాలుగు రోజులు వర్షం కురిసింది. దీంతో జిల్లాలో 10 వేల ఎకరాలకు పైగా వరి, మిర్చి, మినుము, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలు దెబ్బతిన్నాయి. అంతా బాగుంది. ఈ ఏడాదైనా ఆదాయాన్ని కళ్ల చూద్దామనుకుంటే తుఫాను తమను దెబ్బ తీసిందని... ధాన్యం తడిసి.. రంగు మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని.. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

ఇంటికి చేరే సమయంలో..

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి పంట బాగా పండింది. సకాలంలో వర్షాలు కురవడంతో ప్రతి ఏటా వచ్చే దిగుబడి కంటే అధికంగానే వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఏటా ఎకరాకు 30 నుంచి 35 బస్తాలకు పరిమితమైన ధాన్యం ఈసారి మాత్రం 40 బస్తాల పైనే పండాయి. సాధారణంతో పోల్చుకుంటే ఈ దిగుబడి చాలా ఎక్కువ. ఆశించిన దానికంటే ఎక్కువే పండటంతో రైతులు ఆనందంగా ఉన్నారు. కోత కోసి కల్లాల్లో ఆరబెట్టారు. ఈ లోపు వర్షం ముసురుకుంది. ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. వరుసగా నాలుగు రోజులు కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయి రంగు మారాయి. కొన్ని చోట్ల మొలక కూడా వచ్చింది. కోతలు కోసిన ధాన్యం పరిస్థ్థితి ఇలా ఉండగా... పొలాల్లో ఉన్న పైరు పరిస్థితి మరో రకంగా ఉంది. తుఫాను ధాటికి వరి నేల వాలి నీటిలో నానింది. ఇలాంటి పైరును కోసేదెలా... ఆ తర్వాత వాటిని అమ్మేదెలా అంటూ రైతులు బోరుమంటున్నారు.

రాలిన పూత..

ధాన్యం రైతుల పరిస్థితి ఇలా ఉంటే రబీ సీజన్‌లో కంది, మినుము, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలను వేసిన రైతులు పరిస్థితి మరోలా ఉంది. పూత బాగా పూసి.. మంచి పైరు మీద ఉన్న మినుము, కంది పంటలు తుఫాను ధాటికి దెబ్బతిన్నాయి. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన మినుము వర్షం ప్రభావంతో క్వింటం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో కోతలు కోయిస్తే కూలీల ఖర్చు అదనపు భారం తప్పితే వచ్చే ఆదాయం ఏమీ ఉండదని రైతులు అంటున్నారు. ఇప్పటికే రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు మినుము పంట మీద ఖర్చు పెట్టిన రైతులు ఉన్నారు. ఆ ఖర్చు మొత్తం వర్షార్పణమైనట్లే. ఇప్పటికే ఒకటి రెండుసార్లు తీయడం పూర్తయిన పత్తి కూడా దెబ్బతింది. పత్తి ధర తగ్గిపోయి రైతు ఉసూరమంటున్న సమయంలో పొలాల్లో ఉన్న పంట వర్షం పాలయింది. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పత్తి రైతు కూరుకుపోయాడు. మొక్కజొన్న, కంది, మిరప రైతులు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు.

పంట నష్టం ఇలా..

మాండస్‌ తుఫాను కారణంగా జిల్లాలో ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వేసిన వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయ అధికారులు ప్రాథమిక నష్టం అంచనాను తయారు చేశారు. ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, నందికొట్కూరు, నంద్యాల, ఆత్మకూరు వ్యవసాయ డివిజన్లలోని 13 మండలాల్లో 10,778 ఎకరాల్లో వరి, మినుములు, కందులు, శనగ, మిరప, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఆళ్లగడ్డ వ్యవసాయ డివిజన్‌లో ఆళ్లగడ్డ, చాగలమర్రి, గోస్పాడు, రుద్రవరం, శిరివెళ్ల మండలాల్లో 4,297 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కోవెలకుంట్ల వ్యవసాయ డివిజన్‌లో సంజామల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లో 2,927 ఎకరాల్లో కంది, మిరప, మినుము పంటలు దెబ్బతిన్నాయి. నందికొట్కూరు, నంద్యాల వ్యవసాయ డివిజన్లలోని నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, బండి ఆత్మకూరు, మహానంది మండలాల్లో 1,513 ఎకరాల్లో శనగ, జొన్న పంటలు దెబ్బతినగా, నంద్యాల వ్యవసాయ డివిజన్‌లోని పాణ్యం, బనగానపల్లె, నంద్యాల, గడివేముల మండలాల్లో 2,820 ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఇక ఆత్మకూరు వ్యవసాయ డివిజన్‌లోని వెలుగోడు మండలంలో 70 ఎకరాల్లో పొగాకు దెబ్బతింది.

200 ఎకరాల్లో దెబ్బతిన్న మినుము

చాగలమర్రి: మల్లేవేముల గ్రామంలో 200 ఎకరాల్లో మినుము పంట దెబ్బతింది. గ్రామానికి చెందిన రైతు నందీశ్వర్‌రెడ్డికి సంబంధించి 8 ఎకరాల మినుము పంట నీట మునిగి దెబ్బతింది. రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టిన క్వింటం దిగుబడి కూడా రాలేదు. పంటను వదిలేశాడు. మూడేళ్ల నుంచి పంటలు పండక రూ.40 లక్షలు దాకా అప్పులయ్యాయని చెప్పారు. అప్పులు తీర్చేందుకు మూడెకరాల పొలాన్ని అమ్ముకున్నానని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందలేదన్నారు. గత ప్రభుత్వంలో పంటలు పండించుకొని గట్టెక్కామని... ఇప్పుడు నష్టాలు తప్ప లాభం లేదని అన్నారు. ఇలాగైతే మిగిలిన పొలాలు కూడా అమ్ముకోవాల్సిందేనని రైతు విలపించాడు. ఉసేని అనే రైతు రెండెకరాలలో మినుము పంట సాగుచేస్తే 70 కేజీల దిగుబడి వచ్చింది. మరో రైతు వెంకటేశ్వర్‌రెడ్డి మూడు ఎకరాలు మినుము పంట సాగు చేసి క్వింటా దిగుబడి కూడా రాలేదని వాపోయాడు. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల మినుము దిగుబడి రావాల్సి ఉండగా కేవలం ఎకరాకు క్వింటం వంతున మాత్రమే వచ్చిందని జగన్‌మోహన్‌రెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. చేతికొచ్చిన పంట మాండస్‌ తుఫాన్‌ వల్ల నల్లబారి దెబ్బతిందని చెప్పాడు. గింజలు రంగుమారడంతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. రూ.1.50 లక్షలు పెట్టుబడి నష్టపోయినట్లేనని... ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని ఆ రైతు కోరాడు.

ప్రభుత్వానికి నివేదిక పంపుతాం

మాండస్‌ తుఫాను కారణంగా జిల్లాలో వివిధ రకాలు పంటలు దెబ్బతిన్నాయి. వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రాథమిక అంచనా తయారు చేశాం. ఈ నెల 20 లేదా 21వ తేదీ లోపు తుది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతాం. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తాం.

- మోహన్‌రావు, వ్యవసాయాధికారి, నంద్యాల

పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు

నాలుగెకరాల్లో కంది సాగు చేశాం. దీని కోసం రూ.80 వేల దాకా ఖర్చయింది. పంట చేతికొచ్చే సమయంలో వర్షాల వల్ల కంది బుడ్డలు ఉబ్బిపోయి వాటిలో మొలకలు వచ్చాయి. దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.

- రైతు భాస్కర్‌ నాయుడు, చిన్నమల్కాపురం గ్రామం, డోన్‌ మండలం

ప్రభుత్వం ఆదుకోవాలి

వరి పంట చేతికందే సమయంలో మాండస్‌ తుఫాన్‌ నట్టేట ముంచింది. నాలుగు ఎకరాల్లో వరి పంట సాగు చేశా. రూ.1.50 లక్షలు ఖర్చు చేశా. పంట కోత సమయంలో నేలవాలి దెబ్బతింది. వరి ధాన్యం నేలపై పడి రంగుమారింది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.

- కృష్ణారెడ్డి, రైతు, మల్లేవేముల గ్రామం

కంది పూత, పిందె రాలిపోయాయి

ఐదెకరాల్లో కంది సాగు చేశాను. రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాను. తుఫాన్‌ వల్ల పూత, పిందె రాలిపోయాయి. ఆశించిన దిగుబడి కూడా రాదు. పూర్తిగా నష్టపోయినట్లే.

-కృష్ణుడు, శాతనకోట

రెండెకరాల్లో వరి సాగు

రెండెకరాల్లో వరి సాగు చేశాం. రూ.60 వేలు ఖర్చు చేశాం. పంట కోసి పొలంలోనే ఉంచాం. ఇంతలోనే తుఫాన్‌ వల్ల తడిసిపోయింది. వడ్లు పట్టించడం కూడా కష్టమే. పట్టించినా బియ్యం విరిగిపోతాయి. ప్రభుత్వం ఆదుకోవాలి.

-పార్వతమ్మ, శాతనకోట

Updated Date - 2022-12-15T23:44:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising