‘సీమలో 11 జిల్లాలను ఏర్పాటు చేయాలి’
ABN, First Publish Date - 2022-03-05T05:36:54+05:30
విస్తీర్ణం ప్రకారం రాయలసీమలో 11 జిల్లాలను ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి కోరారు.
కర్నూలు(కలెక్టరేట్), మార్చి 4: విస్తీర్ణం ప్రకారం రాయలసీమలో 11 జిల్లాలను ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి కోరారు. కలెక్టరేట్ ఆవరణలో రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాల విభజనను స్వాగతిస్తున్నామన్నారు. అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 42 శాతం విస్తీర్ణంలో ఉన్న రాయలసీమలో 11 జిల్లాలను ఏర్పాటు చేయాల్సింది పోయి కేవలం 8 జిల్లాలకు కుదించడం సరికాదని అన్నారు. ఆదోని, మదనపల్లి, గుంతకల్లు జిల్లాలను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 150 ఏళ్లుగా సాగునీటి వసతి కల్పించకపోవడంతో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రాయలసీమలో ప్రస్తుతం 50 లక్షల జనాబా శాశ్వతంగా వలసలు వెళ్లగా, మరో 30 లక్షల మంది తాత్కాలిక వలసలకు వెళ్తున్నారని తెలిపారు. దీంతో జనాభా ప్రాతిపదికన 2025లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉందన్నారు. కాబట్టి సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు ఏర్పాటు చేసి వలసలను నివారించాలని కోరారు. వలసల నివారణ కోసం ప్రధానంగా ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకుడు అరుణ్ మాట్లాడుతూ ఆదోని జిల్లా ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదని, అయినా పాలకులు పట్టించుకోవడం లేదని అన్నారు. రచయిత పాణి మాట్లాడుతూ జిల్లాల విభజనకు ప్రభుత్వం కనీస శాస్త్రీయ పద్ధతి పాటించలేదని, కేవలం ఎన్నికల రాజకీయ సమీకరణాల ప్రకారమే విభజించారని అన్నారు. రామకృష్ణారెడ్డి, రాజు, కోదండం తదితర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Updated Date - 2022-03-05T05:36:54+05:30 IST