జల జగడం..!
ABN, First Publish Date - 2022-08-04T06:07:17+05:30
జల జగడం..!
తెంపల్లి పైపులైన్ల పనులపై నీలినీడలు
కాంట్రాక్టు సంస్థపై గన్నవరం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఫిర్యాదు
ప్రతిగా ఏఈ అవినీతిపై కాంట్రాక్టు సంస్థ ఫిర్యాదు
పరస్పర ఆరోపణలతో ఉన్నతాధికారులకు తలబొప్పి
డయేరియా కేసులతో అల్లాడిపోతున్న తెంపల్లిలో యుద్ధప్రాతిపదికన రక్షిత మంచినీటి పనులు చేపట్టనున్న గారపాటి కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టు సంస్థ, గన్నవరం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కె.సుజాత మధ్య జల జగడం నడుస్తోంది. ఇరువర్గాలు పరస్పర ఆరోపణలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/గన్నవరం) : తెంపల్లికి రక్షిత మంచినీటిని అందించేందుకు కొత్తగా పైపులైన్ల నిర్మాణం కోసం రూ.32 లక్షలతో ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో మూడు సంస్థలు పాలు పంచుకున్నాయి. అయితే, టెండర్లకు స్పందన రావటం లేదన్న ఉద్దేశంతో ఇటీవల అంచనా విలువపై 5 శాతం వరకు అధికంగా వేసుకునే అవకాశాన్ని ఆర్డబ్ల్యూఎస్ కల్పించింది. ఈ నిర్ణయం వల్ల కొన్ని పనులకు టెండర్లు పడుతున్నాయి. ఈ క్రమంలోనే తెంపల్లి మంచినీటి పైపులైన్లకు టెండర్లు పిలవగా, కాంట్రాక్టు సంస్థలు మూడుశాతంలోపు అధికంగా టెండర్ దాఖలు చేశాయి. మొదట గారపాటి కన్స్ట్రక్షన్స్ 1.89 శాతం, పీవై ప్రాజెక్ట్స్ 2.6 శాతం ఎక్కువకు కోట్ చేశాయి. కె.రామ సూరారెడ్డి అనే వ్యక్తి కూడా టెండర్ వేసినప్పటికీ డిస్ క్వాలిఫై అయింది. ఇక పీవై కన్స్ట్రక్షన్స్ ఆన్లైన్లో రిజిస్ర్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)లో కంపెనీ నమోదైనట్టుగా పొందుపరచలేదు. వాస్తవానికి ఈ సర్టిఫికెట్ అప్లోడ్ చేయనందున ఆ సంస్థ టెండరును తెరవకూడదు. కానీ తెరిచారు. అయినప్పటికీ పీవీ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ కోట్ చేయటంతో ఎంపిక కాలేదు. దీంతో గారపాటి కన్స్ట్రక్షన్స్ ఎంపికైనట్టుగా ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆ సంస్థతో అగ్రిమెంట్ అవుతున్న దశలో గన్నవరం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కె.సుజాత.. గారపాటి సంస్థపై కృష్ణాజిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ కాపీని సమాచారం నిమిత్తం జిల్లా కలెక్టరుకు కూడా పంపారు. దీంతో ఏఈపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ సంబంధిత కాంట్రాక్టు సంస్థ యాజమాన్యం కూడా ఉన్నతాధికారులకు ప్రతిగా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులను చూస్తే.. గతం నుంచి ఏఈ, కాంట్రాక్టు సంస్థ యాజమాన్యం మధ్య వివాదాలు ఉన్నట్టు బహిర్గతమైంది. కాగా, ఏఈ అవినీతి పనులపై కలెక్టరుతో పాటు విజిలెన్స్, ఏసీబీ చివరకు లోకాయుక్తలో కూడా గారపాటి కాంట్రాక్టు సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాలపై శాఖాపరంగా విచారణలు నడుస్తున్నాయి.
ఏఈపై కాంట్రాక్టు సంస్థ ఫిర్యాదు
తెంపల్లి టెండర్లలో ఏఈ ఒక సంస్థతో కుమ్మక్కయ్యారని కాంట్రాక్టు సంస్థ ఆరోపించింది. ఆర్వోసీ సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేయనందున పీవై సంస్థ వేసిన టెండరును తెరవ కూడదని, కానీ, బలవంతంగా ఏఈనే తెరిపించారని ఆరోపించారు. పీవై సంస్థ కంటే తాము తక్కువకు కోట్ చేయటంతోనే టెండర్ దక్కిందన్నారు. తమ సంస్థ బ్లాక్‌లిస్టులో లేదని స్పష్టత ఇచ్చారు. కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెట్టి, తనకు నచ్చినట్టుగా పనులు చేయించి, తప్పుడు రికార్డులు నమోదు చేయించిన ఉదంతాలపై ఇప్పటికే సాక్ష్యాధారాల సహా తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఏఈపై తాము చేసిన ఫిర్యాదులకు సంబంధించి ప్రభుత్వ శాఖల ద్వారా విచారణ జరుగుతోందన్నారు. తమపై ఫిర్యాదు చేసిన ఏఈ.. ఎన్ఏ పేట, ఆనందపురం గ్రామాల్లో నిర్మించిన ఆర్వో ప్లాంట్లలోని సింటెక్స్ ట్యాంకులను 5వేల లీటర్ల కెపాసిటీకి బదులు 3వేల కెపాసిటీకే పెట్టారని, బిల్స్ రికార్డు చేశారని ఆరోపించారు. ఆత్కూరులో పైపులైన్ల పనులకు సంబంధించి అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం 100 ట్రెంచ్ ఉండాల్సి ఉండగా, 90 ట్రెంచ్‌తో కాంట్రాక్టరుతో పనులు చేయించారని ఆరోపించారు. గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో ఎంపీ ల్యాడ్స్, జడ్పీ నిధులతో వాటర్ పైపులైన్, స్విచ్‌బోర్డు రూమ్ పనులను జడ్పీ అనుమతి లేకుండానే కాంట్రాక్టరుతో పనులు చేయించి ఫైనల్ బిల్లు పేమెంట్ చేశారని ఆరోపించారు. రాయనపాడు, పైడూరుపాడులో లక్షలాది రూపాయల పనులను అడ్డగోలుగా చేయించారని, వీటిపై విచారణ నడుస్తోందన్నారు.
కాంట్రాక్టు సంస్థపై ఏఈ ఫిర్యాదు
టెండర్లలో పాలు పంచుకున్న గారపాటి కన్స్ట్రక్షన్స్ ఎక్కువ కోట్ చేశారనేది ఏఈ ప్రధాన ఆరోపణ. ఈఎన్సీ స్థాయిలో ఈ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టారని ఆరోపించారు. గతంలో ఉంగుటూరు మండలంలోని ఎన్ఏ పేటలో ఏఎస్వీఎస్ పనులకు సంబంధించి రూ.38 లక్షలకు టెండర్లు పిలవగా, గారపాటి కన్స్ట్రక్షన్స్ సకాలంలో పూర్తి చేయలేదని ఆరోపించారు. జాప్యానికి సంబంధించి ఏఈని బ్లాక్మెయిల్ చేశారని తెలిపారు. ప్రస్తుత టెండర్ల సాంకేతిక అర్హతలను పునః పరిశీలించాలని కోరారు. డయేరియా కేసులతో బాధపడుతున్న గ్రామంలో సరైన ఏజెన్సీని ఎంపిక చేయటం ముఖ్యమని విన్నవించారు.
Updated Date - 2022-08-04T06:07:17+05:30 IST