మార్గం సుగమం
ABN, First Publish Date - 2022-10-30T00:24:49+05:30
ఎట్టకేలకు విజయవాడ ఈస్ట్ బైపాస్ ట్రాక్‌లోకి వచ్చింది. ఇటీవల కొంతకాలం వరకు ప్రతిష్టంభనలో పడిన ఈ ప్రాజెక్టు శరవేగంగా ముందుకు కదులుతోంది.
చైతన్య కన్సల్టెన్సీకి డీపీఆర్ బాధ్యతలు
భూ సేకరణ వ్యయమంతా కేంద్రానిదే..
లాజిస్టిక్ పార్క్ బాధ్యత మాత్రం రాష్ర్టానిది...
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎట్టకేలకు విజయవాడ ఈస్ట్ బైపాస్ ట్రాక్‌లోకి వచ్చింది. ఇటీవల కొంతకాలం వరకు ప్రతిష్టంభనలో పడిన ఈ ప్రాజెక్టు శరవేగంగా ముందుకు కదులుతోంది. తూర్పు బైపాస్ కోసం జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు టెండర్లు పిలిచింది. చైతన్య కన్సల్టెన్సీ అనే సంస్థ ఈ బాధ్యతలను దక్కించుకుంది. గన్నవరం మండలం చిన అవుటపల్లి నుంచి గుంటూరులో కాజా వరకు 40 కిలోమీటర్ల మేర నిడివి కలిగిన రూట్‌లో ఆరు వరసల బైపాస్‌కు భూ సేకరణ వ్యయాన్ని పూర్తిగా ఎన్‌హెచ్ భరించనుండటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో భూములను సేకరించి అప్పగించి, మినరల్స్‌కు సంబంధించిన రాయితీలను ఇస్తే సరిపోతుంది. అలాగే లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు మాత్రం సొంతంగా భూ సేకరణ జరిపి ఎన్‌హెచ్‌కు ఇవ్వాల్సి ఉంది. అయితే, లాజిస్టిక్ పార్క్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు రావటంతో ఈ ప్రాజెక్టుపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ తర్వాత ప్రభుత్వం అంగీకరించడంతో కదలిక వచ్చింది.
యుద్ధప్రాతిపదికన..
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునైనా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు యుద్ధ ప్రాతిపదికన టెండర్లు పిలిచే అవకాశం ఉంది. డీపీఆర్‌కు సంబంధించి చైతన్య కన్సల్టెన్సీ సంస్థకు నిర్దిష్ట గడువంటూ ఏమీ ఇవ్వలేదు. ఫీజుబిలిటీ రిపోర్టు, అలైన్‌మెంట్, లొకేషన్ సర్వే, జియో టెక్నికల్ సర్వే, ల్యాండ్ ప్లాన్స్, జియాలజికల్ మ్యాపింగ్, సోషియో స్టడీ, ల్యాండ్ అకి ్వజిషన్, సివిల్ ఎస్టిమేషన్స్, స్థూల ప్రాజెక్టు వ్యయం వంటి వివరాలను డీపీఆర్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. డీపీఆర్ పూర్తయితే కానీ అలైన్‌మెంట్‌ను బట్టి ఈ ప్రాజెక్టు ఏయే గ్రామాల మీదుగా వెళ్తుందో తెలియదు. ఈ బైపాస్ చిన అవుటపల్లి పిన్నమనేని హాస్పిటల్ దగ్గర నుంచి ప్రస్తుత విజయవాడ పశ్చిమ బైపాస్‌కు అభిముఖంగా ప్రారంభమవుతుంది. అల్లాపురం, మంతెన, ఉప్పులూరు, గోసాల, చోడవరం, నూతక్కి, రేవేంద్రపాడు, కాజా వరకు సాగే అవకాశముంది.
లాజిస్టిక్ పార్కుకు తేలని భూములు
లాజిస్టిక్ పార్కుకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించటానికి అంగీకరించింది. ఈ భూముల విషయం ఇంకా తేలలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒకచోట భూములు ఇస్తామని ప్రతిపాదించింది. ఆ ప్రాంతంలో భూములు తీసుకోవటం ఎన్‌హెచ్‌కు నచ్చలేదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పశ్చిమ బైపాస్ కానీ, తూర్పు బైపాస్ వెంబడి కానీ భూములు ఇవ్వాల్సిందిగా కోరినట్టు సమాచారం.
Updated Date - 2022-10-30T00:24:51+05:30 IST