పేరుకే పదవులు.. పెత్తనం రెడ్లకు!
ABN, First Publish Date - 2022-12-07T01:02:20+05:30
వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేసిందని, బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద నిర్వహించనున్న ‘ఇదేం ఖర్మం బీసీలకు’ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని బొండా ఉమా పిలుపునిచ్చారు.
పాయకాపురం, డిసెంబరు 6 : వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేసిందని, బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద నిర్వహించనున్న ‘ఇదేం ఖర్మం బీసీలకు’ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని బొండా ఉమా పిలుపునిచ్చారు. మొగల్రాజపురంలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులిచ్చారని, కాని పెత్తనమంతా నలుగురు రెడ్లకు సీఎం జగన్ కట్టబెట్టారని విమర్శించారు. 56 కులాల బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం నిధులు మాత్రం పైసా విదల్చలేదని చెప్పారు. జగన్‌కి బీసీలపై కక్ష, ద్వేషం ఉండబట్టే తెలుగుదేశం పార్టీ తెచ్చిన పథకాలన్ని రద్దుచేసి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో మొండిచేయి చూపారని మండిపడ్డారు. జగన్ పాలనలో 175 మంది బీసీలను పొట్టనపెట్టుకున్నారని, 650 మందిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని, 2500 మందిని తప్పుడు కేసులతో వేధించారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో ‘బీసీలంతా ఇదేం ఖర్మరా’ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ధర్నాచౌక్ వద్ద జరగనున్న నిరసన కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎరుబోతు రమణారావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T01:02:21+05:30 IST