న్యాయవాదులకు వ్యాయామం అవసరం
ABN, First Publish Date - 2022-12-15T01:10:22+05:30
ఒత్తిడితో కూడిన వృత్తిని నిర్వహించే న్యాయవాదులకు వ్యాయామం చాలా అవసరమని, వ్యాయామానికి ఎంత దగ్గరగా ఉంటే వ్యాధులు అంత దూరంగా ఉంటాయని డాక్టర్ ఎంజే నాయుడు తెలిపారు.
విజయవాడ లీగల్, డిసెంబరు 14 : ఒత్తిడితో కూడిన వృత్తిని నిర్వహించే న్యాయవాదులకు వ్యాయామం చాలా అవసరమని, వ్యాయామానికి ఎంత దగ్గరగా ఉంటే వ్యాధులు అంత దూరంగా ఉంటాయని డాక్టర్ ఎంజే నాయుడు తెలిపారు. బుధవారం బెజవాడ బార్ అసోసియేషన్‌లో ఎముకలు, కీళ్లు, నరాలు, కండరాల సమస్యలపై ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులచే హాస్పటల్ చైర్మన్ వావిలాల రజనీకాంత్ శర్మ పర్యవేక్షణలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఎంజే నాయుడు న్యాయవాదులనుద్దేశించి మాట్లాడుతూ న్యాయవాదులు వృత్తిపరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారని అందువలన బీపీ, షుగర్ వంటి వ్యాధులతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి వ్యాయామాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. అనంతరం న్యాయవాదులకు బోన్ మినరల్ డెన్సిటీ (బీఎండీ), బీపీ, షుగర్, ఎముకల అరుగుదల వంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను అందచేశారు. ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఎం.వంశీకృష్ణ, బెజవాడ బార్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రగిరి విష్ణువర్ధన్, గంధం శ్రీనివాసరావు, వరప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ ఎంజే నాయుడు, డాక్టర్ వంశీకృష్ణ, రజనీకాంత్ శర్మలను న్యాయవాదులు దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.
Updated Date - 2022-12-15T01:10:23+05:30 IST