రైతు బాంధవుడు కాకాని
ABN, First Publish Date - 2022-08-04T07:13:18+05:30
రైతు బాంధవుడు కాకాని
చిట్టినగర్, ఆగస్టు 3: రైతు బాంధవుడు కాకాని వెంకటరత్నమని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు కొనియాడారు. వ్యవసాయ పశుపోషక, పాలసేకరణ శాఖలకు రాష్ట్ర మంత్రిగా పని చేసి, పాడి పరిశ్రమాభివృద్ధికి కాకాని అవిరళ కృషి చేశారన్నారు. బుధవారం పాల ఫ్యాక్టరీ ఆవరణలో కాకాని వెంకటరత్నం జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకాని విగ్రహానికి చలసాని ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరబాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణా మిల్క్ యూనియన్ స్థాపనలో ఆయన చూపిన చొరవ మరువలేదన్నారు. కాకాని ఆశయాలను కొనసాగిస్తూ, యూనియన్‌ను మరింత ఉన్నత స్థానంలో నిలబెడతామని మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు పేర్కొన్నారు. సమితి అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి విశేష కృషి
ఆకునూరు(ఉయ్యూరు): విద్య, వ్యవసాయం, పాడి పరిశ్రమ రం గాలతో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లా అభివృద్ధికి కాకాని వెంకటరత్నం విశేష కృషిచేసి, ఉక్కు కాకానిగా పేరు గడించారని ఎమ్మెల్యే కేపీ సారథి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆకునూరులో స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం విగ్రహానికి పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్, జాయింట్ కలెక్టర్ మహేశ్‌కుమార్, కాకాని మనువడు విజయ్‌కుమార్‌తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కాకాని నిస్వార్థ ప్రజా నాయకుడని, ఎంతో దూర దృష్టితో విద్యాలయాల ఏర్పాటు, పాడి పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేశారని వడ్డే శోభనాద్రీశ్వరరావు గుర్తు చేశారు. కాకాని వెంకటరత్నం మనుమడు కాకాని విజయ్‌కుమార్ దం పతులతో పాటు ఆయన మనుమరాలు వేమూరి సుధారాణిను ఘన ంగా సత్కరించారు. ఉయ్యూరు ఆర్డీవో ఎన్.విజయ్‌కుమార్, గ్రామ సర్పంచ్ గోలి వసంతకుమార్ పాల్గొన్నారు. అంతకు ముందు వంద మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు.
కాకాని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించకపోతే రిలే దీక్షలు
విజయవాడ బెంజి సర్కిల్‌వద్ద తొలగించిన కాకాని వెంకట రత్నం కాంస్య విగ్రహాన్ని ఆగస్టు 15లోగా పునఃప్రతిష్టిస్తామని ప్రభుత్వం ప్రకటన చేయకపోతే రిలేదీక్షలు చేపడతామని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, జేసీని ఉద్దేశించి బెంజి సర్కిల్‌లో కాకాని విగ్రహం ఏర్పాటుపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ రహదారిపై ఫ్లైవోవర్ నిర్మాణం సందర్భంగా విగ్రహం తొలగించేప్పుడు పనులు పూర్త య్యాక తిరిగి ప్రతిష్ఠిస్తామని చెప్పిన అధికారులు విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జాతీయ రహదారుల అధి కారులను, కలెక్టర్‌ను కలిసినా ఫలితం లేదన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యేలు, జేసీ తీసుకువెళ్లాలని ఆయన కోరారు.
Updated Date - 2022-08-04T07:13:18+05:30 IST