గిరిజనేతరులను జాబితాలో చేర్చితే ఊరుకోం!
ABN, First Publish Date - 2022-12-15T00:51:26+05:30
బోయ, బెంతో, ఒరియా కులాలను గిరిజన జాబితాలో చేర్చేందుకు జీవో 52 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన శ్యామల ఆనంద్‌కుమార్ ఏకసభ్య కమిషన్‌ను తక్షణమే రద్దు చేయాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ (ఎన్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మానుపాటి నవీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ధర్నాచౌక్‌లో గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం దీక్ష జరిగింది.
ధర్నాచౌక్, డిసెంబరు 14 : బోయ, బెంతో, ఒరియా కులాలను గిరిజన జాబితాలో చేర్చేందుకు జీవో 52 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన శ్యామల ఆనంద్‌కుమార్ ఏకసభ్య కమిషన్‌ను తక్షణమే రద్దు చేయాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ (ఎన్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మానుపాటి నవీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ధర్నాచౌక్‌లో గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం దీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల గెలుపు ఓటములను శాసించగలిగిన సత్తా గిరిజనులకు ఉందన్నారు. బోయలు కేవలం రెండు జిల్లాలకు మాత్రమే పరిమితమన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుడమల రామచంద్రయ్య మాట్లాడుతూ ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా అభివృద్ధి చెందిన 40 లక్షల జనాభా కలిగిన బోయలను గిరిజన జాబితాలో చేర్చడం వల్ల 32 లక్షల జనాభా ఉన్న గిరిజనుల మీద మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా జీవో 52ను రద్దు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని, లేదంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు వాలువాయి ఉషాకిరణ్ మాట్లాడుతూ, గిరిజనులపై ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని ఎన్నికలకు ముందు ఒకలా, తర్వాత మరోలా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. గిరిజన నేతలు మద్దెల రామకృష్ణ, పి.వి.రమణ, బి.ఎల్.శేఖర్, లక్ష్మణ్, సూర్యనాయక్ తదితరులు పాలొన్నారు.
Updated Date - 2022-12-15T00:51:27+05:30 IST