గ్రాండ్ ఎం‘ట్రీ’
ABN, First Publish Date - 2022-11-14T00:22:48+05:30
విజయవాడకు వచ్చే దూరప్రాంతాల ప్రజలకు చక్కటి ఆహ్లాదం పంచేలా నగరాన్ని గ్రీనరీతో అందంగా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడకు వచ్చే దూరప్రాంతాల ప్రజలకు చక్కటి ఆహ్లాదం పంచేలా నగరాన్ని గ్రీనరీతో అందంగా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నేతృత్వంలో పెద్ద ఎత్తున నగర సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ అవుటర్ నుంచి కూడా సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. రహదారులు పచ్చల హారాలుగా కనిపించేలా మొక్కలు పెంచాలని కలెక్టర్ దిల్లీరావు కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. వీఎంసీ కమిషనర్, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. నాలుగు ప్రవేశ ద్వారాల వెంబడి రెండువైపులా 50 చొప్పున మొత్తం 100 చెట్లను నాటాలని సూచించారు. కనకదుర్గ వారధి నుంచి నగరానికి చేరుకునే మార్గంలో జాతీయ రహదారికి కుడివైపున ఉన్న మార్గాన్ని కూడా అందంగా మార్చాలన్నారు. అలాగే, రోడ్లు, జంక్షన్లు, ఖాళీ స్థలాల్లో మొక్కల పెంపకం జరగాలన్నారు. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్లకు రంగులు వేయించటంతో పాటు పిల్లర్లకు మొక్కలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, కనకదుర్గ ఫ్లై ఓవర్‌కు కూడా రంగులు వేయాలని నిర్ణయించారు. ఏపీ పచ్చదనం-సుందరీకరణ కార్పొరేషన్ నేతృత్వంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై వీఐపీ కారిడార్‌ను సుందరీకరించాలని నిర్ణయించి, పనులు ప్రారంభించారు. గన్నవరం నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్డు వరకు రోడ్డుకు రెండువైపులా, సెంట్రల్ ఏరియా, వంతెనలు, ఫుట్‌పాత్‌లు వంటివి ఆధునికీకరించే పనులను ప్రారంభించారు.
Updated Date - 2022-11-14T00:22:49+05:30 IST