ప్రహసనంగా టీచర్ల బదిలీలలు!
ABN, First Publish Date - 2022-12-16T01:02:13+05:30
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. గురువారం నుంచి ఆన్‌లైన్‌లో బదిలీల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈనెల 17నాటికి ఐదేళ్లు సర్వీసు నిండిన హెచ్‌ఎంలు, ఎనిమిదేళ్లు నిండిన సెకండరీ గ్రేడ్ టీచర్లు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే విద్యాశాఖ అధికారులు రేషనలైజేషన్‌లో కేవలం మూడు మండలాల్లో విధిగా బదిలీలు చేసుకోవాల్సిన వారి పేర్లు మాత్రమే వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఉపాధ్యాయుల వెబ్ ఆప్షన్లను ఈనెల 27 నుంచి జనవరి 1వ తేదీ వరకు సమర్పించే అవకాశం ఉంది. ఏ పాఠశాలలో ఏ కేటగిరిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రకటించకపోవడంతో టీచర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
మచిలీపట్నం టౌన్, డిసెంబరు 15 : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. గురువారం నుంచి ఆన్‌లైన్‌లో బదిలీల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈనెల 17నాటికి ఐదేళ్లు సర్వీసు నిండిన హెచ్‌ఎంలు, ఎనిమిదేళ్లు నిండిన సెకండరీ గ్రేడ్ టీచర్లు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే విద్యాశాఖ అధికారులు రేషనలైజేషన్‌లో కేవలం మూడు మండలాల్లో విధిగా బదిలీలు చేసుకోవాల్సిన వారి పేర్లు మాత్రమే వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఉపాధ్యాయుల వెబ్ ఆప్షన్లను ఈనెల 27 నుంచి జనవరి 1వ తేదీ వరకు సమర్పించే అవకాశం ఉంది. ఏ పాఠశాలలో ఏ కేటగిరిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రకటించకపోవడంతో టీచర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం 187వ జీవోలో ఉదహరించిన విధంగా షెడ్యూల్ అమలు జరగడం లేదు.
ప్రజా ప్రతినిధుల సిఫార్సులున్న వారికి నగర, పట్టణ ప్రధాన కేంద్రాల్లో పోస్టింగ్‌లు ఇస్తూ జీవోలు వెలువడుతున్నాయి. కొందరు దరఖాస్తు చేసుకోకపోయినా ముడుపులు చెల్లించి తమకు కావాల్సిన చోట పోస్టింగ్ దక్కించుకుంటున్నారు. బదిలీలలపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ అయితే పిల్లల చదువులు ఏమవుతాయని టీచర్లు భయాందోళనలో ఉన్నారు.
ఎల్‌ఎ్‌ఫఎల్ హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేసిన చోట అక్కడ పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు రేషనలైజేషన్ పాయింట్లతో పాటు గత స్టేషన్‌లో పనిచేసిన పాయింట్లు ఇవ్వకుండా బలవంతపు బదిలీలకు యోచిస్తున్నారు. గతంలో ఉన్న ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రాతిపదికగా బదిలీల ప్రక్రియ జరుగుతోంది. అలాంటి సందర్భాల్లో జీరో సర్వీసు ఉన్న ఎయిడెడ్ టీచర్లు దూర ప్రాంతాలకు వెళ్లినా ఆశ్చర్యపడనక్కరలేదు. ప్రీ హైస్కూల్‌లో 98 మంది కన్నా తక్కువ విద్యార్థులుంటే సెకండరీ గ్రేడ్ టీచర్లను, 98 కన్నా ఎక్కువ ఉంటే స్కూల్ అసిస్టెంట్లను నియమించాలనే కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనికనుగుణంగా పాయింట్లను కేటాయించడం లేదు. గతంలో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి ఆధారంగా, తెలుగు, ఇంగ్లీషు మీడియంల ఆధారంగా నియామకాలు జరిగాయి. అయితే ప్రస్తుత బదిలీల్లో సెక్షన్లను పరిగణలోకి తీసుకోవడం వల్ల ఉపాధ్యాయ పోస్టులు సర్‌ప్లస్ అయ్యాయి. ఇలా సర్‌ప్ల్‌సగా చూపించడం వల్ల వచ్చే రేషనలైజేషన్ పోస్టులు ఏ మేరకు జరుగుతాయో నిర్ధారించలేదు. 1998 డీఎస్సీ, 2008 డీఎస్సీలలో అపాయింట్‌మెంట్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరి కోసం నగరాలకు, పట్టణాలకు దగ్గర ఉండే పాఠశాలలు, మండల ప్రధాన కేంద్రాల్లో ఉండే పోస్టులను బ్లాక్ చేస్తామనడం గమనార్హం. అంగలూరు డైట్ నుంచి వెనుకకు పిలిపించిన ఉపాధ్యాయులకు పాత స్టేషన్‌లో పనిచేసిన పాఠశాల నుంచి పాయింట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే అలా ఇచ్చేందుకు స్పష్టమైన ఉత్తర్వులు లేవు. జిల్లాలో 159 మంది ఎస్జీటిలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. 134 ఇంగ్లీషు, 19 లెక్కలు, 6 ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల ఉత్తర్వులిచ్చారు కానీ స్థానాలు చూపలేదు. అలాగే 23 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోనూ, 8 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనూ గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు 31 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు కానీ వారికి స్థానాలు చూపలేదు. వీరి పరిస్థితి గందరగోళంగా ఉంది.
దివ్యాంగులను నాలుగు కేటగిరీలలో చేయడం వల్ల తీవ్ర నష్టం..
దివ్యాంగులైన టీచర్లు పది కేటగిరీలలో ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం నాలుగు కేటగిరిల్లో మాత్రమే ప్రాధాన్యత కల్పించడం వల్ల కొందరు నష్టపోయే పరిస్థితి ఉంది. సదరం జారీ చేసిన ధృవీకరణ పత్రాలను ప్రాతిపదికగా చేయాలి. అయితే దివ్యాంగులైన టీచర్లకు తాజా ధృవీకరణ పత్రాలు తీసుకు రావాలనే నిబంధన విధించారు. కాగా ఇప్పటి వరకు మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభించలేదు. సూపరింటెండెంట్లు రిపోర్టులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. కొందరు టీచర్ల పిల్లలకు కండర క్షీణత కలిగి ఉన్న పిల్లలు ఉన్నారు. వారిని దగ్గరుండి పర్యవేక్షించాల్సి ఉంది. ఇలా ఆసుపత్రికి దగ్గరలో ఉండే టీచర్లు ఇప్పుడు బదిలీ అయినా ఆశ్చర్యపడక్కరలేదు.
ఇంకా రెండు రోజులే గడువు
బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు 14 నుంచి 17వ తేదీ వరకు అవకాశం కల్పించారు. కేవలం 16, 17 తేదీల్లో మాత్రమే ఆన్‌లైన్‌లో బదిలీల దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. కాగా రెండు రోజుల గడువు బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సరిపోదని టీచర్లు పేర్కొంటున్నారు.
దరఖాస్తు చేయకుండానే ఓటీపీలు..
సాధారణంగా టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకుంటేనే సెల్‌ఫోన్లకు ఓటీపీలు వస్తాయి. అయితే టీచర్లు దరఖాస్తు చేసుకోకుండానే ఓటీపీలు వచ్చేశాయి. ఇదే పాస్‌వర్డ్‌గా తీసుకుని బదిలీల కోసం దరఖాస్తు చేసుకుంటారు. బదిలీల ప్రక్రియలో ఇలాంటి వింతలు ఎన్నో చోటు చేసుకున్నాయి. క్షేత్ర స్థాయిలో టీచర్ల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం జీవోలు జారీ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ చేయడం వల్ల తమ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ఈ విధమైన ఇబ్బందులకు గురి కావలసి వస్తోందని పేర్కొంటున్నారు. ఎయిడెడ్ టీచర్లకు పాయింట్లు తక్కువ ఉన్నందున అందరు కోరుకున్న అనంతరం 40 కిలోమీటర్ల దూరంలో ఉండే పాఠశాలలు మాత్రమే మిగులుతాయి. ఇలా ఎయిడెడ్ టీచర్లు సుదూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.
దరఖాస్తుకు గడువు పెంచాలి
- తమ్ము నాగరాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
బదిలీల దరఖాస్తు గడువు పెంచాలని విద్యాశాఖ ఏడి అజీజ్‌కి తమ్ము నాగరాజు, తదితరులు వినతిపత్రం సమర్పించారు. రెండు రోజుల్లో దరఖాస్తు చేసుకోవడం చాలా కష్టం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరో రెండు రోజులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచవలసి ఉంది. ఉపాధ్యాయ సంఘాల నాయకుల అభిప్రాయాలకు ప్రభుత్వం ఏ విధమైన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. భార్యాభర్త లిద్దరూ దగ్గరలో ఉండే విధంగా బదిలీలు జరగాలి.
ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు
- మద్ది రాజేంద్ర ప్రసాద్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు
టీచర్ల బదిలీల సమయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకుల సలహాలు, సూచనలు తీసుకునేవారు. ఇప్పుడు సంఘ నాయకుల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఖాళీలు బ్లాక్ చేయకుండా అన్ని ఖాళీలు చూపించాలి. బదిలీ నిబంధనలపై అస్పష్టత చోటు చేసుకుంది. స్పౌజ్‌లో భార్యా భర్తలిద్దరూ రిక్వెస్టు బదిలీ చేస్తే దానిపై స్పష్టత ఇవ్వాలి. ఫిజికల్, నేచురల్ సైన్స్, హిందీ స్కూల్ అసిస్టెంట్లకు కోరుకున్న చోటు దక్కే అవకాశం లేదు.
117 జీవో వల్ల టీచర్లు నష్ట పోతున్నారు
- కొమ్ము ప్రసాద్, స్టేట్ టీచర్స్ యూనియన్, రాష్ట్ర నాయకుడు
117 జీవో వల్ల టీచర్లు చాలా మంది నష్ట పోయే ప్రమాదం ఉంది. రేషనలైజేషన్ పాయింట్‌తో పాటు రెండేళ్ళు కూడా సర్వీసు పూర్తికాని టీచర్లకు పాతస్టేషన్‌లో పాయింట్లు ఇవ్వడం లేదు. ఎయిడెడ్ టీచర్లకు పాత స్టేషన్లలో కేటగిరి అనుసరించి పాయింట్లు ఇవ్వాలి.
Updated Date - 2022-12-16T01:02:15+05:30 IST