ఆ ప్రళయానికి 45 ఏళ్లు
ABN, First Publish Date - 2022-11-19T00:40:23+05:30
జనజీవనాన్ని అతలాకుతలం చేసి సర్వం ఊడ్చేని ప్రకృతి ప్రళయం దివిసీమ ఉప్పెన కొన్నేళ్లపాటు పీడకలలా ప్రజలను వెంటాడిన ఆ ఉపద్రవం ఏర్పడి నేటికి 45 ఏళ్లయ్యాయి. జల సంగీతాన్ని వినిపించే సముద్రం రుద్రుడి ప్రళయఘోషగా విరుచుకుపడి, సాధారణ దివిని శవాల దిబ్బగా మార్చిన రోజు.
సర్వం ఉడ్చేసిన దివిసీమ ఉప్పెన
నాగాయలంక / అవనిగడ్డ రూరల్ / అవనిగడ్డ టౌన్, నవంబరు 18 : జనజీవనాన్ని అతలాకుతలం చేసి సర్వం ఊడ్చేని ప్రకృతి ప్రళయం దివిసీమ ఉప్పెన కొన్నేళ్లపాటు పీడకలలా ప్రజలను వెంటాడిన ఆ ఉపద్రవం ఏర్పడి నేటికి 45 ఏళ్లయ్యాయి. జల సంగీతాన్ని వినిపించే సముద్రం రుద్రుడి ప్రళయఘోషగా విరుచుకుపడి, సాధారణ దివిని శవాల దిబ్బగా మార్చిన రోజు. గ్రామాలకు గ్రామాలను సముద్ర గర్భంలోకి ఈడ్చుకుపోయిన విషాదాంతం. 1977 నవంబరు 19న వచ్చిన ఆ జల ప్రళయాన్ని తలచుకుంటే దివిసీమ వాసులు నేటికీ భీతిల్లిపోతున్నారు. ఆ ఉపద్రవానికి గ్రామాలకు గ్రామాలు తుడిచి పెట్టుకుపోయాయి. 10 వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది పశు సంతతి మృత్యువాత పడింది. కోట్లాది రూపాయలు విలువ గల ఆస్తినష్టం వాటిల్లింది. వందలాది స్వచ్ఛంద సంస్థలు, సంస్కర్తలు దివిసీమ పునర్నిర్మాణానికి మేమున్నామంటూ ముందుకు వచ్చారు. నాటి నుంచి నేటి వరకు దివిసీమ జనజీవన స్రవంతిలో పెనుమార్పులు సంభవించాయి. రాజకీయంగా, ఆర్థికంగా దివిసీమ పరిపుష్టిని సాధించుకుంది. అప్పటి ఉప్పెన మృతుల జ్ఞాపకాల చిహ్నంగా దివిసీమ ముఖద్వారం వద్ద నిర్మించిన పైలాన్ స్తంభం ఎప్పటికీ ప్రజలను హెచ్చరిస్తూనే ఉంది. ఆనాటి పెను ఉప్పెనకు కోడూరులోని పాలకాయితిప్ప, హంసలదీవి, గుల్లలమోద, బసవన్నవానిపాలెం, ఊటగుండం, సొర్లగొంది, గుల్లలమోద, ఏటిమొగ, ఎదురుమొండి తదితర గ్రామాల్లో దివిసీమ ప్రాంతం కాళరాత్రిగా మారింది.
మృతుల స్మారక స్థూపం
ఆ ప్రళయంలో మృతుల సంస్మరణార్థం దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు 1978వ సంవత్సరంలో స్మార్థక స్థూపం ఏర్పాటు చేశారు. ప్రతీ ఏడాది నివాళులర్పించటానికి నాయకులు వస్తున్నారు తప్ప స్మార్థక స్థూపం అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదని పలువురు అంటున్నారు.
విపత్తు నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం
విపత్తుల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. అవనిగడ్డలో జరిగిన విలేకరుల సమావేశంలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ 1977 ఉప్పెన అనంతరం పటిష్టపర్చిన సముద్రపు కరకట్టకు, 1990 ప్రాంతంలోనూ, 2004లోనూ రెండు సార్లు పునఃనిర్మించి తాము దివి ప్రాంతానికి భరోసా ఇస్తే నేడు మాత్రం కరకట్ట శిథిలమైపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పడగొట్టిన తుపాను షెల్టర్ల స్థానంలో కొత్త షెల్టర్లు నిర్మించటంతోపాటు తీర గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Updated Date - 2022-11-19T00:40:26+05:30 IST