బల్లిపర్రులో విషాదచాయలు
ABN, First Publish Date - 2022-12-26T00:16:27+05:30
జిల్లాకు చెందిన ఇద్దరు సినీ నటులు రెండు రోజుల వ్యవధిలో మృతిచెందారు. ఈనెల 23వ తేదీన గుడ్లవల్లేరు మండలం కౌతవరానికి చెందిన కైకాల సత్యనారాయణ మరణించగా రెండురోజుల వ్యవధిలోని పామర్రు మండలం బల్లిపర్రుకు చెందిన తమ్మారెడ్డి చలపతిరావు (78) కన్నుమూశారు. తెలుగుచిత్ర పరిశ్రమలో విలన్ క్యారెక్టర్‌గా తనదైన శైలిలో ప్రేక్షకుల హృదయాల్లో చేరగని ముద్ర వేసుకున్న తమ్మారెడ్డి చలపతిరావు అలియాస్ బల్లిపర్రు చలపతిరావు బాబాయ్.. స్వగ్రామం బల్లిపర్రులో విషాదచాయలు అలముకున్నాయి. గ్రామాభివృద్ధిలో కీలక భూమిక పోషించిన ఆయన ఇక లేరన్న నిజాన్ని తట్టుకోలేక ఊరి జనం కన్నీరు పెడుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకొని విలపిస్తున్నారు.
విలక్షణ నటుడు చలపతిరావు కన్నుమూతతో విలపిస్తున్న గ్రామస్థులు
జిల్లాకు చెందిన ఇద్దరు సినీ నటులు రెండు రోజుల వ్యవధిలో మృతిచెందారు. ఈనెల 23వ తేదీన గుడ్లవల్లేరు మండలం కౌతవరానికి చెందిన కైకాల సత్యనారాయణ మరణించగా రెండురోజుల వ్యవధిలోని పామర్రు మండలం బల్లిపర్రుకు చెందిన తమ్మారెడ్డి చలపతిరావు (78) కన్నుమూశారు. తెలుగుచిత్ర పరిశ్రమలో విలన్ క్యారెక్టర్‌గా తనదైన శైలిలో ప్రేక్షకుల హృదయాల్లో చేరగని ముద్ర వేసుకున్న తమ్మారెడ్డి చలపతిరావు అలియాస్ బల్లిపర్రు చలపతిరావు బాబాయ్.. స్వగ్రామం బల్లిపర్రులో విషాదచాయలు అలముకున్నాయి. గ్రామాభివృద్ధిలో కీలక భూమిక పోషించిన ఆయన ఇక లేరన్న నిజాన్ని తట్టుకోలేక ఊరి జనం కన్నీరు పెడుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకొని విలపిస్తున్నారు.
పామర్రు, డిసెంబరు 25 : బల్లిపర్రులో తమ్మారెడ్డి మణియ్య, వియ్యమ్మ దంపతులకు 1944 మే 8న రెండో సంతానంగా చలపతిరావు జన్మించారు. చలపతిరావు అన్న శోభనాద్రీశ్వరరావు కొంతకాలం క్రితమే కన్నుమూశారు. చెల్లెలు గ్రామంలోనే నివాసముంటుంది. గ్రామంలోని ఎలిమెంటరీ పాఠశాలలో ఐదో తరగతి వరకు ఆయన చదివారు.. అనంతరం తన అమ్మమ్మ గ్రామం భట్లపెనుమర్రులో హైస్కూల్‌లో చదివారు. విజయవాడ ఐటీఐ కళాశాలలోనూ ఆయన చదువుకున్నారు. ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో బల్లిపర్రు గ్రామ సమీపంలోని జమీగోల్వేపల్లి గ్రామానికి చెందిన ఇందుమతితో వివాహమైంది. అనంతరం కొద్ది రోజుల్లోనే ఆయనకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కూమారుడు రవిబాబుకు ఏడేళ్ల వయస్సులోనే చలపతిరావు భార్య ఇందుమతి చనిపోయారు. బంధువులు ఆయనకు పునర్వివాహం చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఆయన అందుకు అంగీకరించలేదు.
1966లో సినిమా రంగంలోకి
సినీ పరిశ్రమలోకి 1966 అడుగు పెట్టిన చలపతిరావు సూపర్‌స్టార్ కృష్ణతో కలిసి గూఢాచారి 116లో చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయమయ్యారు. దాదాపు 1200 సినిమాల్లో నటించారు. చివరివరకు తన నటజీవితాన్ని కొనసాగించారు. పలు సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించారు.
ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధాలు
సినీపరిశ్రమలో దిగ్గజంగా పేరొందిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పామర్రు మండలానికి చెందిన వారు కావడంతో చలపతిరావు ఎన్టీఆర్ కుటుంబీకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. ఎన్టీఆర్‌తో నటించిన దానవీరశూరకర్ణ చిత్రంలో చలపతిరావు పాత్ర నేటికి మరువరానిదిగా నిలిచింది.
గ్రామస్థుల సంతాపం
చలపతిరావు మృతిపట్ల గ్రామ సర్పంచ్ నిమ్మగడ్డ సుధాకర్‌తో పాటు, గ్రామ టీడీపీ నేత తమ్మారెడ్డి సంజీవరావు, రామప్రసాద్ సంతాపం తెలిపారు. చలపతిరావు మృతి గ్రామానికి తీరనిలోటన్నారు. గ్రామానికి ప్రతి ఏడాదీ వచ్చి ఊరికి ఉపకారిగా నిలిచే పెద్దాయన మృతిని తాము జీర్ణించుకోలేక పోతున్నామని వారు అన్నారు.
గ్రామాభివృద్ధికి తోడ్పాటు
చలపతిరావు స్వగ్రామం బల్లిపర్రు అభివృద్ధికి తోడ్పాటును అందించేవారు. ప్రతిఏడాది మేలో గ్రామానికి తన కుటుంబసభ్యులతో వచ్చి సరదాగా గడిపేవారు. గ్రామంలోని రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మాణానికి తన వంతుగా కృషి చేశారు. దానితోపాటు గ్రామంలోని గంగానమ్మ ఆలయం నిర్మాణానికి రూ1.05 లక్షలను ఇచ్చారు. గ్రామాభివృద్ధికి ఏం కావాలో ఏమిచేయాలో స్థానికుల్ని అడిగేవారు. ఆయనకు గ్రామంలో పూర్వీకుల నుంచి వచ్చిన రెండెకరాల భూమి, ఇంటి స్థలం ఉన్నాయి. ఆయన గ్రామంలోని చెరువుగట్టున ఉన్న మర్రిచెట్టు కింద కాలక్షేపం చేయడం చాలా ఇష్టమని గ్రామ మాజీ సర్పంచ్ తెలిపారు.
అందరితో అప్యాయంగా మాట్లాడేవారు
బల్లిపర్రు వస్తే అందరినీ అప్యాయంగా పలకరించేవారు. అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటు అందరీని పేరుపేరునా పిలిచేవారు. మా చిన్న మామయ్య దూరమవ్వడం జీర్ణించుకోలేకపోతున్నాం. తన మనుమరాలి ఓణీల ఫంక్షన్‌కు ఆయన వచ్చారు.
- తమ్మారెడ్డి సరోజనీ (వరుసకు కోడలు)
బాబాయ్ మృతి గ్రామాభివృద్ధికి తీవ్ర లోటు
‘మా బాబాయి చలపతిరావు మృతి మా గ్రామాభివృద్ధికి తీవ్ర లోటు. బాబాయ్ ఎప్పుడు గ్రామానికి వచ్చినా మా ఇంటి ఆడపడుచు గ్రామానికి సర్పంచ్ అయిందని అందరికీ చే ప్పేవారు. బాబాయ్ ఆవకాయపచ్చడి, పెరుగన్నం మహా ఇష్టంగా తినేవారు. నేను గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన కాలంలో పలు అబివృద్ధి పనులకు బాబాయ్ చేయూతనందించారు. గ్రామంలో కష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం చేసేవారు’
- బొప్పన స్వర్ణలత, గ్రామ మాజీ సర్పంచ్
బాల్యమిత్రుడిని కోల్పోయాను
నా బాల్యస్నేహితుడి కోల్పోవడం చాలా బాధ కలిగిస్తోంది. నాతోపాటు గ్రామంలోని ఎలిమెంటరీ పాఠశాలలో ఆయన ఐదో తరగతి చదువుకున్నాడు. చదువులో మంచి ప్రతిభను ప్రదర్శించేవాడు. వివాహం అనంతరం సినిమాల్లోకి వెళ్లాడు. గ్రామానికి ఎప్పుడు వచ్చినా నన్ను కలవకుండా వెళ్ల్లేవాడు కాదు. దేవాలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సాయం అందించేవాడు. చిన్నతనంలో తనతోటి మిత్రులతో చాలా అన్యోన్యంగా మెలిగేవాడు.
- వేదాంతం శేషా భట్టాచార్యులు, చలపతిరావు బాల్య మిత్రుడు
Updated Date - 2022-12-26T00:16:28+05:30 IST