గుడివాడలో అతిసారం
ABN, First Publish Date - 2022-04-09T04:54:27+05:30
గుడివాడలో అతిసారం
ఒక్కరోజే 42 కేసులు
ఇద్దరి పరిస్థితి విషమం జూ ఎక్కువమందికి స్వల్ప లక్షణాలు
ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాల నిర్వహణ
కల్తీనీటితో అనర్థాలు
పారిశుధ్యం అస్తవ్యస్తం
గుడివాడ, ఏప్రిల్ 8 : గుడివాడలోని పలు ప్రాంతాల్లో అతిసారం (డయేరియా) ప్రబలింది. గుడ్‌మన్‌పేట, బాపూజీనగర్, ముబారక్ సెంటర్, పాములకాలనీ, పంచవటికాలనీ, కాకర్ల వీఽధి, నైజాంపేట, కేటీఆర్ కాలేజీ రోడ్డు, సత్యనారాయణపురం తదితర ప్రాంతాలవాసులు నాలుగు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఒక్క గుడ్‌మన్‌పేటలోనే ఆరుగురికి డయేరియాగా నిర్ధారణ అయ్యింది. వారిని విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, మొత్తం 42 మంది అతిసార లక్షణాలతో ఏరియా ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం. వారికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులు ఇచ్చి పంపినట్లు తెలిసింది. ప్రభావిత ప్రాంతాల్లో వైద్యఆరోగ్య శాఖ వైద్యశిబిరాలు ఏర్పాటు చేసింది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే అనంతరం మరిన్ని కేసులు వెలుగుచూసే అవకాశం ఉంది. కాగా, స్థానికులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. తాగడానికి మంచినీరు కూడా సరఫరా చేయలేకపోతున్న పురపాలక సంఘం నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ఏరియా ఆసుపత్రి ప్రజారోగ్య విభాగం వైద్యాధికారి సతీష్‌కుమార్ తెలిపారు.
అపరిశుభ్ర పరిస్థితులే కారణం
పారిశుధ్యం క్షీణించడం, పైపులైన్ల లీకేజీ, పందుల స్వైరవిహారం తదితర కారణాలు అతిసారకు దారితీశాయని నిపుణులు చెబుతున్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పారిశుధ్య స్థితిగతులు మెరుగుపర్చేందుకు శుక్రవారం పురపాలక యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఆయా ప్రాంతాల్లో రహదారుల వెంట బ్లీచింగ్ చల్లారు. ఎక్కడచూసినా చెత్తాచెదారం, మురుగు ఉండటంతో ఆయా ప్రాంతాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. చెత్త తరలించే వాహనాలు ప్రచారార్భాటానికే తప్ప ఉపయోగ పడట్లేదు. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణలో పారిశుధ్య కార్మికుల అలసత్వం, డ్రెయినేజీలు పూడిక తీయకపోవడం వంటివి డయేరియాకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. గుడ్‌మన్‌పేట, బాపూజీనగర్, పంచవటి కాలనీ, పాముల కాలనీ, నైజాంపేట, ముబారక్ సెంటర్, కాకర్ల వీధి, హరినారాయణపురం, సత్యనారాయణపురం, కేటీఆర్ కళాశాల రోడ్డు, ద్రోణాధుల వీధి తదితర ప్రాంతాల్లో తాగునీరు అపరిశుభ్రంగా ఉంటోందని స్థానికులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2022-04-09T04:54:27+05:30 IST