కమీషన్ల కహానీ..
ABN, First Publish Date - 2022-12-16T01:11:23+05:30
నాలుగు గోడల మధ్య కూర్చుని అక్రమంగా డబ్బు సంపాదించటం ఎలానో ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కార్యాలయ ఉన్నతాఽధికారులకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. కమీషన్ల కోసం ప్యాకేజీ టెండర్ల విధానాన్ని ఎంచుకున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో రూ.12 కోట్ల మేర కమీషన్లు దండుకునేందుకు బిగ్ స్కెచ్ వేశారు.
ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ ఉన్నతాధికారుల నిర్వాకం
రూ.160 కోట్ల కమీషన్ కోసం బిగ్‌స్కెచ్
ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే రూ.12 కోట్ల వరకూ
చిన్న, సన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వరట
ప్యాకేజీ పద్ధతిలో బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టే యత్నం
కమీషన్లకు కక్కుర్తి పడే..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జల్‌జీవన్ మిషన్ (జేజేఎం) పనులు ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కార్యాలయ ఉన్నతాధికారులకు ఏటీఎంగా మారాయి. జేజేఎం రెండో విడత పనులకు గ్రాంట్ రావటంతో ఈ పనుల కోసం ఈఎన్సీ అధికారులు సరికొత్త రూల్స్ తీసుకొచ్చారు. ప్యాకేజీ పద్ధతిలోనే టెండర్లు పిలవాలనుకుంటున్నారు. జిల్లాలవారీగా వందలాది మంది చిన్న, సన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరికి అవకాశం లేకుండా ప్యాకేజీ వర్కులుగా పిలిచి బడా కాంట్రాక్టర్ల చేతిలో పెట్టేందుకు ఆదే శాలు జారీ చేశారు. పనులు సక్రమంగా చేసేవారిని వదిలేసి, పనుల్లో జాప్యం చేసే వారికి కట్టేబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎందుకిలా..?
ప్యాకేజీ పద్ధతిలో ఉన్నత స్థాయిలో టెండర్లు పిలుస్తారు కాబట్టి పని విలువపై కాంట్రాక్టర్లు రెండు శాతం కమీషన్‌ను ఉన్నతాధికారులకు ఇవ్వాలి. ఇది బహిరంగ రహస్యం. చిన్నచిన్న వర్కులైతే కిందిస్థాయిలో టెండర్లు పిలుస్తారు కాబట్టి, వారికి ఎలాంటి కమీషన్లు రావు. రాష్ర్టానికి తాజాగా రూ.7,600 కోట్ల గ్రాంట్‌తో పనులు చేపట్టేందుకు అనుమతి వచ్చింది. మన రెండు జిల్లాలు కలిపి రూ.600 కోట్ల మేర బడ్జెట్ ఓకే అయ్యింది. కేంద్ర గ్రాంట్ సగం ఉంటుంది కాబట్టి, ముందుగా పనులు చేయించేందుకు ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కార్యాలయం అధికారులు ఈ స్కెచ్ వేశారు. స్వామికార్యం, స్వకార్యం రెండూ ఒకేసారి నెరవేర్చుకునేందుకు బిగ్ స్కెచ్‌ను అమల్లోకి తెచ్చారు.
బడా కాంట్రాక్టర్లకే..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో దాదాపు 200కు పైగా చిన్న, సన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లు ఉన్నారు. తొలిదశలో వీరు చేపట్టిన పనులకు ఇప్పటి వరకు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు బిల్లులను ఆమోదించలేదు. రాజకీయ పార్టీలకు చెందిన వారైతేనే బిల్లులు మంజూరు చేస్తున్నారు. అది కూడా కమీషన్లు ఇస్తామని ఈఎన్సీ కార్యాలయం గడప తొక్కినవారికే డబ్బు ఇస్తున్నారు. ఇలా దాదాపు రూ.100 కోట్లు పిండేశారు. ఇప్పుడు రెండో దశలో బడా కాంట్రాక్టర్ల రూల్‌ను తీసుకొచ్చారు. తొలి దశలో బడా కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. చిన్న, సన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లు మాత్రమే పనులు చేశారు. పనులు చేసే వారికి అవకాశం కల్పించకుండా, మధ్యలో వదిలేసే వారికి ఎందుకు అప్పగిస్తున్నారన్నది ఆలోచించాల్సిన విషయం. ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో మొత్తం 1,200 పనులకు సంబంధించి ప్యాకేజీ విధానంలో పనులు పిలవటానికి ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ పనుల విలువ రూ.600 కోట్లు. ఈ పనులకు సంబంధించి రెండు శాతం కమీషన్ వేసుకుంటే రూ.12 కోట్ల మేర అప్పనంగా ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ అధికారులకు కమీషన్లు రానున్నాయి.
Updated Date - 2022-12-16T01:11:24+05:30 IST