పుంజు..కున్నాయ్
ABN, First Publish Date - 2022-01-13T05:43:19+05:30
పుంజు..కున్నాయ్
జిల్లావ్యాప్తంగా సిద్ధమవుతున్న కోడి పందేల బరులు
పందేలకు ఒప్పుకోబోమంటున్న పోలీసులు
నిర్వహిస్తామంటున్న పందెపు రాయుళ్లు
అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే..
బరులకు రూ.లక్షల్లో వేలం పాటలు
మూడు రోజులు రూ.కోట్లలో జూదాలు
సంక్రాంతి సంప్రదాయాల ముసుగులో పందెం కోడి పుంజుకుంటోంది. పండుగ దగ్గర పడే కొద్దీ రాజకీయ నాయకుల స్వీయ పర్యవేక్షణలో జిల్లావ్యాప్తంగా కోడి పందేలతో పాటు పొటేళ్ల పందేలు, జూదం నిర్వహించేందుకు భారీగా బరులు సిద్ధమవుతున్నాయి. ఓవైపు ఊరుకునేదే లేదంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా.. మరోవైపు ఉరిమే ఉత్సాహంతో పందెపు రాయుళ్లు బరులు సిద్ధం చేస్తున్నారు. పండుగ మూడు రోజుల్లో రూ.కోట్లలో చేతులు మారే అవకాశం ఉండటంతో జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ నుంచీ భారీగా తరలివస్తున్నారు.
కైకలూరులో పక్కా ఏర్పాట్లు
కైకలూరు : కైకలూరు నియోజకవర్గంలో పదుల సంఖ్యలో కోడిపందేల బరులకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిచోటా పేకాట, గుండాట భారీగా ఆడించాలని చూస్తున్నారు. కొల్లేరు గ్రామాల్లో అయితే కట్టుబాట్ల మధ్య పందేల నిర్వహణకు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. బరులను రూ.లక్షల్లో పాడుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఇంగిలిపాకలంకలో రూ.5 లక్షలు, చింతపాడులో రూ.9 లక్షలు, శృంగవరప్పాడులో రూ.5.30 లక్షలు, పందిరిపల్లెగూడెంలో రూ.2 లక్షలు, చటాకాయలో రూ.3 లక్షలు పలికాయి. ఆలపాడులో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రాజు భారీస్థాయిలో బరులు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పందెపురాయుళ్లు రూ.వేలు వెచ్చించి పుంజులు కొంటున్నారు. బరుల వద్ద జూదప్రియులకు కావాల్సిన వసతులు కల్పించేందుకు మరో వ్యాపారం నడుస్తోంది. గత ఏడాది కరోనా కారణంగా వెలవెలబోయిన లాడ్జీలు ఈసారి నెల ముందే బుక్ అయిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పందెపు రాయుళ్లు కైకలూరు, ఆకివీడు, భీమవరం ప్రాంతాల్లోని లాడ్జీలను బుక్ చేసుకుంటున్నారు.
బాపులపాడులో భారీగా..
హనుమాన్ జంక్షన్ రూరల్ : కోడిపందేల నిర్వహణలో రాష్ట్రంలోనే మొదటిస్థానం పొందిన అంపాపురంలోఈసారి పొటేళ్ల పందేలూ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పండుగ రోజుల్లో ఒక్కో పందెం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ జరుగుతుంది. రోజుకు 15 పందేలు నిర్వహించినా మూడు రోజుల్లో సుమారు రూ.150 కోట్లకుపైగా లావాదేవీలు జరుగుతాయని అంచనా. బాపులపాడు మండలంలోనే ఈసారి రెండు ప్రధాన బరులు తయారవుతున్నాయి. ఒకటి అంపాపురం వద్ద కాగా, రెండోది పెరికీడు వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు బరులూ జాతీయ రహదారికి దగ్గరగానే ఉన్నాయి. రాజకీయ పెద్దల అండదండలు మెండుగా ఉండటంతో బరులు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. ఈ పండుగ మూడు రోజుల్లో రూ.300 కోట్లకుపైగా లావాదేవీలు జరిగే అవకాశం ఉందంటున్నారు.
పందేలకు ఒప్పుకోం.. : పోలీసులు
ఎట్టి పరిస్థితుల్లో కోడిపందేలు నిర్వహించనివ్వబోమని, ఆంక్షలు విధిస్తామని స్థానిక సీఐ సతీష్ హెచ్చరించారు. బైండోవర్ కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. స్థలాల యజమానులపై కూడా కేసులు ఉంటాయని చెప్పారు.
జగ్గయ్యపేటలో అధికార పార్టీ బరులు
జగ్గయ్యపేట/జగ్గయ్యపేట రూరల్/వత్సవాయి : జగ్గయ్యపేట నియోజకవర్గంలో కోడి పందేల బరులకు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. జగ్గయ్యపేట మండలంలో జాతీయ రహదారి వెంబడి, వత్సవాయి మండలంలో భారీగా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గం.. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాకు సరిహద్దున ఉండటంతో జాతీయ రహదారి వెంబడి, ఖమ్మం జిల్లాకు సరిహద్దుగా ఉన్న వత్సవాయి మండల గ్రామాల్లో బరులు సిద్ధం చేస్తున్నారు. ఈసారి బరులకు అధికార పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొనటంతో ఇంకా ఎవరు నిర్వహించాలనే అంశం తేలలేదు. జగ్గయ్యపేట మండలంలోని చిల్లకల్లు, షేర్మహ్మద్పేట, బూదవాడ గ్రామాల్లో బరులు సిద్ధమయ్యాయి. పోలీసులు మాత్రం అదేం లేదని చెబుతున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి స్పందించి మండలంలో రెండుచోట్ల బరుల కోసం వేసిన స్తంభాలను తీసి వేయించారు. తహసీల్దార్ వైకుంఠరావు పరిశీలించారు. వత్సవాయి మండలంలో ముఖ్యనేత బంధువు ఆధ్వర్యంలో మామిడి తోటల్లో భారీ బరులు సిద్ధమవుతున్నాయి. ఇక జగ్గయ్యపేట పట్టణ పరిధిలో నిర్వహించే బరికి పోటీ ఎక్కువ కావటంతో ఇంకా ఎవరు నిర్వహించాలని నిర్ణయించలేదని చెబుతున్నారు.
నున్నలో నేనున్నా అంటూ..
రంగంలోకి రాష్ట్రస్థాయి నాయకుడు.. తోటల పరిశీలన
విజయవాడ రూరల్ : నున్న పరిసర ప్రాంతాల్లో కోడి పందేలకు సన్నాహాలు జరుగుతున్నాయి. పోలీస్ కేసుల నేపథ్యంలో స్థానికంగా అధికార పార్టీ నాయకులెవ్వరూ కోడి పందేల నిర్వహణకు ముందుకు రాకపోవడంతో విజయవాడకు చెందిన రాష్ట్రస్థాయి నాయకులు రంగంలోకి దిగుతున్నారు. ఓ నామినేటెడ్ పదవిలో ఉన్న సీనియర్ నాయకుడు ఒకరు నున్న, సూరంపల్లి ప్రాంతాల్లో కోడి పందేల నిర్వహణకు అనువుగా ఉండే మామిడి తోటలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పల్లతిప్ప, వికాస్ కాలేజీ రోడ్డులోని తోటలను ఆయన పరిశీలించారని చెబుతున్నారు. పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని, స్థానికంగా పందేల నిర్వహణకు ముందుకు రావాలని కూడా ఆయన కోరినట్లు తెలిసింది. అయితే, స్థానికంగా ఉన్న పందేల నిర్వాహకులు, పందెపు రాయుళ్లు, కత్తులు కట్టే వారిపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. స్థానికంగా 70కుపైగా నాటుకోళ్ల ఫారాలుండగా, వాటిలో సగానికిపైగా పందెపు పుంజులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వారికి నోటీసులు జారీచేసి, పండుగ సమయంలో ఫారాల నుంచి కోళ్లు బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ రాష్ట్రస్థాయి నాయకుడు రంగంలోకి దిగి పందేల నిర్వహణకు సన్నాహాలు చేస్తుండటంతో, స్థానిక పందెపు రాయుళ్లలో జోష్ నెలకొంది.
Updated Date - 2022-01-13T05:43:19+05:30 IST