ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీలపై పెనుభారం

ABN, First Publish Date - 2022-07-18T06:20:01+05:30

పంచాయతీలపై పెనుభారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం తీసుకోవడంతో కష్టాలు

తలకుమించిన సచివాలయాల భారం

అద్దెలు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపుతో ఇబ్బందులు

జీతాలు, ఇతర ఖర్చులకూ అవస్థలే..

వర్షాకాలంలో పారిశుధ్య పనులకూ నిధులు నిల్‌


గ్రామాల్లో పంచాయతీలు అడుగు ముందుకు వేయలేని దుస్థితిలో అల్లాడుతున్నాయి. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం లాగేసుకోవడంతో అన్ని పనులకూ నిధులు సరిపోక సర్పంచ్‌లు తలలు పట్టుకుంటున్నారు. సచివాలయ నిర్వహణ నుంచి పారిశుధ్య పనుల వరకూ ఆర్థిక భారమంతా మోయలేక మోస్తున్నారు.


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినా పంచాయతీలకు మాత్రం ఆర్థికభారం తప్పట్లేదు. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఇస్తోంది. ఇవి మినహాయించి మిగిలిన ఖర్చులన్నీ పంచాయతీలే భరించాల్సి వస్తోంది. దీంతో ఆదాయం అంతంతమాత్రంగా ఉన్న పంచాయతీల నిర్వహణ కష్టంగా మారింది. వర్షాకాలంలో, వ్యాధులు ప్రబలే సమయంలో కనీస పారిశుధ్య పనులు చేసేందుకు ముందూ, వెనుకా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 

స్టేషనరీ ఖర్చులకు కూడా పంచాయతీ నిధులే ఆధారం

ఉమ్మడి జిల్లాలో 981 పంచాయతీలున్నాయి. ప్రతి రెండువేల మంది జనాభాకు ఒక సచివాలయం చొప్పున జిల్లాలో 815 సచివాలయాలను ఏర్పాటుచేశారు. చాలావరకు సచివాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. 380కి పైగా సచివాలయ భవనాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. వీటి నిర్మాణం పూర్తయినా, బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి అప్పగించలేదు. వివిధ పనులపై సచివాలయానికి వచ్చే ప్రజలకు ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు స్టేషనరీ ఖర్చులు పంచాయతీల ద్వారా వచ్చే ఆదాయం నుంచే సమకూర్చుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వపరంగా స్టేషనరీ ఖర్చులకు ఒక్క రూపాయి విదల్చడం లేదు. 

ఆర్థిక సంఘ నిధుల మళ్లింపు

పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే తలసరి గ్రాంటును విద్యుత్‌ బిల్లుల బకాయిల పేరుతో ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. ఇటీవల కాలంలో 14, 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైతే విద్యుత్‌ బిల్లుల పేరుతో పంచాయతీ పాలకవర్గాలకు తెలియకుండానే మినహాయించుకున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు మొత్తాన్ని ప్రభుత్వం ట్రెజరీల నుంచి డ్రా చేసుకుంది. దీంతో అధికార పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న సర్పంచ్‌లు సైతం ఆందోళనబాట పట్టడంతో విడతలవారీగా నిధులను పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తోంది. పంచాయతీలకు పన్నుల రూపంలో వచ్చిన నిధులు.. పారిశుధ్య పనులు, తాగునీటి పంపింగ్‌, పైపులైన్ల మరమ్మతులు, పారిశుధ్య కార్మికుల జీతాలకే సరిపోవట్లేదు.

వర్షాకాలంలో మరింత భారం

వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్‌ తదితరాలను చల్లాల్సి ఉంటుంది. గన్నవరం మండలం తెంపల్లిలో తాగునీరు కలుషితమై డయేరియా వ్యాపించింది. ఇద్దరు మరణించారు. 50 మందికి పైగా వ్యాధి బారినపడ్డారు. వర్షాకాలంలో దోమల నివారణకు లైమ్‌, బ్లీచింగ్‌, మలాథిన్‌, బైటెక్స్‌ వంటివి చల్లడంతో పాటు పిచికారీ చేయాల్సి ఉంది. తరచూ తాగునీటి పరీక్షలు చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ ఖర్చులన్నీ భరిస్తూనే సచివాలయాల నిర్వహణ కోసం నెలకు కనీసంగా రూ.10 వేలను అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని సర్పంచ్‌లు వాపోతున్నారు. ఇలాంటి సమయంలో సచివాలయాల నిర్వహణకు ప్రభుత్వం ఆర్థిక వనరులు సమకూర్చాలని కోరుతున్నారు. 

అదనపు భారం ఇలా..

రెండున్నరేళ్ల కిందట సచివాలయాలకు ప్రభుత్వమే కంప్యూటర్లు, స్కానర్లు సమకూర్చింది. సచివాలయాలకు వచ్చే విద్యుత్‌ బిల్లులను మాత్ర ం పంచాయతీల నిధుల నుంచే చెల్లించాల్సి వస్తోంది. ఒక్కో సచివాలయానికి నెలకు కరెంటు బిల్లు రూ.2వేలకుపైగా చెల్లించాల్సి వస్తోంది. అద్దె భవనాల్లో నడిచే సచివాలయాలకు నెలకు రూ.4 వేల విద్యుత్‌ బిల్లు వస్తోంది. గ్రామాల్లో చెత్త సేకరణ కోసం ఏర్పాటుచేసిన గ్రీన్‌ అంబాసిడర్ల జీతాలు, వీధి దీపాల నిర్వహణ, పారిశుధ్య కార్మికులకు జీతాలు, పనిముట్ల కొనుగోలు, తాగునీటి మోటార్ల రిపేర్లు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులు తదితర పనులకు సంబంధించి ఆర్థికభారాన్ని పంచాయతీలే మోయాల్సి వస్తోంది.


Updated Date - 2022-07-18T06:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising