విజ్ఞాన సుగ్రంథాలు
ABN, First Publish Date - 2022-01-08T06:09:24+05:30
విజ్ఞాన సుగ్రంథాలు
అన్ని వర్గాల వారికీ విజ్ఞానాన్ని పంచుతున్న వివిధ పుస్తకాలు
ప్రపంచ శాంతి గమనాన్ని తెలిపే మహనీయుల గ్రంథాలు ఓవైపు.. మన మూలభాష సంస్కృత సుగంధాలు మరోవైపు.. రాజ్యాంగ విశేషాల విశ్లేషణలు ఇంకోవైపు.. ఇలా పలకరించిన ప్రతి ఒక్కరికీ విజ్ఞాన మాల మెడలో వేసి అలంకరిస్తోంది పుస్తక మహోత్సవం. ప్రతి స్టాల్ ఒక సాహితీ ప్రపంచమై పరిచయం చేసుకుంటోంది. కొండంత విజ్ఞానాన్ని అందించి ఆత్మసంతృప్తితో బయటకు పంపుతోంది.
- ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీలైఫ్
ఆవిష్కరణలు
విజయవాడ కల్చరల్ : కాళీపట్నం రామారావు సాహితీ వేదికపై ‘నేను... మీ సోనూసూద్’ పుస్తకాన్ని పొట్టిశ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ చలువాది మల్లికార్జునరావు ఆవిష్కరించారు. తెలుగు విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ గుమ్మా సాంబశివరావు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
- తాడేపల్లిలోని అరవింద ఆర్ట్స్, తానా ప్రచురణలు సంయుక్తంగా ముద్రించిన ‘ప్రసిద్ధ తెలుగు నాటకాలు’ (ఆరు సంకలనాలు - వంద నాటకాలు) పుస్తక పరిచయ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ సంపాదకుడు కాగా, గంగోత్రి సాయి ఉపసంపాదకుడు.
- ఇండస్ మార్టిన్ రాసిన ‘పాదిరిగారి అబ్బాయి’ పుస్తకావిష్కరణ కాళీపట్నం రామారావు సాహితీ వేదికపై నిర్వహించారు.
- కాళీపట్నం రామారావు సాహితీ వేదికపై వడ్డాది పాపయ్య శతజయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘సినిమాలు రాకముందు పౌరాణిక కథల్లోని పాత్రలకు అద్భుతమైన రూపాలు ఇచ్చిన చిత్రకారుడు వడ్డాది పాపయ్య. తెలుగునాట ఎంతోమంది చిత్రకారులు ఉన్నప్పటికీ ఒక్క వడ్డాదికి మాత్రమే శతజయంతి సభ జరిగింది. అనంతరం సమాచార శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గౌరవాధ్యక్షుడు బి.బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
- ఆజాదికా అమృత మహోత్సవ్‌లో భాగంగా పాఠశాల విద్య, సమగ్ర శిక్ష స్టాల్ వద్ద విద్యార్థులకు సాంఘిక సంస్కకర్తలు, స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణ పోటీలు నిర్వహించారు.
- డాక్టర్ యలవర్తి నాయుడమ్మ ప్రతిభా వేదికపై 15ఏళ్లలోపు చిన్నారులకు కథా పోటీలు నిర్వహించారు.
పుస్తక మహోత్సవంలో నేడు
- సాయంత్రం 5 గంటలకు కాళీపట్నం రామారావు సాహితీ వేదికపై శైలేంద్రకుమార్ జోషి రాసిన ‘సుపరిపాలన ప్రజలే కేంద్రంగా పరిపాలన’ పుస్తకావిష్కరణ
- సాయంత్రం 6 గంటలకు ‘మారుతున్న కాలంలో పుస్తకం’ పుస్తకావిష్కరణ
- రాత్రి 7 గంటలకు ‘వర్తమాన సమాజం - కమ్యూనిస్టు ప్రణాళిక’ పుస్తక పరిచయం
- రాత్రి 8 గంటలకు ప్రజాశక్తి బుక్‌హౌస్ ప్రచురించిన హల్లాబోల్ పుస్తకావిష్కరణ
- కుందుర్తి శతజయంతి సందర్భంగా ‘కవిత్వం రాయడం ఎలా’ అనే అంశంపై వర్క్‌షాపు
సంస్కృతమే సర్వస్వం
వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలకు మూలభాష సంస్కృతం. ప్రాచీన భాషల్లో దీని స్థానం ప్రత్యేకం. ఈ భాషలో అనేక పుస్తకాలు ప్రచురణలోకి వచ్చాయి. ఈ పుస్తకాలతో స్టాల్‌ను నిర్వహిస్తోంది తెలంగాణ సంస్కృత అకాడమీ. స్టాల్ నెంబర్ 123లో సంస్కృత కావ్యాలు, ఉపనిషత్తులతో పాటు వివిధ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. రిఫ్లెక్షన్స్ ఆఫ్ కౌటిల్య, తర్కభాష, అర్థసంగ్రహణ, మందాకిని, దండవివేకం ఆఫ్ వర్థమాన, బ్రహ్మసూత్ర వృత్తి వంటి పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి.
బుద్ధం శరణం గచ్ఛామి
ప్రపంచానికి శాంతి గమనాన్ని చూపించిన వారిలో గౌతమ బుద్ధుడు ఒకరు. ఆయన ఆచరించిన ధర్మాలు, నడిచిన మార్గాలపై అనేక పుస్తకాలను ప్రచురించారు. వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను పుస్తక మహోత్సవంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్ట్స్ అండ్ లెటర్స్ పబ్లిషర్స్ స్టాల్ నెంబర్ 134లో ఈ పుస్తకాలను అందుబాటులో ఉంచారు. బుద్ధ దర్శనం, బుద్ధుడు - బౌద్ధ దమ్మము, బుద్ధ కనికాయ జాతకాలు, బౌద్ధ ధర్మ దర్శిని, బుద్ధ చర్య వంటి పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. బౌద్ధంపై ఆసక్తి ఉన్న వారు ఈ పుస్తకాలు ఇష్టంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ పుస్తకాలపై 20శాతం తగ్గింపును ఇస్తున్నారు.
నువ్వు నేను రాజ్యాంగం
మహిళలకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి? పోలీసు చట్టాలు ఏం చెబుతున్నాయి? వినియోగదారులకు ఎలాంటి హక్కులు ఉన్నాయి? మానవ హక్కులు ఏం చెబుతున్నాయి? సమాజంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు. రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్స్, చట్టాలతో రూపుదిద్దుకున్న పుస్తకం ‘నువ్వు నేను రాజ్యాంగం’. స్టాల్ నెంబర్ 115లో ఈ పుస్తకం అందుబాటులో ఉంది. ఖరీదు రూ.180.
Updated Date - 2022-01-08T06:09:24+05:30 IST