అభివృద్ధిని అడ్డుకుంటున్నారు!
ABN, First Publish Date - 2022-10-17T05:53:03+05:30
విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి సర్పంచ్ ఉయ్యూరు గోపాలరావుకు చేదు అనుభవం ఎదురైంది.
పనులను అడ్డుకున్న పోలీసులు
కొత్తూరు తాడేపల్లి సర్పంచ్‌కి చేదు అనుభవం
విజయవాడ రూరల్, అక్టోబరు 16 : విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి సర్పంచ్ ఉయ్యూరు గోపాలరావుకు చేదు అనుభవం ఎదురైంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తాడేపల్లి పంచాయతీ పరిధిలోని వేమవరం కాలనీ రోడ్డు బురదగా మారింది. కాలనీ ప్రజల వినతి మేరకు సర్పంచ్ గోపాలరావు, ఆ పక్కనే ఉన్న గట్టు నుంచి గ్రావెల్‌ను తెచ్చి రోడ్డును అభివృద్ధి చేస్తుండగా విజయవాడ టూటౌన్ పోలీసులు అడ్డుకున్న ఘటన ఆదివారం జరిగింది. వేమవరం కాలనీలో సుమారు 290 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కాలనీ పక్కనే ఉన్న కొండను ఆక్రమించుకున్న కొందరు ఫిర్యాదు చేయడంతో పనులను ఆపేశారు. వాస్తవంగా ఎవరికీ భూమిని కేటాయించలేదు.
స్థానికుల వినతి మేరకు రోడ్డును అభివృద్ధి చేస్తున్నామని సర్పంచ్ చెప్పినా, ఎస్‌ఐ ససేమిరా అన్నారు. సీఐ సుబ్రహ్మణ్యంకు ఫోన్ చేసి తక్షణమే పనులను ఆపేయాలని సర్పంచ్‌ను ఆదేశించారు. పోలీసులతో కాలనీ వాసులు వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ దిల్లీరావుకు ఫిర్యాదు చేయనున్నట్లు సర్పంచ్ గోపాలరావు తెలిపారు. విషయం తెలియడంతో, సీఐ, సర్పంచ్‌కు ఫోన్ చేసి రోడ్డు పనులను చేపట్టాలని కోరారు. పనులను ఆపిన వారే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామనే సరికి పనులను చేయాలని సూచించడం గమనార్హం.
Updated Date - 2022-10-17T05:53:03+05:30 IST