బందరు పోర్టు పనుల్లో కదలిక
ABN, First Publish Date - 2022-04-23T06:38:20+05:30
బందరు పోర్టు పనుల్లో కదలిక
టెండర్లు తెరిచిన ఏపీ మేరిటైమ్ బోర్డు అధికారులు
మెఘా, విశ్వసముద్ర సంస్థలు టెండర్లు దాఖలు
ఈనెల 27న ఇరు సంస్థల మధ్య రివర్స్ టెండరింగ్
ఎవరు తక్కువకు కోట్ చేస్తే వారికే పనులు
తొలిదశలో రూ.3,600 కోట్లతో పనులు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బందరు పోర్టు పనులకు సంబంధించి మరో అడుగు ముందుకు పడి ంది. పోర్టుకు సంబంధించిన టెండర్లను ఏపీ మేరిటైమ్ బోర్డు అధికారులు గురువారం రాత్రి తెరిచారు. మెఘా సంస్థ, విశ్వ సముద్ర హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఒకే టెండర్ వస్తే పనులు అప్పగించడానికి సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో రెండింటి ద్వారా టెండర్లు దాఖలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రెండు సంస్థలకు సంబంధించిన సాంకేతికపర అనుభవాలు, ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాలను ఏపీ మేరిటైమ్ బోర్డు అధికారులు ఈ నెల 27వ తేదీ వరకు పరిశీలిస్తారు. అదేరోజు రెండు సంస్థల మధ్య రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఎవరు తక్కువకు కోట్ చేస్తే వారికే పనులను అప్పగిస్తారు. జిల్లాల విభజన నేపథ్యంలో మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడిన కృష్ణాజిల్లా అభివృద్ధికి బందరు పోర్టు నిర్మాణం అత్యంత అవసరమని ప్రభుత్వ ఉన్నతాధికారుల అభిప్రాయం. కృష్ణాజిల్లా పారిశ్రామికంగా వెనుకబడి ఉన్న ఈ సమయంలో పోర్టుకు అనుబంధంగా 27 రకాల పరిశ్రమలు ఏర్పడే అవకాశం రావడం శుభపరిణామమే అవుతుంది.
ఇన్నాళ్లకు ముందుకు..
వైసీపీ అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే బందరు పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ మూడేళ్ల వ్యవధిలో పోర్టు పనులను ప్రభుత్వమే చేస్తుందని, తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజాప్రతినిధులు చెబుతూ వచ్చారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన రుణాన్ని తీసుకునేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకుల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చర్చలు జరిపారు. అప్పటి మంత్రి పేర్ని నాని ఏపీ మేరిటైమ్ బోర్డు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు.
29న పది గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ
పోర్టు నిర్మించాలంటే పర్యావరణ శాఖ అనుమతులు తప్పనిసరి. గతంలో ఈ అనుమతులు వచ్చాయి. 12 ఏళ్ల గడువు ముగియడంతో రద్దయ్యాయి. దీంతో పోర్టు నిర్మాణం జరిగే పది గ్రామాల పరిధిలోని ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలి. గత ఏడాది డిసెంబరు 15నే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయించినా పలు కారణాలతో నిర్వహించలేదు. తాజాగా ఈనెల 29వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని శుక్రవారం నిర్ణయించారు.
రైట్స్ సంస్థ నివేదిక ప్రకారం ఇలా..
బందరు పోర్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే నిర్వహించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను ప్రభుత్వానికి సమర్పించింది. మొదటి దశలో రూ.3,600 కోట్ల అంచనాలతో పోర్టు పనులు చేయాలని నిర్ణయించారు. తొలి విడతలో 2,095.65 ఎకరాలు అవసరమని నివేదికలో పొందుపరిచారు. టీడీపీ హయాంలో 639.14 ఎకరాల పట్టా భూమిని కొని రైతులకు రూ.168.53 కోట్లను మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ద్వారా చెల్లించారు. పోర్టు మొదటి దశలో నాలుగు బెర్తులు, రెండో దశలో 12 బెర్తులు నిర్మించాలని రైట్స్ సంస్థ ఇచ్చిన నివేదికలో ఉంది. మొదటి దశ పనులు పూర్తయితే ఏడాదికి 26.12 మిలియన్ టన్నులు, రెండో దశ అయితే ఏడాదికి 89.85 మిలియన్ టన్నుల ఎగుమతులు, దిగుమతులు కార్గో రవాణా ద్వారా చేయవచ్చని రైట్స్ సంస్థ నివేదికలో పేర్కొంది. కాగా, ప్రస్తుతం మెఘా సంస్థ్థకే పనులు అప్పగించే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ఏపీ మేరిటైమ్ బోర్డు అధికారుల అభిప్రాయం. అయితే, పనులు ప్రారంభం కావాలంటే రోడ్డు కమ్ రైలు మార్గాల కోసం 183 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకు స్టేట్ మేరిటైమ్ బోర్డ్డు ద్వారా రూ.100 కోట్లు విడుదల చేయాలని గతంలో ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు. టెండర్లు ఖరారైతే ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ భూసేకరణ అంశంపై వీఆర్వోలు, సర్వే విభాగం సిబ్బందిని రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు.
Updated Date - 2022-04-23T06:38:20+05:30 IST