33 పోలీస్ స్టేషన్లు
ABN, First Publish Date - 2022-04-08T05:51:55+05:30
33 పోలీస్ స్టేషన్లు
49 నుంచి 33కు తగ్గిన కృష్ణాజిల్లా పోలీస్ స్టేషన్లు
కొత్తగా చేరినవి 9, వెళ్లిపోయినవి 25
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 7 : జిల్లా పునర్విభజనలో భాగంగా పోలీస్ శాఖలో గతంలో ఉన్న 49 పోలీసు స్టేషన్లు 33కు తగ్గాయి. అయితే, కీలకమైన గన్నవరం, కంకిపాడు, పెనమలూరు పోలీస్ స్టేషన్లు కృష్ణాజిల్లాలో చేరడం వల్ల జిల్లాకు తగిన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 49 పీఎస్‌లు ఉండేవి. వీటిలో ఎన్టీఆర్ జిల్లాకు 15 పోలీస్ స్టేషన్లు వెళ్లిపోయాయి. గతంలో కృష్ణాజిల్లా పరిధిలో నందిగామ డివిజన్‌లో ఉండే జగ్గయ్యపేట, చిల్లకల్లు, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు, నూజివీడు డివిజన్‌లో ఉండే తిరువూరు, గంపలగూడెం, ఏ.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, విస్సన్నపేట పోలీస్ స్టేషన్లు ఎన్టీఆర్ జిల్లాకు వెళ్లాయి. వీటితో పాటు నూజివీడు నియోజకవర్గ పరిధిలో ఉండే ఆగిరిపల్లి, నూజివీడు టౌన్, నూజివీడు రూరల్, ముసునూరు, చాట్రాయి, కైకలూరు నియోజకవర్గ పరిధిలోని ముదినేపల్లి, మండవల్లి, కలిదిండి, కైకలూరు టౌన్, కైకలూరు రూరల్ పోలీసు స్టేషన్లు ఏలూరు వెళ్లిపోయాయి. ఇలా మొత్తం మీద గతంలో కృష్ణాజిల్లా పరిధిలోని 25 పోలీస్ స్టేషన్లు ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు వెళ్లాయి.
కొత్తగా చేరిన తొమ్మిది ఇవీ..
నూతన కృష్ణాజిల్లాలో తొమ్మిది పోలీస్ స్టేషన్లు అదనంగా చేరాయి. విజయవాడ ఈస్ట్ డివిజన్ నుంచి గన్నవరం, ఆత్కూరు, ఉంగుటూరు, ఉయ్యూరు టౌన్, ఉయ్యూరు రూరల్, పమిడిముక్కల, తోట్లవల్లూరు, కంకిపాడు, విజయవాడ సెంట్రల్ డివిజన్‌లోని పెనమలూరు పోలీసు స్టేషన్ కృష్ణాజిల్లా పరిధిలోకి వచ్చాయి. మచిలీపట్నం డివిజన్‌లో 9, గుడివాడ డివిజన్‌లో 10, అవనిగడ్డ డివిజన్‌లో 5, గన్నవరం డివిజన్‌లో 9 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. వీటిలో చిలకలపూడి, ఇనకుదురు, ఆర్‌పేట, గుడివాడ 1, గుడివాడ 2, గన్నవరం, ఉయ్యూరు, పెనమలూరు స్టేషన్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయివి. ఇక ఉమ్మడి కృష్ణాజిల్లా పోలీస్ శాఖలో ఐదు డివిజన్లు ఉండేవి. ఇప్పుడు డివిజన్ల సంఖ్య నాలుగుకు తగ్గగా, గతంలో ఉన్న 12 సర్కిళ్లు 10 అయ్యాయి.
జనాభా ప్రాతిపదికన బలగాలు
జనాభా ప్రాతిపదికన పోలీస్ స్టేషన్లకు బలగాలను కేటాయిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు స్టేషన్‌లో ఉన్న సీఐలు, ఎస్‌ఐలు యధావిధిగా కొనసాగుతున్నారు. జిల్లా పునర్‌వ్యవస్థీకరణ అనంతరం ఎన్టీఆర్ జిల్లా నుంచి కృష్ణాజిల్లాకు, కృష్ణాజిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాకు కొందరు మారే అవకాశాలు ఉన్నాయి.
పాలనా సౌలభ్యం
పరిపాలనా వికేంద్రీకరణ, ప్రజల ముంగిటకే పాలన అనే లక్ష్యాలు జిల్లా పునర్‌వ్యవస్థీకరణ వల్ల ఏర్పడతాయి. పోలీస్ స్టేషన్లు తగ్గినప్పటికీ కీలకమైన గన్నవరం, ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు వంటి వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై పోలీసులకు అవగాహన సదస్సు నిర్వహిస్తాం. శాంతిభద్రతల పరిరక్షణకు, గ్రామ స్వరాజ్య లక్ష్యానికి సచివాలయాల్లోని మహిళా పోలీసుల సేవలను తీసుకుంటాం. ఆశించిన లక్ష్యాలు అధిగమించేందుకు కృషి చేస్తాం. - సిద్ధార్ధ కౌశల్, జిల్లా ఎస్పీ
Updated Date - 2022-04-08T05:51:55+05:30 IST