యంత్రం.. అలక్ష్యం..
ABN, First Publish Date - 2022-10-17T11:57:36+05:30
వ్యవసాయంలో సాగు ఖర్చును, రైతుల శ్రమను గణనీయంగా తగ్గించి లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సబ్‌మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఏఎం) ద్వారా రాయితీపై యంత్రాలను, పరికరాలను అందిస్తోంది. దీనిని
క్షేత్రస్థాయికి చేరని వైఎస్సార్ యంత్రసేవ ప్రయోజనం
వైసీపీ సానుభూతి పరులే లబ్ధిదారులు...?
వారికే రూ.1.40కోట్ల్ల సబ్సిడీ పరికరాలు...!
పక్కదారి పడుతున్న రూ.3.52 కోట్ల యంత్రాలు
రైతులకు అందుబాటులో లేని వైనం
పర్యవేక్షణ లేని వ్యవసాయశాఖ
రైతులకు మేలు చేస్తున్నామంటూ వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ యంత్రసేవా పఽథకం ప్రారంభించింది. ఆధునిక వ్యవసాయ పరికరాలను, యంత్రాలను 40 శాతం రాయితీపై అందిస్తున్నామని చెబుతున్నా... అవి అర్హులైన రైతులకు చేరడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ సానుభూతి పరులను లబ్ధిదారుల జాబితా కింద చేర్చి రూ.1.40 కోట్ల సబ్సిడీ కలిగిన రూ.3.52 కోట్ల విలువచేసే ట్రాక్టర్లు, వరికోతయంత్రాలు, వ్యవసాయ యంత్ర పరికరాలను కట్టబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే వైఎస్సార్ యంత్రసేవా పఽథకం ద్వారా అందించిన యంత్రాలు లబ్ధిదారుల ఆధీనంలో కాకుండా ఇతరుల చేతుల్లోకి వెళ్లి రైతులకు అందుబాటులో లేవని రైతులు ఆరోపిస్తున్నారు.
కడప(రూరల్), అక్టోబర్ 13 : వ్యవసాయంలో సాగు ఖర్చును, రైతుల శ్రమను గణనీయంగా తగ్గించి లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సబ్‌మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఏఎం) ద్వారా రాయితీపై యంత్రాలను, పరికరాలను అందిస్తోంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ యంత్రసేవా పఽథకంగా మార్పుచేసి సదరు యంత్రాలను, పరికరాలను సబ్సిడీపై రైతులకు అందిస్తోంది. ఈ మేరకు ఆర్బీకే పరిధిలో ఐదుగురు రైతులను గ్రూప్‌గా ఏర్పాటుచేసి ఒక్కో గ్రూప్‌నకు లక్షల విలువచేసే యంత్రాలను, యంత్ర పరికాలను అందించింది. వీటిని ఆర్బీకే పరిధిలోని రైతులకు సరసమైన బాడుగకు అందించాలని ఇందుకు సంబంధించిన ధరలను నోటీస్‌బోర్డులో ఉంచాలని పేర్కొంది. కానీ ఈ ప్రక్రియ ఆర్బీకేలలో మచ్చుకైనా కన్పించడంలేదు.
జిల్లాకు 432 ట్రాక్టర్లు, 43 హర్వెస్టర్లు మంజూరు
వైఎ్‌సఆర్ కడప జిల్లాకు 432 ట్రాక్టర్లు, 43 కంబేన్డ్ హర్వెస్టర్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో ఇప్పటి వరకు రూ.3.52 కోట్ల విలువచేసే యంత్ర పరికరాలను 364 గ్రూపులకు పంపిణీ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో బద్వేల్ నియోజకవర్గంలో 62, జమ్మలమడుగులో 60, కడపలో 2, కమలాపురంలో 62, మైదుకూరులో 55, ప్రొద్దుటూరులో 23, పులివెందుల నియోజక వర్గంలో 82, రాజంపేట నియోజక వర్గం(ఒంటిమిట్ట, సిద్దవటం)లో 18 పంపిణీ చేశారు.
గ్రూప్ సభ్యుల్లో ఒక్కరిదే పెత్తనం
ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన వైఎస్సార్ యంత్రసేవా పథకం కొందరికి జేబులు నింపుకొనే పఽథకంగా మారింది. పథకం లబ్ధిని పొందాలంటే ఏదో ఒక పేరుపై నలుగురు లేదా ఐదుగురు సభ్యులు గ్రూప్ ఏర్పాటుచేసుకోవాలి. ఈ మేరకు పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకున్న వైసీపీ నేతలు వారి బంధువులు, వైసీపీ సానుభూతి పరులను గ్రూప్‌లో చేర్చుకున్నారు. అయితే ఇలాంటి వారు గ్రూప్ సభ్యుల ప్రమేయం లేకుండానే తనకు దక్కిన యంత్రాలు, పనిముట్లను ఇతరులకు కట్టబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారుల పర్యవేక్షణ లేక..
జిల్లాలో వైఎస్సార్ యంత్రసేవా పథకం క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రయోజనం సాధించలేక చతికిలపడుతోంది. ఈ పఽథకం ద్వారా యంత్రాలు, పరికరాలు పొందిన గ్రూఫ్‌లు వారి వ్యవసాయ అవసరాలు పూర్తయిన తరువాత వాటిని సంబంధిత ఆర్బీకే పరిధిలోని రైతులకు ఆమోదయోగ్యమైన అద్దెకు అందుబాటులో ఉంచాలి. ఏయే పరికరాలు... ఎంత ధర మేరకు అందుబాటులో ఉండేది ఆర్బీకేలోని సూచిక బోర్డులో నమోదు చేయాలి. వీటిని రైతులు బాడుగకు తీసుకెళ్తారు. అయితే ఈ ప్రక్రియ క్షేత్రస్థాయిలో ఎక్కడా జరగడంలేదు. వైఎస్సార్ యంత్రసేవా పథకం ద్వారా అందించిన ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు గ్రూప్ సభ్యుల ఆధీనంలో కాకుండా ఇతరుల చేతుల్లో కెళ్లి మరెక్కడో ఇతర ప్రాంతాల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలనే ఈ తంతు జరుగుతున్నట్లు చెప్పుకొస్తున్నారు.
రైతుపక్షాన ఉద్యమిస్తాం
- పుత్తా నరసింహారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు
కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు రాయితీపై ఆధునిక యంత్రాలను, పనిముట్లను అందిస్తోంది. దీనికి సీఎం జగన్ వైఎస్సార్ యంత్రసేవా పథకం అని పేరు పెట్టారు. అయితే గ్రూప్‌లకు అందించిన లక్షల విలువ చేసే సాగు యంత్రాలు, పనిముట్లు ఆర్బీకేల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం యంత్రాలను, పరికరాలను ఆర్బీకేలలో అద్దెకు అందుబాటులో ఉంచకపోతే రైతు పక్షాన ఉద్యమిస్తాం.
ఆర్బీకేలను ముట్టడిస్తాం
- సీపీఎం జిల్లా కార్యదర్శి జి. చంద్ర
వైఎస్సార్ యంత్రసేవా పఽథకం ద్వారా రాయితీపై అందిస్తున్న లక్షల విలువ చేసే సబ్సిడీ యంత్రాలు అర్హులైన రైతులకు కాకుండా వైసీపీ అనుమాయులకు కట్టబెడుతున్నారు. పఽథకం నిబంధనలు ఆచరణలో ఎక్కడా అమలు కావడంలేదు. ప్రభుత్వం చెప్పిన విధంగా ట్రాక్టర్లను, హార్వెస్టర్లను, పనిముట్లను అర్బీకే కేంద్రాలలో అద్దెకు ఉంచాలి. లేదంటే రైతులతో ఆర్బీకేలను ముట్టడిస్తాం.
నిబంధనలు ఉల్లఘిస్తే క్రిమినల్ చర్యలు
- ఐ.నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి
వైఎస్సార్ యంత్రసేవా పథకం ద్వారా అందించిన యంత్రాలను, పనిముట్లను గ్రూపు సభ్యులు ప్రభుత్వ నిబంధనల మేరకు కొనసాగించాలి. ఇందుకు బిన్నంగా వ్యవహరిస్తే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం.
Updated Date - 2022-10-17T11:57:36+05:30 IST