చెరువుల వేలం ఎప్పుడో?
ABN, First Publish Date - 2022-12-31T23:19:32+05:30
రెండేళ్లుగా మదనపల్లె మండలంలోని చీకిలబైలు పంచాయతీలో ఉన్న చెరువుల్లో చేపల పెంపకానికి వేలం వేయకపోవడంతో దాదాపు రూ.20 లక్షలకు పైగా పంచాయతీ ఆదాయానికి గండి పడింది.
రెండేళ్లుగా చేపల పెంపకానికి చెరువుల వేలం పెండింగ్
పంచాయతీ ఆదాయానికి రూ.20 లక్షలకు పైగా గండి
మదనపల్లె రూరల్, డిసెంబరు 31: రెండేళ్లుగా మదనపల్లె మండలంలోని చీకిలబైలు పంచాయతీలో ఉన్న చెరువుల్లో చేపల పెంపకానికి వేలం వేయకపోవడంతో దాదాపు రూ.20 లక్షలకు పైగా పంచాయతీ ఆదాయానికి గండి పడింది. మండలంలోనే చెరువుల్లో చేపల పెంపకం ద్వారా ఎక్కువ ఆదాయం ఈ పంచాయతీలోని చెరువుల ద్వారానే వస్తుంది. పంచాయతీకి ఏకైక ఆదాయ వనరులుగా ఉన్న ఈ చేపల చెరువులకు వేలం పాట నిర్వహించకుండా అధికారులు, స్థానిక నాయకులు గతంలో వేలం పాటలో చేపల పెంపకానికి వేలంలో దక్కించుకున్న వారితో కలసి వేలం జరుగకుండా జాప్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చీకిలబైలు పంచాయతీలో మేడిపల్లె చెరువు, వెంకటమ్మచెరువు, కదిరమ్మ చెరువులైన మూడు పెద్దచెరువులు ఉన్నాయి. ఈ చెరువులకు చివరిసారిగా 3-11-2020లో ఆరు నెలల గడువుతో వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో మేడిపల్లె చెరువు రూ.5,24,000 పలుకగా, వెంకటమ్మ చెరువు రూ.4,25,000 పలికాయి. కదిరమ్మ చెరువుకు వేలం పాటకు గ్రామస్థులు అభ్యంతరం తెలపడంతో నిలిపేసారు. దీంతో మేడిపల్లె, వెంకటమ్మ రెండు చెరువులకే రూ.9,49,000 పంచాయతీకి ఆదాయం వచ్చింది. అనంతరం ఏడాదికి ఒకసారి వేలం నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని అధికారులు చెబుతున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది వర్షాలు బాగా కురవడంతో చెరువులు నిండుతున్నాయి. అయితే వేలం నిర్వహించి రెండేళ్లకు పైగా అవుతున్నా ఈ చెరువుల్లో చేపల పెంపకానికి వేలం నిర్వహించకపోవడంతో పంచాయతీ ఆదాయానికి గండిపడుతుంది. కర్ణాటక సరిహద్దు గ్రామంగా ఉన్న చీకిలబైలుకు ఆదాయ వనరుగా ఉన్న ఈ చెరువుల్లో చేపల పెంపకానికి వేలం నిర్వహించకపోవడంతో అభివృద్ధి పనులు సైతం గ్రామంలో చేపట్టలేని పరిస్థితి నెలకొంది. దీనిపై ఈవోఆర్డీ వెంకటసుబ్బయ్యను వివరణ కోరగా త్వరలోనే చెరువుల్లో చేపల పెంపకానికి వేలం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Updated Date - 2022-12-31T23:19:33+05:30 IST