కన్నుల పండువగా రథోత్సవం
ABN, First Publish Date - 2022-07-15T04:22:53+05:30
సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథస్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది.
నందలూరు, జూలై 14: సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథస్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆగమశాస్త్ర పండితులు ఏవీకే నరసింహాచార్యులు, అఖిల్ దీక్షితులు, శివమోహన్ ఆచార్యులు, అనంతశర్మల మంత్రోచ్ఛారణ నడుమ భక్తిశ్రద్ధలతో పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. బ్రహ్మోత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మేడా విజయభాస్కర్‌రెడ్డి, మేడా విజయశేఖర్‌రెడ్డి, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు అరిగెల సౌమిత్రి చంద్రనాధ్‌లు ముందుండి రథాన్ని ముందుకు నడిపించారు. పెద్దఎత్తున హాజరైన భక్తుల గోవింద నామస్మరణలతో మాడవీధులు మారుమోగాయి. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. రాజంపేట సీఐ పుల్లయ్య, ఎస్‌ఐ మైనుద్దీన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు, బోయలు, భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని బ్రహ్మోత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.
Updated Date - 2022-07-15T04:22:53+05:30 IST