వలం..టీయర్స్
ABN, First Publish Date - 2022-12-07T03:22:34+05:30
సీఎం జగన్ కడప పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. మంగళవారం కడపలోని పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు, ఏపీఎ్‌సఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి కూతురు వివాహ రిసెప్షన్‌లో పాల్గొనాల్సి ఉంది.
సీఎం కడప పర్యటనలో పోలీసు డ్యూటీ
ఉదయమే చంటి పిల్లలతో డ్యూటీకి
జనంతోపాటు వారికీ 4గంటలు నరకం
ఆపై సీఎం టూరు రద్దు వార్తతో ఊరట
కడప, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ కడప పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. మంగళవారం కడపలోని పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు, ఏపీఎ్‌సఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి కూతురు వివాహ రిసెప్షన్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన పర్యటన ఆగిపోయింది. అయితే, జగన్ పర్యటనకు గత నాలుగు రోజులుగా అధికారులు చేస్తున్న కసరత్తు సామాన్యులకే కాదు, వలంటీర్లకూ నరకం చూపించింది. ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్టు నుంచి పెద్దదర్గా, అక్కడి నుంచి రాయచోటి రోడ్డులో ఉన్న కల్యాణమండపం వెళ్లే మార్గాలలో వలంటీర్లకు విధులు అప్పగించారు. ఈ క్రమంలో వారి కష్టాలను ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం వెలుగులోకి తెచ్చింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం 11:10 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు ముఖ్యమంత్రి చేరుకోవాలి. 11:20కి ఎయిర్‌పోర్టు నుంచి అమీన్‌పీర్ దర్గాకు వెళ్లాలి. అయితే ఉదయం 8 గంటలకే వలంటీర్లను వారికి కేటాయించిన ప్రాంతాలకు తీసుకొచ్చారు. కొందరు టిఫెన్ చేసి వస్తే మరికొందరు ఖాళీ కడుపుతోనే వచ్చేశారు. కొందరు వలంటీర్లు చంటిపిల్లలను తీసుకుని విధులకు హాజరయ్యారు. ‘ఆంధ్రజ్యోతి’ 10:40 గంటలకు కడపలోని ఐటీఐ సర్కిల్ నుంచి బిల్టప్, వినాయకనగర్ ఎయిర్‌పోర్టు వరకు పరిశీలించగా, వలంటీర్లకు వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందిస్తూ సిబ్బంది కనిపించారు. ‘‘మాకిచ్చే జీతం కంటే మాతో ఎక్కువగా పనిచేయిస్తున్నారు.
పోలీసులు చేసే పని మాతో చేయిస్తున్నారు. మా టైం బాగలేక వలంటీర్లుగా పనిచేస్తున్నాం’’ అని పలువురు వలంటీర్లు వాపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం పర్యటన రద్దయిందని అధికారులు తెలపడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. తమకు కేటాయించిన ప్రాంతాల నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. నిజానికి, వాళ్లంతా చిరుద్యోగులు. కొందరు ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు దక్కలేదు. మరికొందరికి పనిచేస్తేనే పొట్ట నిండుతుంది. అరకొర వేతనం అయినాసరే సిఫారసు చేసుకుని మరీ వలంటీర్ల ఉద్యోగంలో చేరారు. అప్పటినుంచీ కష్టాలే. సీఎం జగన్ జిల్లాల పర్యటనలకు వాళ్లే జనాలను తరలించురావాలి. ఇప్పుడు ఇక ఏకంగా సీఎం కడప పర్యటనలో వలంటీర్లకే డ్యూటీలు వేశారు. కాగా, సీఎం పర్యటన అంటే బారికేడ్లు, పరదాలు కామన్. సొంత జిల్లాలో కూడా అదే పరిస్థితి. కడప పెద్దదర్గా ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా కరోనా సమయంలో ఎలా గేట్లు వేసేవారో అలాగే బంధించేశారు. అమీన్‌పీర్ దర్గా సమీపంలోని అగాడి వీధిని పోలీసులు, వలంటీర్లతో నింపేశారు. మెడికల్ స్టోర్లు మినహాయించి మిగిలిన దుకాణాలను మూయించారు. దర్గా సమీపంలో అమ్మఒడి లబ్ధిదారులతో ‘థాంక్యూ సీఎం సర్’ అంటూ కొంతమంది విద్యార్థులను ఏర్పాటుచేశారు.
Updated Date - 2022-12-07T03:22:35+05:30 IST