సీజనల్ వ్యాధుల విజృంభణ
ABN, First Publish Date - 2022-08-04T05:30:00+05:30
మదనపల్లె డివిజన్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరపీడితులతో జిల్లా ప్రభుత్వాస్పత్రి కిటకిటలాడుతోంది.
పెరుగుతున్న డెంగీ, టైఫాయిడ్ కేసులు
గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం
జ్వరపీడితులతో మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రి కిటకిట
పట్టించుకోని వైద్యఆరోగ్యశాఖ అధికారులు
మదనపల్లె క్రైం, ఆగస్టు 4: మదనపల్లె డివిజన్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరపీడితులతో జిల్లా ప్రభుత్వాస్పత్రి కిటకిటలాడుతోంది. ముఖ్యంగా డెంగీ, టైఫాయిడ్, మలేరియా, గున్యా, విషజ్వరాల కేసులు పెరుగుతున్నాయి. గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం, కలుషిత తాగునీటితో జ్వరాలు ప్రబలినట్లు ప్రజలు చెబుతున్నారు. గ్రామీ ణులు జ్వరాల బారినపడి అల్లాడుతుంటే.. వైద్యఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మదనపల్లె డివిజన్లోని 11 మండలాల పరిధిలో ఇటీవల కురిసిన వర్షాలకు వ్యాధులు ప్రబలాయి. లోపించిన పారిశుధ్యం, కలుషిత నీటి వాడకం, పేడదిబ్బలు, పెరిగిన గడ్డి, పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం, మురుగు నిల్వతో దోమలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ప్రజలు దోమకాటుకు గురై వ్యాధుల బారినపడుతున్నారు. తొలుత జలుబు, దగ్గు, తలనొప్పి, కీళ్లనొప్పులతో జ్వరం వస్తోంది. అయితే రెండు మూడు రోజులు వరుసగా జ్వరం వస్తున్నా... గ్రామీణులు ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటున్నారు. దీంతో ఇంటిళ్లిపాదీ జ్వరాల బారినపడాల్సిన పరిస్థితి. పిల్లా పెద్దా అందరూ జ్వరాలతో బాధ పడుతున్నారు. ఈనేపథ్యంలో పెద్దమండ్యం, తంబళ్లపల్లె, కురబలకోట, ములకలచెరువు, బి.కొత్తకోట, పీటీఎం, నిమ్మనపల్లె, రామసముద్రం, మదనపల్లె అర్బన్, రూరల్, గుర్రం కొండ, వాల్మీకిపురం మండలాల్లో వ్యాధులు ప్రబలాయి. ఒక్కో ఇంట్లో ఐదారుగురు జ్వరంతో అల్లాడుతున్నారు.
అందుబాటులో లేని డాక్టర్లు, వైద్య సిబ్బంది
మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో డాక్టర్లు, వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో జ్వరబాధితులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. పైగా రెండు మూడు రోజులు జ్వరంతో బాధపడుతున్నట్లు బాఽధితులు చెబుతుండడంతో టెస్టులు చేసేందుకు ల్యాబ్, కిట్లు లేవని రోగులకు సర్దిచెప్పి మరీ మదనపల్లెకు రెఫర్ చేస్తున్నారు. డెంగీ, టైఫాయిడ్, మలేరియా జ్వరమై ఉండొచ్చని... ఇక్కడ పెద్దడాక్టర్ అందుబాటులో లేరని, పెద్దాస్పత్రికి వెళితే అక్కడ అందరూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందిస్తారని ఉచిత సలహా ఇస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. సాధారణ జ్వరమైనా మదనపల్లెకు రెఫర్ చేస్తున్నారని వాపోతున్నారు. ఇక పెద్దజబ్బులైతే ప్రాణాలు పోగొట్టుకోక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు.
జ్వరపీడితులతో కిటకిటలాడుతున్న జిల్లా ఆసుపత్రి
గ్రామాల్లో జ్వరాలు ప్రబలడంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో జ్వరపీడితుల సంఖ్య పెరిగింది. అదేవిధంగా ఓపీ సంఖ్య 800 నుంచి వెయ్యికి పెరగ్గా, ఇన్పేషంట్లు 150 మంది కి పైగా ఉంటారు. వెయ్యిలో 500 మంది జ్వర పీడితులే ఉన్నారు. ఇందులో డెంగీ, టైఫాయిడ్, మలేరియా కేసులే ఎక్కువగా ఉన్నాయి. 500 మందికి టెస్టులు చేస్తే... అందులో వైరల్ ఫీవర్స్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. మిగతా వారంతా డెంగీ, టైఫాయిడ్ బాధితులు. ముఖ్యంగా ల్యాబ్, ఓపీ గదుల వద్ద అందరూ జ్వరబాధితులే ఉన్నారు. దీంతో జ్వరపీడితులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. ముఖ్యంగా అత్యవసర విభాగం, ఓపీ గదులు, ల్యాబ్, మందుల పంపిణీ గది, వార్డులన్నీ జ్వర బాధితులతో నిండిపోయాయి. ఫీవర్ టెస్టులకే సమయం సరిపోతోందని, ఇక మిగతా టెస్టులు చేసేందుకు సమయం చాలడం లేదని ల్యాబ్ సిబ్బంది చెబుతున్నారు. డెంగీ, టైఫాయిడ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జ్వరబాధితుల్లో ప్లేట్లెట్ కౌంట్ 1.50 లక్షలకు తగ్గకుండా ఉంటే డెంగీ సోకదని అంటున్నారు. తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోతే వ్యాధి తీవ్రత పెరిగి మరణాలు సంభవించే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. టైఫాయిడ్తో మనిషి సన్నగిల్లి కోలుకోవడానికి 20 రోజులు పడుతుందని అంటున్నారు. మెరుగైన వైద్యం అందించకుంటే పరిస్థితి విషమించే అవకాశం ఉందన్నారు. సీజన్ ప్రారంభం నుంచీ డెంగీ, టైఫాయిడ్ బాగా వ్యాపి స్తోందన్నారు. ఇదిలా వుండగా ఇటీవల ములకలచెరువుకు చెందిన ఓ బీటెక్ విద్యార్థి డెంగీతో మృతి చెందాడు. అలాగే తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాలకు చెందిన నలుగురు డెంగీ బారిన పడడంతో బెంగళూరుకు రెఫర్ చేశారు. దీంతోపాటు చాలామంది టైఫాయిడ్ బాధితులు ప్రభుత్వాస్పత్రి సహా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందు తున్నారు. గ్రామాల్లో వైద్యసిబ్బంది క్షేత్రస్ధాయి పర్యటన లేకపోవడంతో జ్వరాలు ఎక్కువై నట్లు చెబుతున్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా జ్వరబాధితులను గుర్తించి వైద్యసేవలు అందించి ఉంటే కేసులు పెరిగేవి కావన్నారు. జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తే వ్యాఽధులు తగ్గుముఖం పడతాయని జిల్లా ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.
మెరుగైన వైద్యం అందిస్తున్నాం..
జిల్లా ఆస్పత్రికి వచ్చే జ్వరపీడితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఎక్కువగా డెంగీ, టైఫాయిడ్ కేసులు వస్తున్నాయి. జ్వర బాధితులకు తొలుత వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించి, ఆ తరువాత చికిత్స అందిస్తున్నాం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాధారణ జ్వరమైనా ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటే వ్యాధి వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. రెండు మూడు రోజులు వరుసగా జ్వరం వచ్చిన బాధితుల్లో డెంగీ లక్షణాలు కనబడుతున్నాయి. ఫ్లూయిట్స్, మందులతో రక్తకణాల సంఖ్య పెంచుతున్నాం. జబ్బుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.
-డాక్టర్ ఆంజనేయులు, మెడికల్ సూపరింటెండెంట్, మదనపల్లె జిల్లా ఆస్పత్రి.
Updated Date - 2022-08-04T05:30:00+05:30 IST