నేను చెప్పిందే.. వినాలి.. లేకుంటే వెళ్లిపోండి..
ABN, First Publish Date - 2022-12-15T23:19:20+05:30
ఏమండి..! అధికారి గారు.. మా వాళ్లు చెప్పినట్లు మీరు వినడం లేదు. బిల్లులు చేయమంటే.. ఏవో అడ్డంకులు చెబుతున్నారు. మీ కింది అధికారులందరూ సంతకాలు చేసిన తర్వాత.. సంతకం చేయడానికి మీకేంటి అభ్యంతరం? బిల్లులు చేయండి.. లేదంటే.. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి..
జిల్లా స్థాయి అధికారికి ముఖ్య నేత హుకుం
ఒకే రోడ్డుకు.. రెండు గ్రాంట్ల కింద బిల్లు పెట్టే యత్నం
పనులు తనిఖీ చేయకుండానే సంతకం కోసం ఒత్తిడి
చేయనందుకు.. బదిలీ నజరానా?
ఏమండి..! అధికారి గారు.. మా వాళ్లు చెప్పినట్లు మీరు వినడం లేదు. బిల్లులు చేయమంటే.. ఏవో అడ్డంకులు చెబుతున్నారు. మీ కింది అధికారులందరూ సంతకాలు చేసిన తర్వాత.. సంతకం చేయడానికి మీకేంటి అభ్యంతరం? బిల్లులు చేయండి.. లేదంటే.. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. ఇంకొకరిని తెచ్చుకుంటాం.. ఇదీ.. జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ శాఖ జిల్లా స్థాయి అధికారికి, అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత జారీ చేసిన హుకుం.. సార్ ! మీ వాళ్లు చెప్పింది.. చేయలేం.. చేస్తే.. భవిష్యత్తులో నా ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయి.. ఒకే పనికి రెండు శాఖల నిధులు బిల్లులు చేయలేను.. చేసిన ఖర్చుకు.. పెట్టిన బిల్లుకు చాలా తేడా ఉంది. ఆ పనులు చూడకుండానే.. సంతకాలు చేయమంటున్నారు.. దయ ఉంచి అర్థం చేసుకోండి.. ఇదీ సదరు అధికారి ఆ ముఖ్యనేతకు ఇచ్చిన సమాధానం.. ఫలితం.. ఆ అధికారికి బదిలీ నజరానా..
(రాయచోటి -ఆంధ్రజ్యోతి): రాయచోటి మున్సిపాలిటీలోని లబ్ధిదారుల కోసం సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె గ్రామ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీ ఏర్పాటు చేసింది. సుమారు 7 వేల మందికి ఇళ్లు ఇచ్చింది. ఈ కాలనీకి వెళ్లేందుకు చిత్తూరు-రాయచోటి జాతీయ రహదారి నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1.75 లక్షలతో బీటీ రోడ్డు పనులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతిపాదించారు. ఈ రోడ్డు పనిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు చేపట్టారు. రోడ్డు చదును చేసి రోడ్డుపైన మట్టి తోలారు.. సుమారు నాలుగైదు కల్వర్టులు కూడా నిర్మించారు. ఆ తర్వాత ఏమైందో ? ఏమో.. ఆ పనులు నిలిచిపోయాయి. (ఈ పనుల కోసం ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారో..? కచ్చితంగా తెలియడం లేదు.. అదే విధంగా ఎంత బిల్లులు చేశారో? అధికారులు చెప్పడం లేదు) సంబేపల్లె మండల ఇంజనీరింగ్ అధికారులను.. అడిగితే.. వర్క్ డిలే (పని ఆలస్యంగా చేయడంతో) కింద బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. అయితే ఇటీవల ఇదే రోడ్డును వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ ద్వారా రూ.1.85 లక్షల వ్యయంతో చేపట్టినట్లు.. బిల్లుల కోసం సంతకాలు చేయమని సదరు అధికారిని అధికార పార్టీకి చెందిన కొందరు వెళ్లి అడిగారు. ఆ రోడ్డును తాను చూడాలని ఆ అధికారి చెప్పగా ఎప్పుడో పూర్తయిన రోడ్డును మీరు చూడడం ఎందుకు.? 2020లో ఉపాధి పనుల కింద చేపట్టాం.. మీరు రోడ్డు చూడాల్సిన పని లేదు. సంతకం పెడితే చాలు అని చెప్పారు. నేను చూడకుండా సంతకం పెట్టను అని ఆ అధికారి వారిని పంపించేశారు. ఈ విషయాన్ని అధికార పార్టీ నాయకులు ముఖ్య నాయకుడికి చెప్పారు. ఈ సంఘటనకు ముందే గాలివీడు మండలంలో ఇంకో సంఘటన జరిగింది. అక్కడ సుమారు రూ.40 లక్షల వ్యయంతో ఒక బండ మీద సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ పనిని అధికార పార్టీకి చెందిన వారు చేస్తున్నారు. బండ మీద బొక్కలు పెట్టి ఇనుప కడ్డీలు దింపి కంకర వేసి పిల్లర్లు నిర్మించాలి. అయితే ఈ పనిలో కూడా ఖర్చు చేసిన మొత్తం రూ. పదివేల లోపు ఉంటే.. రూ.1.50 లక్షకు బిల్లులు పెట్టమని ప్రతిపాదనలు పంపించారు. ఏఈ, డీఈలు సంతకాలు చేశారు. అయితే తాను ఆ పనిని చూసి సంతకాలు చేస్తానని అధికారి చెప్పాడు. కనీసం క్వాలిటీ కంట్రోల్ వాళ్లు తనిఖీ చేసినట్లు లెటర్ తెచ్చినా సంతకం చేస్తానని చెప్పాడు. (ఈ పనిని ఇంకా క్వాలీటీ కంట్రోల్ అధికారులు పరిశీలించనట్లు సమాచారం.) ఇందుకు అధికార పార్టీ నాయకులు అంగీకరించకుండా ఈ విషయాన్ని ముఖ్య నాయకుడికి చెప్పారు. పై రెండు సంఘటనల నేపధ్యంలో ముఖ్య నాయకుడు ఆ అధికారితో మాట్లాడినట్లు సమాచారం. మేము చెప్పినట్లు వినకుంటే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ముఖ్య నేత అధికారికి సూచించినట్లు తెలుస్తోంది.
ఇదే విషయమై ముఖ్య నేత ఇంజనీరింగ్ శాఖ రాష్ట్ర స్థాయి ముఖ్య అధికారులతో మాట్లాడినట్లు తెలిసింది. ఇతను మేము చెప్పినట్లు వినడం లేదు.. బిల్లులు చేయడం లేదు.. మాకు ఇబ్బందిగా ఉంది.. ఇక్కడికి మరొకరిని వేయమని చెప్పినట్లు తెలిసింది. ఈ అధికారి స్థానంలోకి ఇంకొకరు.. ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. (ఇందుకు గానూ.. ముఖ్యనేత ఒకరిని సిఫార్సు చేస్తూ.. లెటర్ ఇచ్చినట్లు తెలిసింది.) ఈ నేపధ్యంలో సదరు అధికారి జిల్లా అధికారులను కలిసి పూర్తి సంఘటనను వివరించి తన గోడు విన్నవించుకున్నట్లు సమాచారం. ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకూడదని చేస్తున్న పనులు ఒకసారి చూడాలని అడగడమే ఆ అధికారి చేసిన నేరమైంది. ఒకే పనిని.. రెండు శాఖల ద్వారా చేపట్టి.. అందుకు బిల్లులు చెల్లించమంటే.. ఎలా చేయాలి ? క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించిన లెటర్ లేకుండా.. బిల్లుల కోసం సంతకాలు చేస్తే.. భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు వస్తే.. ఎవరు కాపాడుతారని... అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు జిల్లా కేంద్రంలోని అన్ని శాఖల్లోనూ.. ఇదే ప్రధాన చర్చనీయాంశంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2022-12-15T23:19:22+05:30 IST