క్లాప్‌పై పునఃసమీక్షిస్తాం
ABN, First Publish Date - 2022-08-04T05:30:00+05:30
క్లాప్ కార్యక్రమంపై పురపాలక మంత్రి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఎండీ, సీడీఎంఏతో పునఃసమీక్షించి ప్రజలకు యోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా పేర్కొన్నారు. నగరంలో రూ.60, మురికివాడలో రూ.40 చెత్త పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కడప కార్పొరేషన్లో గురువారం కమిషనర్ ప్రవీణ్‌చంద్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది.
నగరంలో రూ.60, మురికివాడల్లో రూ.40 వసూలు
ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా
కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో క్లాప్ పై వాడీ వేడి చర్చ
కడప(ఎర్రముక్కపల్లి), ఆగస్టు 4: క్లాప్ కార్యక్రమంపై పురపాలక మంత్రి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఎండీ, సీడీఎంఏతో పునఃసమీక్షించి ప్రజలకు యోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా పేర్కొన్నారు. నగరంలో రూ.60, మురికివాడలో రూ.40 చెత్త పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కడప కార్పొరేషన్లో గురువారం కమిషనర్ ప్రవీణ్‌చంద్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంతో పాటు మేయర్ సురేశ్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా 26 అంశాలతో కూడిన అజెండాను ప్రవేశపెట్టగా కార్పొరేటర్లు పాకా సురేశ్, మక్బూల్‌బాషా మాట్లాడుతూ క్లాప్ కార్యక్రమం చాలా ఇబ్బందికరంగా మారిందని వివరించారు. దీనిపై చర్చించిన అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ చెత్తపన్ను వసూలుకు సంబంధించి మెగా డ్రైవ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీని వలన ప్రజలు కార్పొరేటర్లను తిరస్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి చెప్పి ఆగ్రిమెంట్ చేయించుకున్నారని మండిపడ్డారు. దీనిపై పునఃసమీక్ష చేసేందుకు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే కడప నగరాభివృద్ధి సుందరీకరణలో భాగంగా పారిశుధ్యం, స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి తీర్చిదిద్దుతామన్నారు. నిర్దేశించిన కాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచుతామన్నారు. మేయర్ మాట్లాడుతూ నగరంలో తాగునీరు, పరిశుభ్రత, పారిశుధ్యంతో పాటు సుందరీకరణకు కూడా అధిక ప్రాధాన్యతనిచ్చి పనులు చేపడతామని అన్నారు. ఇంటింటికి చెత్త సేకరణపై పలు డివిజన్ల కార్పొరేటర్లు ఎదురయిన సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. మేయర్ స్పందిస్తూ నిర్దిష్ట ప్రణాళికతో చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చెత్త సేకరణ చేస్తామని తెలిపారు.
కమిషనర్ సీరియస్:
చెత్త పన్నులకు సంబంధించి కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా డ్రైవ్ నిర్వహించి వసూలు చేయడంతో ప్రజలు తిరస్కరించారని 31 డివిజన్ కార్పొరేటర్ షఫి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఒక వలంటీర్‌ను స్థానికుడు ప్రశ్నించగా కమిషనర్ ఆదేశాల మేరకు పన్ను వసూలు చేస్తున్నట్లు చెప్పిన వాయిస్ రికార్డింగ్‌ను సభలో వినిపించారు. దీనిపై కమిషనర్ కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత వలంటీర్‌ను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. దీనిపై మేయర్, ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే స్పందిస్తూ వలంటీర్‌ను సస్పెండ్ చేయడం సమస్యకు పరిష్కారం కాదని, దీనిపై ఆలోచన చేయాలని సూచించారు. కమిషనర్ స్పందిస్తూ తానెవరికీ తప్పనిసరిగా వసూలు చేయాలని చెప్పలేదని నిబంధనల ప్రకారం మాత్రమే బకాయిలు వసూలు చేయమని సూచించినట్లు తెలిపారు. అంతకుముందు కౌన్సిల్ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన 26 అంశాలతో పాటు ప్రధానంగా నగరంలో అన్ని బీటీ, సీసీ రోడ్లు పూర్తి చేసి కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నగరంలో తాగునీటి సరపరా వ్యవస్థను శాశ్విత ప్రతిపాదికకన మరింత మెరుగు పరుస్తామన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు బి.నిత్యానందరెడ్డి, షేక్ ముంతాజ్‌బేగం, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.
కాలువ వెడల్పు పేరుతో పేదల ఇళ్లను కూల్చొద్దు
సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య
కడప(ఎర్రముక్కపల్లి),ఆగస్టు 4: కడప నగరంలో వరద కాల్వల వెడల్పు పేరుతో పేదల ఇళ్లను కూల్చొద్దని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఆక్రమణల పేరుతో నిర్మాణాల తొలగింపుతో పాటు చెత్త పన్ను అడ్డుగోలు వసూళ్లతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నా రంటూ కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సీపీఐ నేతృత్వంలో గురువారం ఆందోళన చేపట్టారు. నగరపాలక సంస్థ పాలక జనరల్ బాడీ సమావేశం జరుగుతుండడంతో సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కార్పొరేషన్లోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు వీరి మధ్య తోపులాట. ఈ సందర్భగా జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ కడప నగరంలో ఇస్టం వచ్చినట్లు బలవంతంగా చెత్త పన్ను వసూళ్ల చేపడుతున్నారన్నారు. బుగ్గవంక అభివృద్ధి పనుల్లో ఆక్రమణలో ఉన్న కడప మొదటి మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి రవి గ్రూప్ థియేటర్స్‌ను, వరద కాలువ వెడల్పు పనుల్లో మేయర్ సురేశ్‌బాబుకు చెందిన అప్సర గ్రూప్ థియేటర్స్ వద్ద కాలువ ఆక్రమణలు, ఆర్టీసీ బస్టాండ్ వద్ద పంట కాలువల ఆక్రమణలైన బడాబాబుల భవనాలు మాత్రం కూల్చలేదన్నారు. అయితే పేదల ఇళ్లపై ప్రతాపం చూపడం దారుణమన్నారు. అనంతరం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగరకార్యదర్శి ఎన్.వెంకటశివ, కార్యవర్గ సభ్యులు పి.కృష్ణమూర్తి, ఎన్వీ సుబ్బారెడ్డి, ఏవీ రమణ, విజయలక్ష్మి, సీపీ నగర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T05:30:00+05:30 IST