కడప జిల్లాది ప్రత్యేక స్థానం
ABN, First Publish Date - 2022-03-05T05:40:00+05:30
కడప జిల్లాకు చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉందని, గొప్ప తత్వవేత్తలు, వాగ్గేయకారులు, మేధావులు, స్వాతంత్య్ర సమరయోధులకు కడప జిల్లా పుట్టినిల్లుగా ఉందని రాష్ట్ర గవర్నర్, వైవీయూ కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శుక్రవారం వైవీయూలోని సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో 9, 10వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలో హాజరైన గవర్నర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 15 ఏళ్ల కాలంలోనే వైవీయూలో విద్యాబోధన, పరిశోధన, సేవ వైపు గణనీయమైన మార్పు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.
పట్టాలు పొందిన విద్యార్థులు అణగారిన వర్గాలకు సేవలందించాలి
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
వేడుకగా వైవీయూ స్నాతకోత్సవం
మంత్రి ఆదిమూలపు సురేశ్ హాజరు
బీవీఆర్ మోహన్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం
కడప వైవీయూ, మార్చి 4: కడప జిల్లాకు చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉందని, గొప్ప తత్వవేత్తలు, వాగ్గేయకారులు, మేధావులు, స్వాతంత్య్ర సమరయోధులకు కడప జిల్లా పుట్టినిల్లుగా ఉందని రాష్ట్ర గవర్నర్, వైవీయూ కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శుక్రవారం వైవీయూలోని సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో 9, 10వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలో హాజరైన గవర్నర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 15 ఏళ్ల కాలంలోనే వైవీయూలో విద్యాబోధన, పరిశోధన, సేవ వైపు గణనీయమైన మార్పు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. యూనివర్శిటీ సమగ్రమైన అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ నాణ్యమైన చదువులతో పాటు మెరుగైన అక్విడేషన్ ర్యాంకు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులకు బంగా రు పతకాలు కేవలం అలంకారప్రాయంగా ఉండకూడదని, సమాజంలో అణగారిన వర్గాలకు, అవసరార్థులకు సేవలందించే విధంగా ఉండాలని కోరారు. నూ తన తరానికి పట్టాలు అందుకున్న విద్యార్థులు మార్గదర్శకంగా నిలువాలని కోరారు. యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ పొందుతున్న సీయంట్ సంస్థ అధినేత పద్మశ్రీ బీవీఆర్ మోహన్‌రెడ్డి, వైవీయూ డాక్టరేట్లు బంగారు పతకాలు అందుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
స్నాతకోత్సవంలో 33 పీహెచ్‌డీ పట్టాలు
వైవీయూ 9, 10వ స్నాతకోత్సవంలో 33 మందికి పీహెచ్‌డీ పట్టాలు, 86 మందికి బంగారు పతకాలు, 7,592 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలను ప్రదానం చేశామని వీసీ సూర్యకళావతి అన్నారు. వైవీయూ గౌరవ డాక్టరేట్‌ను పద్మశ్రీ బీవీఆర్ మోహన్‌రెడ్డికి అందించడం సంతోషంగా ఉంద న్నారు. 2020 సంవత్సరానికి సంబంధించి ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో వైవీయూకు 101 నుంచి 150 స్థానంలో చోటుదక్కడం ఎంతో గర్వకారణమన్నారు.
గౌరవ డాక్టరేట్ ప్రదానం
వైవీయూ 9, 10 స్నాతకోత్సవంలో సీయంట్ టెక్నాలజీ సంస్థ అధ్యక్షులు, పద్మశ్రీ బీవీఆర్ మోహన్‌రెడ్డికి మంత్రి ఆదిమూలపు సురేశ్, వీసీ సూర్యకళావతి చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందించారు. అలాగే పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందిన 33 మందికి పట్టాలు ప్రదానం చేశారు. 86 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందించారు. 7,592 మందికి డిగ్రీ, పీజీ పట్టాలు స్నాతకోత్సవంలో ప్రదానం చేశారు.
సాంకేతికతలో నూతన మార్పులు : బీవీఆర్ మోహన్‌రెడ్డి
సాంకేతికలో నూతన మార్పులు వస్తున్నాయని సీయంట్ టెక్నాలజీ సంస్థ అధ్యక్షులు, పద్మశ్రీ బీవీఆర్ మోహన్‌రెడ్డి అన్నారు. కరోనా మహమ్మారి సందర్భంగా సామాజిక జీవనంలో ఒడిదుడుకులను చవిచూశామని, ప్రస్తుతం ప్రపంచం నూతన సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. టెక్నాలజీ ద్వారానే కొవిడ్ వైరస్ వ్యాక్సినేషన్ కనుగొనుటకు సాధ్యపడిందన్నారు. సాంకేతికతను ప్రతిఒక్కరూ అంది పుచ్చుకోవాలన్నారు. విలువలతో కూడిన నాయకత్వం మొదటి నుంచి అలవర్చుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులు : మంత్రి
ఉన్నత విద్యారంగాన్ని ఆరోగ్యకరమైన ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి సమూల మార్పులు చేపడుతున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అధ్యాపకులు బోధన, పరిశోధన, సేవా రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. వైవీయూ ఇంజనీరింగ్ కళాశాల మౌలిక వసతులకోసం రూ.66 కోట్లు, సీపీబ్రౌన్ భాషా పరిశోధనకు రూ.55 కోట్లు నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పట్టాలు పొందిన విద్యార్థులు సమాజంలో మంచి విలువలతో రాణించాలన్నారు.
Updated Date - 2022-03-05T05:40:00+05:30 IST