సర్దుబాటు పేర అక్రమ బదిలీలు
ABN, First Publish Date - 2022-12-16T23:28:25+05:30
మున్సిపల్ టీచర్లకు సర్వీసు రూల్స్‌లో జాప్యం కారణంగా రెగ్యులర్ బదిలీల ప్రక్రి య త్వరగా జరగాలని పని సర్దుబాటు పేర విద్యాశాఖాధికారులు అడ్డదిడ్డంగా బదిలీలు చేశారనే విమర్శలు ఉపాఽధ్యాయ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.
117 జీఓకు విరుద్దంగా సాగిన ప్రక్రియ
రెగ్యులర్ టీచర్లను బదిలీ చేసిన వైనం
విమర్శిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు
ప్రొద్దుటూరు అర్బన్, డిసెంబరు 15: మున్సిపల్ టీచర్లకు సర్వీసు రూల్స్‌లో జాప్యం కారణంగా రెగ్యులర్ బదిలీల ప్రక్రి య త్వరగా జరగాలని పని సర్దుబాటు పేర విద్యాశాఖాధికారులు అడ్డదిడ్డంగా బదిలీలు చేశారనే విమర్శలు ఉపాధ్యాయ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. వివరాల్లోకెళితే 13 తేదీన జిల్లాలో 46 మంది ఉపాధ్యాయులను పని సర్దు బాటు పేరు తో పలు పాఠశాలలకు బదిలీలు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి సి.దేవరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సర్దుబాటు ప్రక్రియ జీఓ నెంబరు 117 అనుసరించి చేపట్టినట్లు జిల్లా విద్యాధికారులు ఉత్తర్వుల్లో వెల్లడించారు. కానీ ఇందులో ఆ జీఓకు విరుద్దంగా నియామకపు ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ టీచర్లను తీసుకెళ్లి ఎలిమెంటరీస్కూళ్లలో వేసినట్లు, సబ్జెక్టు సంబంధంలేని చోట డిప్యుటేషన్ వేయడంపై పలు విమర్శలకు తావిస్తోంది. ఎక్సెస్ టీచర్లను కాకుండా రెగ్యులర్ టీచర్లను డిప్యుటేషన్ వేయడంపై కూడా తప్పుపడుతున్నారు.
ఎక్సెస్ టీచర్ల సర్దుబాటు సాకుతో...
ప్రొద్దుటూరులో ఐదు మున్సిపల్ పాఠశాలలు మూత పడడంతో ఆ టీచర్లను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయవలిసి వుంది. పిల్లలు తక్కువగావుండి ఎక్కువ మంది టీచర్లు వున్నచోటి నుంచి టీచర్లు లేక పిల్లలు ఎక్కువగా ఉన్న పాఠశాలల కు సర్ధుబాటు చేయాలని కోరుతూ ఇందుకోసం ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖా అఽధికారులను డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో మూత పడిన స్కూళ్లల్లోని టీచర్లను సర్దుబాటు చేయడంలో భాగంగా కొందరు టీచర్లు ఇదే అదునుగా విద్యాశాఖాధికారులతో సర్దుబాటు చేసుకుని డిప్యుటేష న్లు వేయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. మరికొందరిని అనవసరంగా బదిలీ చేసినట్లు చెబుతున్నారు. రామేశ్వరం ప్రైమ రీ స్కూలులో రెగ్యులర్ టీచరు కె.బాగ్యలక్ష్మీ అవసరమున్నా ఆమెను డీబీసీఎస్ మోడంపల్లికి డిప్యుటేషన్ వేశారు.
18వ వార్డు మున్సిపల్ స్కూలు నుంచి ఉపాధ్యాయురాలు తిరుమ ల దేవిని రామేశ్వరానికి బదిలీ చేశారు. పిల్లలు తక్కువగా వుండి టీచర్లు ఎక్కువగా వుంటే అక్కడి నుంచి సర్దుబాటు చేయాలి కానీ అక్కడ టీచరు అవసరం వున్నా అక్కచి నుంచి మరో స్కూలుకు వేయడం117 జీఓ నిబంధనలకు విరుద్దమ ని భావిస్తున్నారు. రామేశ్వరం పేట ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు టి.నరసింహులును రామేశ్వరం హైస్కూలుకు, కొత్త కొట్టాల ఉర్దూ ప్రైమరీ స్కూల్ ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు ఎం.నరేష్‌ను మోడంపల్లె ఉర్దూ హైస్కూల్‌కు హిందీ టీచర్లుగా డిప్యుటేషన్ వేశారు. వీరిద్దరికీ హిందీ సబ్జెక్టుతో సంబంధంలేకున్నా వీరిని ఆ సబ్జెక్టు టీచర్లుగా డిప్యుటేషన్ వేయడంపై ముక్కున వేలేసుకుంటున్నారు. టీచర్లను సంబంధంలేని విధంగా బదిలీ చేయడం జిల్లా వ్యాప్తంగా అనేకం ఉన్నాయి.
చౌడేశ్వరీ నగర్‌లో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడిని కాలేజీరోడ్డులోని మ క్కా మసీదు ఉర్దూ స్కూలుకు తెలుగు పోస్టు లేకున్నా అక్కడికి డిప్యుటేషన్ వేసినట్లు సమాచారం. చాపల మార్కెట్ స్కూల్లో 26 మంది పిల్లలకు ఇద్దరు టీచర్లు వుండగా అక్కడి నుంచి ఒక టీచరును డిప్యుటేషన్‌పై మరో చోటికి బదిలీ చేసి సింగల్ టీచరు బడిగా మార్చడం పలు విమర్శలకు తావిస్తోంది.
ఎంఏయూడీ నిబంధనలకు తూట్లు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవల్‌పమెంటు డైరెక్టరు ఇచ్చిన ఆదేశాలకు విర్దుద్దంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న టీచర్లను మండల పరిధిలోని ఎంపీపీ స్కూళ్ళకు మా ర్చరాదని నిబంధనలున్నా ఈ సర్దుబాటు ఉత్తర్వుల్లో ఆ నిబంధనలకు తూట్లు పొడిచారని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. డ్రైవరు కొట్టాల మున్సిపల్ ప్రైమరీ స్కూలు లో పనిచేస్తున్న ఉమాశ్రీవాణిని దొరసానిపల్లె పంచాయితీ జంగంపేట ఎంపీపీ స్కూలుకు, 13 వవార్డు శంకరావు వీధి మున్సిపల్ ప్రైమరీ స్కూలు నుంచి ఒక ఉపాధ్యాయురాలిని గోపవరం పంచాయితీ భగత్‌సింగ్ కాలనీ ఎంపీపీఎస్ స్కూ లుకు, మూతపడిన వేంకటేశ్వర్ల పేట మున్సిపల్ ప్రైమరీ స్కూలు టీచరును కొత్తపల్లె పంచాయితీ అమృతనగర్ ఎంపీయూపీ స్కూలుకు డిప్యుటేషన్ వేశారు. ఇలా అడ్డదిడ్డంగా డిప్యుటేషన్లు వేయడంపై కొందరు ఉపాధ్యాయులు తమ ఆవేదనను బహిరంగంగా వెల్లడిస్తున్నారు.
ఈ ఉత్తర్వుల్లో కొంద రు టీచర్లు విద్యాశాఖ అధికారులకు ముడుపులు చెల్లించి తమకు కావలిసిన చోటికి డిప్యుటేషన్ వేయించుకున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. టీచర్లను బోధనేతరుల పనిలో పెట్టరాదని స్పష్టమైన ఆదేశాలున్నా ఇంకా కొందరు టీచర్లు విద్యాశాఖా కార్యాలయాల్లో ఇతర సంస్థల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఒక టీచరు తన సర్వీసు మొత్తంలో ఐదేళ్లు మాత్రమే ఇతర సంస్థ ల్లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహించవచ్చనే నిబంధనలున్నా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న టీచరు ఏకంగా ఇప్పటికి ఏడేళ్ళకు పైగా బోధనేతర విధుల్లో వుంటున్నట్లు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.
ఈ టీచరు ఇటీవల జిల్లా విద్యాశాఖా కార్యాలయానికి డిప్యుటేషన్ వేయించుకున్న ట్లు సమాచారం. జిల్లా విద్యాశాఖా అధికారులు ఇచ్చిన పని సర్ధుబాటు ఉత్తర్వులతో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలని మండల, జిల్లా విద్యాధికారులకు పలువురు టీచర్లు మొరపెట్లుకున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వుల్లో మార్పులు జరిగే వర కు తాము తమ స్కూళ్ల నుంచి రిలీవ్ కామని తేల్చిచెప్పినట్లు చెబుతున్నారు. విద్యాశాఖాధికారులు ఈ పొరపాట్లను సరిదిద్దుతారా లేదా అనేది వేచిచూడాలి. ఈ డిప్యుటేషన్ ప్రక్రియ పై వివరణ కోసం మండల విధ్యాధికారిని ఫోన్‌లో సంప్రదించగా ఆమె అందుబాటులోకి రాలేదు.
Updated Date - 2022-12-16T23:28:27+05:30 IST