కన్నీటి పంట
ABN, First Publish Date - 2022-12-15T23:22:02+05:30
ఆరుగాలం కష్టపడి పండించిన పంట రైతన్నకు కన్నీరు మిగుల్చుతోంది. నిన్నటి వరకు ఆశాజనకంగా ఉన్న వంగ ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీంతో అన్నదాతలు నష్టాలను చవిచూస్తున్నారు. ధరలు తగ్గిపోవడంతో పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక కుమిలిపోతున్నారు.
వంగ ధర ఢమాల్
నష్టాల బాటలో రైతన్నలు
కేజీ రూ.20 నుంచి రూ.4కు పడిపోయిన ధర
చేసేది లేక తోటల్లోనే వదిలేస్తున్న వైనం
ఆరుగాలం కష్టపడి పండించిన పంట రైతన్నకు కన్నీరు మిగుల్చుతోంది. నిన్నటి వరకు ఆశాజనకంగా ఉన్న వంగ ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీంతో అన్నదాతలు నష్టాలను చవిచూస్తున్నారు. ధరలు తగ్గిపోవడంతో పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక కుమిలిపోతున్నారు. ప్రస్తుతం వంగ ధర కేజీ రూ.20 నుంచి రూ.4కు పడిపోవడంతో దిక్కుతోచక పంటను తోటల్లోనే వదిలేస్తున్నారు.
ములకలచెరువు, డిసెంబరు 15: తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట మండలాల్లో రైతులు వంకాయ పంట వెయ్యి ఎకరాలకు పైగా సాగు చేశారు. ఎకరా సాగుకు రూ.లక్ష వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో వంగ ధరలు పతనం కావడంతో నోటికాడికి రాకుండా పోతోంది. 15 రోజుల క్రితం వరకు కేజీ రూ.20 వరకు పలికిన ధర పతనమై రూ.4కు చేరింది. ఈ ప్రాంతంలో పండిన వంకాయలను వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసి తమిళనాడు రాష్ట్రం చెన్నై మార్కెట్‌కు తరలించి విక్రయిస్తారు. అలాగే పలువురు రైతులు పండిన వంకాయలను స్వయంగా వారే చెన్నైకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో తమిళనాడుతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో పంట సాగు భారీగా పెరగడంతో వంకాయలు చెన్నై మార్కెట్‌కు పోటెత్తుతున్నాయి. దీంతో ఇక్కడ పండించిన వంకాయలకు డిమాండ్ భారీగా తగ్గిపోవడంతో ధరలు పతనం అవడానికి కారణమైంది. దీంతో రైతులకు పెట్టుబడి కూడా రాక తోటల్లోనే వంకాయలను వదిలేస్తున్నారు. వంగను విక్రయించేందుకు ఐచర్ వాహనాలు బాడుగకు మాట్లాడుకుని చెన్నైకు తీసుకెళితే కేజీపై రూ.3.50 ఖర్చు వస్తోంది. తీరా అక్కడికి తీసుకెళ్లినా అడిగే వారు లేకుండా పోయారని, అక్కడున్న వారిని బతిమ లాడి విక్రయించినా కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
వంకాయలను తోటలోనే వదిలేశా..
- రెడ్డిశేఖర్, రైతు, గూడుపల్లె
ధరలు పతనం కావడంతో చేసేది లేక వంకాయలను కోయకుండా తోటలోనే వదిలేశా. ఒకటిన్నర ఎకరాలో రూ.1.50 లక్షలు ఖర్చు చేసి పంట సాగు చేశా. తీరా దిగుబడి వచ్చే సమయంలో ధర పడిపోయింది. వంకాయలను అడిగే నాథుడే లేరు. దీంతో తీవ్రంగా నష్టపోయాను.
Updated Date - 2022-12-15T23:22:04+05:30 IST