ఇచ్చినట్టే ఇచ్చి.. రద్దుకు యత్నం
ABN, First Publish Date - 2022-12-16T23:59:12+05:30
జగనన్న ఆశయాలకు తూట్లు పడేలా ఉంది.. మండలంలోని దుద్యాల గ్రామం, వడ్లపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్ కాలనీ. ఈ కాలనీలో పెద్దకోడివాండ్లపల్లె, పెద్దజంగంపల్లెకు చెందిన 17 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను మంజూరు చేశారు.
మౌలిక వసతులు కల్పించి ఇళ్ల నిర్మాణాలకు డుమ్మా
వైసీపీ తమ్ముళ్ల ఆంతర్యం ఏమిటో ?
ఆవేదనలో లబ్ధిదారులు
సీఎం జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ప్రతి పేదవాడికి అన్ని వసతులతో కూడిన కాలనీలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో జగనన్న కాలనీలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వైసీపీ తమ్ముళ్లు ఈ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి రద్దు చేసేందుకు యత్నిస్తున్నారు. జగనన్న కాలనీ పేరుతో బోరు వేశారు, మోటారు బిగించారు, పైపులైను, ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇచ్చారు. ఇంతలో ఏమైందో.. ఏమో కానీ ఈ స్థలాలు నివాసయోగ్యం కాదంటూ రద్దు చేయించేందుకు సిఫార్సులు చేయిస్తున్నారు. పూర్తి వివరాలిలా..
సంబేపల్లె, డిసెంబరు 16: జగనన్న ఆశయాలకు తూట్లు పడేలా ఉంది.. మండలంలోని దుద్యాల గ్రామం, వడ్లపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్ కాలనీ. ఈ కాలనీలో పెద్దకోడివాండ్లపల్లె, పెద్దజంగంపల్లెకు చెందిన 17 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను మంజూరు చేశారు. ఈ కాలనీలో బోరు వేశారు, మోటారు బిగించారు, పైపులైన్ వేశారు. ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇచ్చారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ బోరులో నీరు సంవృద్ధిగా పడడంతో వైసీపీ తమ్ముళ్ల ఆలోచన మారినట్లు ఉంది. ఈ భూమిని ఆక్రమించుకొని పండ్లతోటలు ఏమైనా పెట్టాలని భావించారో ఏమో తెలియదు కానీ అధికారులపై ఒత్తిడి చేసి నివాసయోగ్యం కాదంటూ లబ్ధిదారులను ఒప్పించి రద్దు చేయించేందుకు సిఫారసులు చేశారు.
వాస్తవ పరిస్థితి
దుద్యాల గ్రామం వడ్లపల్లె సమీపంలోని జనన్న లేఅవుట్ కాలనీ నివాసయోగ్యానికి వీలుకానప్పుడు అధికారులు అనాలోచితంగా ఎందుకు ఉపాధి నిధులు ఖర్చు చేశారు లబ్ధిదారులు అంటున్నారు. ఈ కాలనీలో భూమి చదును చేయడం, మౌలిక వసతులు కల్పన కింద బోరు తవ్వించడం, కరెంట్ సౌకర్యం, బోరు మోటారు బిగించడం, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, పైపులైన్ ఏర్పాటు ఇన్ని వసతులు కల్పించిన తర్వాత ఇప్పుడు ఈ స్థలం నివాసయోగ్యానికి అనువు కాదని ఎందుకు అంటున్నారో తెలియాల్సి ఉందని అంటున్నారు. ఇంత ఖర్చు ఎందుకు చేశారో అధికారులు చెప్పాలి. దీని వెనుక నీరు సంవృద్ధిగా పడడంతో భూమిని కాజేయాలనే ఉద్దేశ్యంతో వైసీపీ తమ్ముళ్లు పన్నాగం పన్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గృహాలు కట్టని ఈ లేఅవుట్ కాలనీలో ప్రతినెల తాగునీటి వసతి ఏర్పాటు కోసం పంచాయతీకి అదనంగా కరెంటు బిల్లులు రావడం విశేషం. డీకేటీ భములను ఇప్పటికీ కాజేసేందుకు మండలంలో పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున బోగస్ డీకేటీ పట్టాలు దర్శనం ఇవ్వడమే నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ కోణంలో పనిలో పనిగా 2008-10 సంవత్సరంలో డీకేటీ పట్టాలు ఇచ్చినట్లు బోగస్ డీకేటీ పట్టాలను సృష్టించినట్లు మండలంలో మరో వైసీపీ వర్గం నాయకులు పెదవి విరుస్తున్నారు.
ప్రతినెల కరెంటు బిల్లు వస్తుంది..
దుద్యాల వడ్లపల్లె సమీపంలోని జగనన్న లేఅవుట్ కాలనీలో మౌలిక వసతుల్లో భాగంగా తాగునీటి బోరు వేయడంతో ప్రతి నెల మినిమం బిల్లు వస్తోంది. లబ్ధిదారులకు మం జూరు చేసిన డీఫారాలు నివాస యో గ్యానికి పనికిరాదని వెనక్కి ఇచ్చారు. జగనన్న లేఅవుట్ కాలనీని రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాం.
- మోహన్‌బాబు, పంచాయతీ సెక్రటరీ
మౌలిక వసతుల కోసం రూ.3కోట్లు కేటాయించాం..
దుద్యాల గ్రామం వడ్లపల్లె సమీపంలోని జగనన్న లేఅవుట్ కాలనీలో తాగునీటి బోరు తవ్వించేందుకు, పైపులైన్ ఏర్పాటు చేసేందుకు రూ.మూడు లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో రూ.90 వేలు బిల్లులు కూడా చెల్లించినట్లు తెలియజేశారు.
- హరినాధ్, ఏఈ, ఆర్‌డబ్ల్యుఎస్
Updated Date - 2022-12-16T23:59:14+05:30 IST