టమోటాకు పగుళ్లు..
ABN, First Publish Date - 2022-12-16T23:54:26+05:30
కరువు పీడిత ప్రాంతాల్లో అన్నమయ్య జిల్లా ఒకటి. ప్రధానంగా ఇక్కడ రైతులు టమోటాపై ఆధారపడి పంట సాగు చేయడం విశేషం. జిల్లాలో రాయచోటి, కలకడ, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాల్లో విస్తారంగా పంటలు సాగు చేస్తుంటారు.
తుఫాన్‌తో మసిబారిన తోటలు
సగానికి పైగా దెబ్బతిన్న కాయలు
నష్టాల బాటలో రైతులు
సంబేపల్లె, డిసెంబరు 16: కరువు పీడిత ప్రాంతాల్లో అన్నమయ్య జిల్లా ఒకటి. ప్రధానంగా ఇక్కడ రైతులు టమోటాపై ఆధారపడి పంట సాగు చేయడం విశేషం. జిల్లాలో రాయచోటి, కలకడ, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాల్లో విస్తారంగా పంటలు సాగు చేస్తుంటారు. కాసులు కురిపించే పంట ఏదైనా ఉందంటే అది టమోటా అనే చెప్పవచ్చు. కాగా మండల వ్యాప్తంగా 1205 ఎకరాలు టమోటా సాగు చేశారు. రైతులు ప్రస్తుతం ఒక పక్క ధర లేక మరోపక్క మాండస్ తుఫాన్‌తో విలవిల్లాడుతున్నారు. ధరలు లేక పెట్టిన పెట్టుబడే రాలేదు. దీనికి తోడు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా టమోటా రైతుల పరిస్థితి తయారైంది. వరుసగా నాలుగు రోజుల పాటు తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో టమోటా పగుళ్లు, తెగుళ్లు సోకాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. మండలంలో టమోటా రైతులను ఎవరిని పలకరించినా కన్నీటి వ్యధలే. అప్పులు, నష్టాలు వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఒక్కకాయ కూడా పనికిరాకుండా పోయింది
ఆయన పేరు కృష్ణయ్య. ఊరు రెడ్డివారిపల్లె గ్రామం ఎగువ రాజుగారిపల్లె. నల్లగంగమ్మ క్రాస్ రోడ్డు వద్ద మూడు ఎకరాలపైన పొలం లీజుకు తీసుకొని టమోటా సాగు చేశారు. సుమారు రూ.7 లక్షలు ఖర్చు చేసినట్లు తెలియజేశారు. ధర లేకపోవడంతో రూ.4 లక్షలు వచ్చినట్టు తెలిపారు. రూ.3 లక్షలు ఇంకా నష్టంలోనే ఉన్నట్లు తెలిపారు. తోట చూస్తే తుఫాన్ ప్రభావంతో కాయలు మొత్తం పగుళ్లు భారి తోట మసిబారి పోయింది. ఒక్క కాయ కూడా పనికిరాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
సగానికి సగం పగుళ్లే..
ఆయన పేరు జరుగుమల్లి శంకరయ్య, ఊరు శెట్టిపల్లె గ్రామం గాండ్లపల్లె. ఒక ఎకరా టమోటా సాగు చేశారు. సుమారు ఒకటిన్నర లక్ష ఖర్చు చేసినట్లు తెలియజేశారు. ప్రస్తుతం రూ.20 వేలు మాత్రం వచ్చింది. తోటలో చూస్తే సగానికి సగం పగుళ్లు ఉన్న కాయలు ఉండడంతో కూలీలకు కాయలు కోసిన డబ్బులు కూడా రావడం లేదన్నారు. మార్కెట్‌కు తరలించేందుకు ఖర్చులు, కమీషన్లు, కూలీల డబ్బులు లెక్క వేస్తే చేతిగుండా పడుతున్నట్లు తెలిపారు. తోట చూస్తే మసివారిపోయింది. పెట్టుబడి కూడా రావడం గగనమే.
టమోటాకు పగుళ్లు వచ్చి మసిబారిపోయింది..
మండల వ్యాప్తంగా 1205 ఎకరాల్లో రైతులు టమోటా సాగు చేశారు. దిగుబడి చివరి దశలో ఉన్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా టమోటాకు పగుళ్లు వచ్చి తోటలు మసిబారిపోయి కాయలు రాలిపోయాయి. దాదాపు రూ.84 లక్షలు నష్టం వాటిల్లింది.
- అనిత, ఉద్యానశాఖ అధికారి
Updated Date - 2022-12-16T23:54:27+05:30 IST